తండ్రి వారసత్వంగా రాజకీయాల్లోకి వచ్చిన ఆ నాయకురాలు తడబడుతున్నారా? సరైన నిర్ణయాలు తీసుకోలేక పార్టీకి ఉన్న బలాన్ని కూడా పోగొడుతున్నారా? నాడు తండ్రికి అండగా నిలబడ్డవాళ్ళంతా నేడు తనకు ఎందుకు దూరం అవుతున్నారని విశ్లేషించుకోలేకపోతున్నారా? ఆమెది అనుభవరాహిత్యమా? లేక నాకంతా తెలుసునన్న అహంకారమా? ఎవరా లీడర్? ఏ నియోజకవర్గంలో ఉందా పరిస్థితి?
గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ముస్లిం మైనార్టీలు ఎక్కువ. అలాగే వైసీపీకి కంచుకోట ఇది. మొదట్లో ఇక్కడ కాంగ్రెస్ ఆధిపత్యం ఉండేది. వైసీపీ ఆవిర్భావం తర్వాత ఆ పార్టీ గ్రిప్ పెరిగింది. ఫ్యాన్ గుర్తు మీద ముస్తఫా.. వరుసగా 20014, 2019లో ఎమ్మెల్యే అయ్యారు. అలాగే… తన వారసత్వంగా…. కూతురు నూర్ ఫాతిమాను రాజకీయాల్లోకి తీసుకొచ్చారు ముస్తఫా. దీంతో 2024 ఎన్నికల్లో వైసీపీ తరపున ఆమె బరిలో దిగి ఓడిపోయారు. ఇక్కడి మైనార్టీ ఓట్ బ్యాంక్ మొత్తం సాలిడ్‌గా తమకు పడుతుందన్న అంచనాలు తల్లకిందులయ్యాయి. ప్రస్తుతం నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జ్‌గా ఉన్నారు ఫాతిమా. అయితే… పార్టీని పటిష్టం చేయాల్సిందిపోయి…బలహీనపరుస్తున్నారన్న అభిప్రాయం పెరుగుతోందట వైసీపీ వర్గాల్లో.
ఆవిర్భావం నుంచి వైసీపీ కోసం పనిచేసిన వారిని దూరం పెడుతున్నారట ఆమె. దీంతో సీనియర్స్ కొందరు తీవ్ర అసంతృప్తితో రగిలిపోతున్నట్టు సమాచారం. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో మొత్తం 23 డివిజన్లు ఉన్నాయి. పనితీరు బాగోలేని డివిజన్ అధ్యక్షులను మార్చడం ఎక్కడైనా సహజం. కానీ… ఫాతిమా మూకుమ్మడిగా 23 డివిజన్ల అధ్యక్షులను మార్చేయడం కలకలం రేపుతోంది. పోనీ…కొత్త అధ్యక్షులను నియమించే సమయంలో స్థానిక నేతల అభిప్రాయాలను తెలుసుకున్నారా అంటే… అది కూడా లేదట. చివరికి వైసీపీ తరపున గెలిచిన కార్పొరేటర్లు ప్రాతినిధ్యం వహిస్తున్న డివిజన్లలో కూడా వాళ్ళకు చెప్పకుండానే అధ్యక్షుల్ని మార్చేయడంతో మండిపడుతున్నారట వాళ్ళంతా. వైసీపీ ఆవిర్బావం నుంచి డివిజన్ అధ్యక్షులుగా ఉన్నవారిని కూడా మార్చడం మరింత అసంతృప్తికి కారణం అవుతోందని అంటున్నారు. తన తండ్రి రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలవడంలో కీలకంగా వ్యవహరించిన నేతల్ని సైతం నూర్ ఫాతిమా పక్కనపెట్టేసినట్లు నియోజకవర్గంలో పెద్దఎత్తున ప్రచారం జరుగుతోంది. పార్టీకోసం కష్టపడి పనిచేసే నాయకులు, కార్యకర్తలను కాదని, తన ఇష్టానుసారం పదవులు కట్టబెడితే ఎలాగంటూ వైసీపీ నేతలే మండిపడుతున్నారట నియోజకవర్గ ఇన్ఛార్జ్ మీద. పనిచేసే వారి పదవులు తీసెయ్యడం ఎంతవరకు సబబని లోలోపల మధనపడుతున్నట్టు సమాచారం. ఆమెకు రాజకీయంగా అనుభవం లేకపోవడంతోనే ఇలాంటి పరిస్థితులు ఎదురవుతున్నాయన్నది గుంటూరు తూర్పు వైసీపీ వర్గాల ఇంటర్నల్ టాక్.
కనీసం ఎవరైనా సలహా ఇవ్వబోయినా… నాకంతా తెలుసునంటూ బిల్డప్‌లు ఇస్తున్నారని, దీంతో… మనకెందుకులే అనుకుంటూ వాళ్లు సైలెంట్ అయిపోతున్నట్టు తెలుస్తోంది. ఫాతిమాతోపాటు ఉన్న కార్పొరేటర్స్‌లో కొంతమంది ఇటీవల జరిగిన మేయర్ ఎన్నికల్లో ఓటింగ్ కు డుమ్మా కొట్టారు. దీంతో తన వెంట ఉండేవారు ఎలాంటి వాళ్ళో కూడా ఆమె తెలుసుకోలేకపోతున్నారన్న మాటలు గట్టిగానే వినిపిస్తున్నాయి. ఎన్నికలకు ముందు కూడా నూర్ ఫాతిమా వెంట తిరిగిన కొంతమందిపై విమర్శలు వచ్చాయి. రౌడీషీటర్లు కొందర్ని నాయకురాలు తన వెంట తిప్పుకోవడంపై అప్పట్లో దుమారం రేగింది. ఇక డివిజన్లలో పర్యటనలకు వెళ్లే సమయంలో కూడా స్థానిక కార్పొరేటర్లు, నాయకులకు కనీస సమాచారం ఇవ్వడంలేదట. చివరి నిమిషంలో ఫోన్స్ చేయడంపై మండిపడుతున్నారు నాయకులు. గతంలో ముస్తఫా ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆయనకు రాజకీయంగా అండగా ఉన్న కుటుంబ సభ్యులు కూడా ఇప్పుడు ఫాతిమా తీరుపై ఆగ్రహంగా ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. ఆమె తీరు మారకపోవడంతో కొంతమంది పార్టీ నేతలు సజ్జల రామకృష్ణారెడ్డి, వైవీ సుబ్బారెడ్డిలను కలిసి జరుగుతున్న పరిణామాలను వివరించినట్టు సమాచారం. అయినా పరిస్థితిలో మార్పు రాకపోవడంతో ఈసారి ఏకంగా పార్టీ అధినేత జగన్ కు కలిసేందుకు సిద్దమవుతున్నట్టు తెలుస్తోంది. ఈ పరిస్థితుల్లో గుంటూరు తూర్పు వైసీపీ అదిష్టానానికి పెద్ద టాస్కేనని అంటున్నాయి రాజకీయ వర్గాలు.