నల్లగొండ డీసీసీ అధ్యక్షుడి నియామకంపై ఆ మంత్రి తన అసంత్రుప్తిని ఎందుకు వ్యక్తం చేస్తున్నారు… తన లేఖలో ఆ సీనియర్ నేత పేర్కొన్న అంశాలేంటి.. డీసీసీ అధ్యక్షుడి నియామకానికి అన్న నై అంటుంటే.. తమ్ముడు మాత్రం సై అని ఎందుకు అంటున్నారు… డీసీసీ నియామకంతో ఉమ్మడి జిల్లా నేతలంతా ఒకవైపు… ఆ సీనియర్ నేత, క్యాబినెట్ మంత్రి మాత్రం మరోవైపు ఎందుకయ్యారు… తాజా ఎపిసోడ్ లో గతం తవ్వుకుంటే అందరి నష్టమేనని కాంగ్రెస్ క్యాడర్ ఎందుకంటుంది… నల్లగొండ జిల్లా హస్తం పార్టీలో డిసిసి అధ్యక్షుడి నియామకం చిచ్చు రాజేసింది. పున్నా కైలాష్‌ను జిల్లా పార్టీ అధ్యక్షుడిగా నియమిస్తూ అధిష్టానం తీసుకున్న నిర్ణయాన్ని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. తన అసంతృప్తిని తెలియజేస్తూ… సీఎంకు లేఖ రాశారాయన. గతంలో తనను, తన కుటుంబాన్ని అసభ్య పదజాలంతో దూషించిన వ్యక్తికి జిల్లా అధ్యక్ష పదవి ఇవ్వకూడదన్నది కోమటిరెడ్డి అభ్యంతరం. క్యాబినెట్ మినిస్టర్ హోదాలో ఆయన రాసిన లేఖ చుట్టూ ఇప్పుడు సరికొత్త రాజకీయ చర్చలు జరుగుతున్నాయి. కాంగ్రెస్ మార్క్ రాజకీయాలకు మరోసారి ఆజ్యం పోసినట్టయిందని మాట్లాడుకుంటున్నాయి రాజకీయ వర్గాలు. పున్నా కైలాష్ బీసీ, పద్మశాలి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి కావడం… బీసీ రిజర్వేషన్లు రాష్ట రాజకీయాల్లో కీలకంగా మారిన క్రమంలో ఇప్పుడు కోమటిరెడ్డి లేఖ కాకరేపుతోంది. దాదాపుగా మూడేళ్ళ క్రితం అప్పటి రాజకీయ పరిస్దితుల్లో జరిగిన వ్యవహారాలను సీనియర్ నేత అయిన కోమటిరెడ్డి ప్రస్తతం ప్రస్తావించడం, సీయంకు లేఖ రాయడంపై హస్తం పార్టీలోనే భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి బీజేపీలోకి వెళ్లినప్పుడు మునుగోడు ఉపఎన్నిక జరిగింది. అప్పుడు కాంగ్రెస్ భువనగిరి ఎంపీగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి…. తన తమ్ముడు రాజగోపాల్ రెడ్డిని గెలిపించాలని ఓ కార్యకర్తతో మాట్లాడిన వాయిస్… నాడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.
