ఆ ఎమ్మెల్యే పరిస్థితి అడుసు తొక్కనేల-కాలు కడగనేల అన్నట్టుగా ఉందా? ఏరికోరి వేరే పార్టీ నుంచి తెచ్చుకున్న నాయకులే ఆయన కింద గోతులు తీస్తున్నారా? వివిధ వర్గాల్లో ఆయనంటే ఏవగింపు కలిగేలా ఒక పద్ధతి ప్రకారం పని చేస్తున్నారా? సన్నిహితులకు విషయం తెలిసి కూడా… శాసనసభ్యుడి ఒంటెద్దు పోకడల కారణంగా చెప్పలేకపోతున్నారా? ఎవరాయన? ఏదా గోతులు తీసే బ్యాచ్?
గండ్ర సత్యనారాయణరావు. భూపాలపల్లి నియోజకవర్గం కాంగ్రెస్ ఎమ్మెల్యే. ఈ ఫస్ట్ టైం శాసనసభ్యుడు… నియోజకవర్గం అభివృద్ధి మీద దృష్టి పెట్టారని, ప్రణాళికాబద్దంగా పనిచేస్తున్నారన్న పేరొచ్చింది స్థానికంగా. కానీ… ఈ మధ్యకాలంలో కొన్ని భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. నిధులు తీసుకురావడం, అభివృద్ధి చేయడం వరకు బాగానే ఉన్నా…. అంటూ కాస్త పాజ్ ఇచ్చే బ్యాచ్ ఎక్కువ అవుతోందట. ఏం ఎందుకలా… ఆ సాగతీతకు కారణం ఏంటంటే… సార్ నోరు అన్నది అట్నుంచి వస్తున్న సమాధానం. గండ్ర సత్యనారాయణరావు చేస్తున్న అభివృద్ధి కంటే… ఆయన నోటి దురుసు గురించే ఎక్కువగా చర్చ జరుగుతోందట భూపాలపల్లిలో. అయితే… ఇక్కడా ఓ ట్విస్ట్ ఉందటండోయ్. ఎమ్మెల్యేకి నోటి దురుసు ఉన్న మాట నిజమే అయినా… అది చారణా ఉంటే… బారణాగా చేసి చూపించడానికి ఒక స్పెషల్ టీమ్ పని చేస్తోందన్న ప్రచారం జరుగుతోంది. ఎమ్మెల్యే ప్రత్యర్థులు… సొంత కాంగ్రెస్ పార్టీలోని ఓ వర్గాన్ని పావులుగా వాడుకుంటూ…ఆయన్ని బద్నాం చేయడానికి తీవ్రంగా ప్రయత్నిస్తున్నారన్నది గండ్ర అనుచరగణం అభియోగం. వాళ్ళంతా కలిసి వ్యూహాత్మకంగా తమ నాయకుడి గ్రాఫ్ తగ్గించే ప్రయత్నం చేస్తున్నా… ఇన్నాళ్లు పసిగట్టలేకపోవడమే అసలు సమస్య అన్నది వాళ్ళ వాయిస్.
భూపాలపల్లి నియోజకవర్గంలో గండ్ర సత్యనారాయణ గెలిచాక… సత్తన్న వెనకే నడుస్తామంటూ వివిధ పార్టీల నుంచి కాంగ్రెస్‌లో చేరారు కొందరు. అలా… పాత, కొత్త నాయకులతో భూపాలపల్లి కాంగ్రెస్ భవన్ నిండిపోయింది. మొదట్లో ఆ చేరికల్ని చూసి… భూపాలపల్లిలో ఇక ప్రతిపక్షం అన్న మాటే లేకుండా పోయిందని సంబర పడ్డారట.
