హైడ్రాలో కోవర్టులు ఉన్నారా..? లేదంటే ఎప్పుడేం చెయ్యాలో తెలీక సర్కార్‌ను ఇబ్బందిపెడుతున్నారా? కూల్చివేతలను పర్యవేక్షించేవారికి ప్లానింగ్ లేదా? జగ్గారెడ్డి లేవనెత్తిన ప్రశ్నలు రేపుతున్న ప్రకంపనలేంటి? కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి కొన్ని కీలకమైన అంశాలను ప్రస్తావించారు. హైడ్రాలో బీఆర్ఎస్‌కు అనుకూలంగా… కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసే అధికారులు ఉన్నారంటూ చేసిన ప్రకటన చర్చనీయాంశమైంది. ఈ వ్యాఖ్య ఆయన ఆషామాషీగా చేసి ఉండరు. ఎందుకంటే ఇటీవల జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే సహజంగానే ఇలాంటి అనుమానాలు పొలిటికల్ సర్కిల్స్‌లో చక్కర్లు కొడుతున్నాయి. ఓవైపు జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రభుత్వం అన్ని రకాల వ్యూహాలను వేస్తోంది. ఇలాంటి సందర్భంలో హైడ్రా అధికారులు అక్రమ నిర్మాణాలు అంటూ కూల్చివేతలు మొదలుపెట్టారు. ఓవైపు ఎన్నికలు జరుగుతుంటే… ప్రత్యర్థి పార్టీకి ఇవి అస్త్రంగా మారాయి. పోనీ కూల్చివేతలకు కారణాలేంటి..? అని హైడ్రాధికాలు చెప్పడమే మానేసినట్టున్నారు. మియాపూర్‌లో కూల్చివేతలు జరుగుతుంటే బీఆర్ఎస్ నేతలు దాన్ని తమకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నాలు మొదలుపెట్టారు. బీఆర్ఎస్ చేస్తున్న ఆరోపణలకు ప్రభుత్వం నుంచి గట్టిగా తిప్పి కొడుతున్నారా అంటే అదీలేదు. హైడ్రా అక్రమ నిర్మాణాలను కూల్చివేయటం మంచిదే కావచ్చు కానీ.. దానికంటూ ఒక పద్ధతి సమయం, సందర్భం, ఉండాలని కొందరు కాంగ్రెస్ నేతలు సణుగుతున్నారు. ఎన్నికల టైంలో, కూల్చివేతల పరిణామాలు ఎలాంటి మెసేజ్ ఇస్తాయన్న విషయం హైడ్రా అధికారులు పెద్దగా పట్టించుకున్నట్టు కనిపించట్లేదు.
హైడ్రాధికారుల తీరు చూసిన ఎవరైనా జగ్గారెడ్డి మాదిరే అనుమానాలను వ్యక్తం చేస్తారు. హైడ్రాలో నిజంగానే ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేసే అధికారులు ఉన్నారా..? జగ్గారెడ్డి కోరినట్టు ప్రభుత్వం విచారణకు ఆదేశిస్తుందా..? ప్రతిపక్ష పార్టీకి ఆయుధం అందించాలనే కుట్ర దాగి ఉందా..? హైడ్రా కమిషనర్ ఏం చేస్తున్నారన్న చర్చ కూడా ఉత్పన్నమవుతోంది. ఉన్నతాధికారుల ఆదేశాలు లేకుండా.. క్షేత్రస్థాయిలో అధికారులు కూల్చివేస్తారా అనే మౌలికమైన ప్రశ్న కూడా చర్చకు వస్తోంది. హైడ్రాలో ఉన్న అధికారుల్లో కూడా సమన్వయం లేకుండా పోయిందా అనే మరో ప్రశ్నపైనా చర్చ జరుగుతోంది.
విజువల్స్
హైడ్రా వ్యవహారాన్ని జగ్గారెడ్డి మొదటి నుంచి తప్పు పడుతూ వస్తున్నారు. అక్రమ నిర్మాణాలు కుల్చివేతలతో పాటు… అనుమతులు ఇస్తున్న అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని ఆయన వాదిస్తున్నారు. కానీ ఆ దిశగా అడుగులు పడటం లేదు. కూల్చివేతలకు కూడా సమయం, సందర్భం చూసుకోకుండా ముందుకెళితే ఇలాంటి ఆరోపణలు ఎదుర్కోవాల్సి వస్తుంది. ఇదే విషయాన్ని జగ్గారెడ్డి పార్టీలో పెద్దలతో పాటు.. ప్రభుత్వంలో ఉన్న నాయకులకు కూడా చెప్పే ప్రయత్నం చేశారు అని సమాచారం. ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి మీనాక్షి నటరాజన్ కి ఫోన్ చేసి.. హైడ్రా అధికారుల పనితీరు…తనకు ఉన్న అనుమానాలు చెప్పేశారట. వ్యవహారం చేయి దాటకుండా చూడాలని…హైడ్రా చేసే ప్రయోజనాలు ఇప్పటికిప్పుడు ప్రజలకి చేరడం కంటే… వాటిని ప్రత్యర్థులు అనుకూలంగా వాడుకోవడం పరిగణలోకి తీసుకోవాలని సూచించారట. హైడ్రా చేసే పనులని కనీసం ప్రభుత్వంలో ఉన్న మంత్రులు కూడా ప్రజలకు వివరించే ప్రయత్నం చేయడం లేదనేది జగమెరిగిన సత్యం. హైడ్రా కమిషనర్ … జగ్గారెడ్డి లేవనెత్తిన ప్రశ్నలకు ఏమని సమాధానం చెబుతారు? అధికారుల్లో నిజంగానే కోవర్టులు ఉన్నారా..? సర్కారు యాక్షన్ ప్లాన్ ఏంటి అనే ప్రశ్నలు రైజ్ అవుతున్నాయి.