ఈ క్రమంలోనే ఒక అడుగు ముందుకేసిన మునుగోడు నియోజకవర్గానికే చెందిన అప్పటి టి-పిసిసి స్పోక్స్ పర్సన్, తాజాగా డిసిసి అధ్యక్షుడు పున్నా కైలాష్… వెంకట్ రెడ్డి మీద ఓ రేంజ్ లో తిట్లపురాణం అందుకున్నారు. ఎంత తమ్ముడు అయితే మాత్రం కాంగ్రెస్ ఎంపీగా ఉండి బీజేపీ అభ్యర్థిని గెలిపించమని కోరడం ఏంటన్నది ఆయన అభ్యంతరం. ఆ ఊపులోనే… పున్నా కైలాష్ మాట్లాడిన మాటలు.. కాంగ్రెస్ పార్టీ రాజకీయాలను రక్తికట్టించాయి. ఇక ఆ ఉప ఎన్నికలో బీజేపీ అభ్యర్థిగా రాజగోపాల్‌రెడ్డి ఓడిపోవడం, గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్‌లోకి రీ ఎంట్రీ ఇచ్చి ఆ పార్టీ తరపున మునుగోడు ఎమ్మెల్యేగా గెలవడం చకచకా జరిగిపోయాయి. ఇక్కడే ఇంకో ట్విస్ట్ కూడా ఉంది. గత ఎన్నికల్లో రాజగోపాల్ రెడ్డి విజయం కోసం పున్నా కైలాష్ గట్టిగా పనిచేయడం వల్లే మెజార్టీ పెరిగిందన్న అభిప్రాయం ఉంది. కానీ… ఆల్‌సెట్ అనుకుంటున్న టైంలో… కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తాజాగా లేఖ రాయడం వివాదాస్పదమైంది. ఆ వివాదం నివురుగప్పిన నిప్పులానే ఉందని, ఇప్పుడు బయటపడిందని చెప్పుకుంటున్నారు. తన కీలక అనుచరుడు గుమ్మల మోహన్ రెడ్డి కూడా డీసీసీ రేసులో ఉన్నటైంలో ఆ పీఠం పున్నాకు దక్కడాన్ని వెంకట్‌రెడ్డి జీర్ణించుకోలేకపోయారన్న చర్చ జరుగుతోంది.
తనపై వ్యక్తిగత విమర్శలు చేసిన పున్నా కైలాష్‌కు డీసీసీ ఇవ్వడం ఇష్టం లేదా… లేక తమ్ముడు ప్రాతినిధ్యం వహిస్తున్న మునుగోడు నియోజవవర్గానికి చెందిన వ్యక్తిని నియమించడాన్ని వ్యతిరేకిస్తున్నా అన్నది తేలాలంటున్నారు కొందరు. అయితే… కీలక, ప్రతిష్టాత్మక ఉప ఎన్నికలో కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన నాయకుడిగా ఆయన అన్న మాటల్ని రాజకీయ విమర్శగానే చూడాలన్నది హస్తం పార్టీలోనే ఉన్న ఓ అభిప్రాయం. అంతకు మించి పున్నాను కాంగ్రెస్‌పట్ల నిబద్ధత ఉన్న నాయకుడిగా చూడాలన్న అభిప్రాయాలు సైతం వ్యక్తం అవుతున్నాయి. గతాన్ని తవ్వుకుంటే అందరికీ చాలా ఉన్నాయని.. అలా తవ్వుకుంటూ పోతే ఎవరు తీసుకున్న గోతిలో వారే పడతారని అంటున్నారు మరికొందరు కాంగ్రెస్ నాయకులు. మీకు మీకు అన్నదమ్ముల మధ్య ఏమైనా ఉంటే ఇంట్లో చూసుకోండిగానీ… బీసీ బిడ్డకు అవకాశం వస్తే అడ్డుపడతారా అంటూ సొంత పార్టీలోనే నిరసనలు వ్యక్తం అవుతున్నాయి. అయినా…. AICC ప్రతినిధి ఒకరు వచ్చి నల్లగొండ జిల్లాలో నియోజకవర్గాల వారీగా సమీక్షలు నిర్వహించి, నేతల అభిప్రాయాలు తీసుకుని… నియామక ప్రక్రియ పూర్తి చేస్తే ఇప్పుడేంటి ఈ పంచాయితీ అంటున్నారు జిల్లా కాంగ్రెస్ నాయకులు. సీనియర్ నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉమ్మడి జిల్లా కీలక నేతలు పున్నా కైలాష్‌కు మద్దతు ప్రకటిస్తుంటే…. వెంకటరెడ్డి మాత్రం ఇలాలేఖ రాయడం తన గౌరవాన్ని తగ్గించుకోవడమేనని అంటున్నారు ఇంకొందరు నల్గొండ నేతలు.