ఎమ్మెల్యే మూడంకేయడం, అధికారులతో ఎడ్డెమంటే తెడ్డెమంటూ ప్రతిపక్ష పాత్ర పోషించడం ఆ నియోజకవర్గానికి కలిసొస్తోందా? మంత్రితో ఢీ అంటే ఢీ అన్నట్టుగా ఉండటం ప్లస్ అవుతోందా? కుల బలం చూపించి మరీ… తనకు కావాల్సిన పనులు చేయించుకుంటున్న ఆ శాసనసభ్యుడు ఎవరు? ఆయన విషయంలో టీడీపీ అధిష్టానం వైఖరి ఏంటి? రాజకీయ ఉద్దండులు ప్రాతినిధ్యం వహించిన అసెంబ్లీ నియోజకవర్గం శ్రీకాకుళం జిల్లా ఆమదాలవలస. ఇక టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యేగా వున్న కూన రవికుమార్ కూడా ఈసారి కేబినెట్‌లో మంత్రి పదవి ఆశించి భంగపడ్డారు. ఆ తర్వాతి నుంచి జిల్లాలో కుల సమీకరణలపై చర్చలు పెరిగాయి. టీడీపీ రాజకీయంగా కాళింగులకు ప్రాధాన్యత ఇవ్వడం లేదని, ఆమదాలవలసను నిర్లక్ష్యం చేస్తున్నారనే విమర్శలు తెర మీదికి వచ్చాయి. దాని ప్రభావమో, మరొకటోగాని… మెల్లిగా పరిస్థితుల్లో మార్పు కనిపిస్తోందని అంటున్నారు పొలిటికల్ పండిట్స్. ఎమ్మెల్యే కూన రవికుమార్ అనుచరులకు పార్టీ, ప్రభుత్వ పరంగా గుర్తింపు పెరుగుతుండటం ఇప్పుడు చర్చనీయాంశం అయింది.
జిల్లా కేంద్ర సహకార బ్యాంక్ ఛైర్మన్ గా శివ్వల సూర్యనారాయణ , టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా మొదలవలస రమేష్‌ను నియమించారు. వీళ్ళిద్దరూ కూన అనుచరులే. అలాగే పలు కార్పొరేషన్ డైరెక్టర్స్ పదవుల్లో కూడా ఎమ్మెల్యే వర్గానికి ప్రాధాన్యం దక్కుతోంది. అదే సమయంలో ఆమదాలవలస ముఖ చిత్రం మార్చేలా ప్రభుత్వం ఆధ్వర్యంలో పవర్ ప్లాంట్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ వచ్చింది. ఇక జిల్లాలో బలమైన కాళింగ సామాజికవర్గానికి ప్రతినిధిగా ఉన్న ఎమ్మెల్యే కూన రవికుమార్‌కు కూడా పబ్లిక్ అండర్‌టేకింగ్స్ కమిటీ ఛైర్మన్ పదవి దక్కింది. ఇలా… వరుసగా జరుగుతున్న పరిణామాల గురించి ఇప్పుడు ఆసక్తిగా మాట్లాడుకుంటున్నారు ఆమదాలవలసలో. మంత్రి పదవి రాకపోవడంతో అలకపాన్పు ఎక్కిన రవికుమార్‌ను బుజ్జగించేందుకు, పైగా ఆ సామాజికవర్గంలో వ్యతిరేకత రాకుండా చూసుకునేందుకు ప్రభుత్వం డ్యామేజ్ కంట్రోల్ మొదలు పెట్టిందన్న మాటలు వినిపిస్తున్నాయి. అలాగే.. తనకు మంత్రి పదవి రాదని తెలిసిన కొత్తల్లో కూన నిర్వహించిన బలప్రదర్శన కూడా కలిసివచ్చిందన్న విశ్లేషణలున్నాయి.
కాళింగ సామాజిక వర్గానికి అన్యాయం జరిగిందనే కోణంలో జరిగిన చర్చకు సమాధానంగా ఇచ్చాపురం నుంచి హ్యాట్రిక్ విజయం సాధించిన ఎమ్మెల్యే బెందాళం అశోక్‌కు ప్రభుత్వ విప్ పదవి, మాజీ జెడ్పీ చైర్మన్ కొడుకు చౌదరి అవినాష్‌కు డీసీఎంఎస్ ఛైర్మన్ పదవులు దక్కాయన్న వాదన సైతం ఉంది. అయితే… కూన రవికుమార్ ఆశించిన మంత్రి పదవి రాకున్నా… నియోజకవర్గానికి, తన మనుషులకు కావాల్సిన వాటిని సాధించుకుంటున్నారన్న అభిప్రాయం ఉంది. ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ఉన్న ఎక్కువ మంది ఎమ్మెల్యేలు మంత్రి అచ్చెన్నాయుడి కనుసన్నలలోనే నడుస్తుంటారు. ఆయన సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్ అన్నట్టుగా ఉంటుందట వ్యవహారం. అదే సమయంలో అచ్చెన్నాయుడి వ్యతిరేకవర్గం ముద్ర పడటం కూన రవికుమార్‌కు కలివచ్చిందన్న విశ్లేషణలు సైతం ఉన్నాయి. అది తమకు లాభించినట్టు భావిస్తోందట ఎమ్మెల్యే వర్గం. టీడీపీ జిల్లా అధ్యక్ష పదవికి అచ్చెన్న మరొకరిని ప్రపోజ్ చేసినా… చివరికి కూన రవికుమార్ ప్రధాన అనుచరుడు, సొంత సామాజికవర్గానికి చెందిన నాయకుడికి ఇప్పించుకోగలిగారు. అలాగే… జిల్లా రాజకీయాలను శాసిస్తున్న మంత్రి… ఆమదాలవలస విషయంలో మాత్రం జోక్యం చేసుకోవడం లేదట. కూనకు మంత్రి పదవి ఎపిసోడ్ తర్వాత జిల్లాలో కుల రాజకీయాల తుట్టె కదలడంతో అచ్చన్న కూడా లైట్ తీసుకుంటున్నట్టు తెలుస్తోంది. సమావేశం ఏదైనా సరే…ఎమ్మెల్యే కూన ప్రతిపక్ష పాత్ర పోషిస్తుండటం, అధికారులు తీరును తప్పుపట్టడం, అది ప్రత్యర్థులకు అస్త్రంగా మారుతుండటంతో…ఈ గొడవంతా ఎందుకనుకుని పార్టీ పెద్దలు కూడా మంత్రి పదవి తప్ప ఎమ్మెల్యే అడిగిన మిగతా పనులన్నీ చేసిపెడుతున్నట్టు తెలుస్తోంది. మిగతా వ్యవహారాలు ఎలా ఉన్నా… కూన వర్సెస్ అచ్చన్నగా సాగుతున్న ఆధిపత్యపోరుతో ఆమదాలవలస నియోజకవర్గానికి మాత్రం మేలు జరుగుతోందంటున్నారు స్థానికులు.