ఒకప్పుడు అత్యంత సన్నిహితులు. నువ్వు లేక నేను లేనని సాంగులు సింగుకున్న వాళ్ళే. కట్ చేస్తే… ఇద్దరి మధ్య భీకరమైన శతృత్వం. ఆవతలాయన నోట్లో నుంచి మాట బయటికి వచ్చీరాక ముందే ఇవతలాయ కౌంటర్స్‌తో రెడీ అయిపోతున్నారు. ఒకరు మాజీ మంత్రి, మరొకరు సిట్టింగ్ ఎమ్మెల్యే. ఎవరా ఇద్దరు లీడర్స్? జాన్‌జిరిగీల మధ్య ఎందుకంత జగడం? గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు…గుడివాడ వైసీపీ నేత, మాజీ మంత్రి కొడాలి నాని. ఇద్దరిదీ ఒకే సామాజికవర్గం. సన్నిహితులు…స్నేహితులు కూడా. ఇంకా గట్టిగా చెప్పుకుంటే… ఇద్దరి మధ్య బీరకాయ పీచు చుట్టరికం కూడా ఉంది. ఒకప్పుడు చాలా బాగున్న సంబంధాలు… పొలిటికల్ పుణ్యమా అని ఐదేళ్ల నుంచి ఘోరంగా దెబ్బతిన్నాయి. 2019లో వైసిపి తరపున పోటీచేసి ఓడిపోయిన యార్లగడ్డ 2024కు వచ్చేసరికి టీడీపీ తరపున గన్నవరం నుంచే పోటీ చేసి గెలిచారు. తర్వాత నుంచి అవకాశం వచ్చిన ప్రతిసారి కొడాలి నానిని టార్గెట్ చేస్తున్నారాయన. గూగుల్ సంస్థకు భూములు కేటాయింపు మొదలు ఏ చిన్న అవకాశం వచ్చినా కొడాలి నాని నోరు తెరిచిన ప్రతిసారి వదలకుండా యార్లగడ్డ విమర్శలు చేయటం ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో చర్చగా మారింది. కొడాలి ప్రస్తుతం యాక్టివ్‌గా లేకున్నా వదలడం లేదు వెంకట్రావు. ఎనిమిదో తరగతి చదివిన కొడాలి నానికి AI లేదా ఐటీ గురించి వివరించినా అర్థం కాదని, ఓడిపోయిన తర్వాత గుడివాడ మొహం చూడకుండా అక్కడ ప్రజలపై కొడాలి కక్ష సాధిస్తున్నారని, దాక్కోటం కాదు దమ్ముంటే బయటకు రావాలి, పవర్ లేనపుడు కూడా మాట్లాడాలంటూ యార్లగడ్డ చేస్తున్న కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ఇద్దరివీ వేరువేరు నియోజకవర్గాలు అయినప్పటికీ యార్లగడ్డ కొడాలిని ఎందుకలా టార్గెట్ చేస్తున్నారన్న విషయంలో ఆసక్తికర చర్చ జరుగుతోంది. చిన్నప్పటి నుంచి పరిచయం ఉన్న ఇద్దరూ చాన్నాళ్ళు సన్నిహితంగానే ఉన్నారు. యార్లగడ్డ వెంకట్రావు రాజకీయాల్లోకి రావాలని అనుకున్నప్పుడు నానినే ఆయన్ని వైసీపీలోకి తీసుకువెళ్ళారట. ఇక 2019 ఎన్నికల్లో కొడాలి నాని స్నేహితుడు వల్లభనేని వంశీ పై యార్లగడ్డ వెంకట్రావు పోటీ చేసి స్వల్ప మెజారిటీతో ఓడిపోయారు. ఆ తర్వాత YCP పార్టీ అధికారంలోకి వచ్చింది. ఈ సమయంలో గన్నవరం నియోజకవర్గానికి యార్లగడ్డ వెంకట్రావు ఇన్చార్జ్‌గా ఉన్నారు. అదే సమయంలో టిడిపి నుంచి గెలిచిన వంశీని కొడాలి నాని జగన్ దగ్గరికి తీసుకువెళ్ళడంపై యార్లగడ్డ వెంకట్రావు రగిలిపోయారట. తనకు మాట మాత్రం చెప్పకుండా వంశీని తీసుకువచ్చి నియోజకవర్గంలో ఇబ్బంది పెట్టారన్నది కొడాలి విషయంలో యార్లగడ్డ కోపానికి కారణంగా చెప్పుకుంటున్నారు. నాని ద్వారా వంశీ జగన్‌ను కలిసినప్పటి నుంచు కటీఫ్ చెప్పేశారనేది వెంకట్రావు సన్నిహితుల మాట. రాజకీయంగా తనకు అనేక ఇబ్బందులు రావడానికి కారణమైన కొడాలిపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న యార్లగడ్డ వెంకట్రావు… అవకాశం కోసం ఎదురు చూశారట. ఈసారి టీడీపీ అధికారంలోకి రావడం, తాను ఎమ్మెల్యేగా గెలవడంతో… ఇదే మంచి టైం అనుకుని నాని నోరు తెరిస్తే నేనున్నానంటూ ఫైరైపోతున్నారు యార్లగడ్డ. కొడాలి నాని చేసిన పనికి ఐదేళ్ల పాటు వైసీపీలో నానా ఇబ్బందులు పడ్డానన్నది ఎమ్మెల్యే బాధ. చివరికి గన్నవరంలో పార్టీ కార్యాలయం ఖాళీ చేసి వెళ్లిపోగా..ఇన్చార్జి పదవి కూడా వంశీకి దక్కింది. అప్పట్లో గన్నవరం వైసీపీలో తనతో ఉన్నవారికి అండగా నిలవలేక, చివరికి కలిసి పని చేయాలని జగన్ చెప్పినా చేయలేక యార్లగడ్డ తీవ్ర మధనపడ్డారట. వీటన్నిటికీ కారణం కొడాలి నానియేనని భావించిన యార్లగడ్డ వెంకట్రావు టైం చూసి రివెంజ్ తీర్చుకుంటున్నట్టు తెలుస్తోంది. 2024 ఎన్నికల సమయంలో…. అవసరమైతే గుడివాడలో కొడాలి నాని మీద కూడా పోటీ చేయడానికి సిద్ధమన్న యార్లగడ్డ వెంకట్రావు ప్రకటన చర్చనీయాంశమైంది. అయితే ఆ తర్వాత పరిణామాల్లో ఆయన గన్నవరం నుంచి పోటీ చేసి గెలవడంతో పాటు పార్టీ కూడా అధికారంలోకి వచ్చింది. అప్పటి నుంచి సందు దొరికిన ప్రతిసారి నాని మీద కసి తీర్చుకునే పనిలో ఉన్నారు గన్నవరం ఎమ్మెల్యే. యార్లగడ్డ కడుపు మంట ఎప్పటికీ చల్లారుతుందో ఏమోనంటూ చమత్కరించుకుంటున్నాయి స్థానిక రాజకీయ వర్గాలు.