కానీ…ఎవ్వరు పడితే వాళ్ళు హస్తం గూటికి చేరడం ఎక్కువయ్యేసరికి ఏళ్ళుగా పార్టీని అంటిపెట్టుకుని ఉన్నవాళ్ళు ఒకింత అసంతృప్తితో.. ఎమ్మెల్యేకి దూరం జరిగారట. అధికారం ఎక్కడుంటే అక్కడ పాగా వేయడం అలవాటైన కొందరు నాయకులు 24 గంటలూ…. సత్తన్న సత్తన్న అంటుండటంతో… అది భరించలేని పాత కాంగ్రెస్ లీడర్స్ సైలెంట్‌గా పక్కకు జరిగినట్టు చెప్పుకుంటున్నారు. ఇదే అదునుగా భావించిన వలస నేతలు తమ వ్యూహానికి పదునుపెట్టి… అసలు ప్రతిపక్షమే లేదనుకున్నచోట, ఎమ్మెల్యే మీద అసంతృప్తి రేగేలా చేశారట. ఎమ్మెల్యే వెంటే ఉంటూ, కొంతమంది ఆయనకు చెడ్డ పేరు వచ్చేలా పావులు కదుపుతున్నారని కాంగ్రెస్ సీనియర్స్ గుసగుసలాడుకుంటున్నారట. గండ్ర నోటి దురుసుతో అంతర్గతంగా మాట్లాడిన మాటల్ని ద్వితీయ శ్రేణి నాయకుల దగ్గర ప్రాస్తావిస్తూ….ఆయన్ని బద్నామ్ చేస్తున్నారట. అలాగే… అధికారుల గురించి ఇంటర్నల్‌గా మాట్లాడిన మాటలను, పోలీసు స్టేషన్లో ద్వీతీయ శ్రేణి నేతలు చేస్తున్న పనుల గురించి అంతర్గత సంభాషణల్లో జరిగిన చర్చల గురించి వాళ్ళకు చెప్పి….. నాయకులు ఎమ్మెల్యేకు దూరం అయ్యేలా స్కెచ్ గీస్తున్నారది భూపాలపల్లి కాంగ్రెస్ సీనియర్స్ మాట.
అలాంటి స్కెచ్లవల్లే… గండ్రతో కొంత మంది సీనియర్లు అంటీ ముట్టనట్టుగా వ్యవహరిస్తున్నారట. దాంతో పాటు వివిధ వర్గాల్లో ఎమ్మెల్యే మీద అసంతృప్తి వ్యక్తం అవుతుండటం ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో చర్చనీయాంశం అయింది. ఈ మొత్తం వ్యవహారాన్ని పథకం ప్రకారం కొంతమంది నాయకులు నడిపిస్తున్నట్టు చర్చించుకుంటున్నాయి కాంగ్రెస్ శ్రేణులు. ముందు వెనకా ఆలోచించకుండా… వచ్చిన వాళ్ళని వచ్చినట్టు…. ఇష్టారీతిన గులాబీ పార్టీ నుంచి చేర్చుకున్నారని, ఇప్పుడు వాళ్లే ఎమ్మెల్యే కింద మంట పెడుతున్నట్టు చెప్పుకుంటున్నారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల లబ్ధిదారుల ఎంపిక విషయంలో ఆ వలస నేతలే… దగ్గరుండి మరీ గండ్రను పక్కదారి పట్టిస్తున్నారన్నది భూపాలపల్లి కాంగ్రెస్ ఇంటర్నల్ టాక్. ఇప్పటికే ఒక పథకం ప్రకారం వివిధ వర్గాల ప్రజల్లో, ద్వితీయ శ్రేణి నాయకుల్లో వ్యతిరేకతను పెంచడంలో సక్సెస్ అయిన నాయకులు… ఇదే ఊపులో ఆయన వ్యతిరేక వర్గాలకు బూస్టింగ్ ఇస్తే స్థానిక సంస్థల ఎన్నికల్లో లాభపడచ్చని భావిస్తున్నారట. కొద్ది నెలలుగా తన వెనక జరుగుతున్న తతంగాన్ని ఎమ్మెల్యే సత్యనారాయణ గుర్తించలేకపోతున్నారన్న చర్చ నడుస్తోంది నియోజకవర్గంలో. అదే సమయంలో ఆయన ఒంటెద్దు పోకడలతో వాస్తవాలను వివరించేందుకు వెనకాడుతున్నారట సన్నిహితులు. స్థానిక సంస్థల ఎన్నికల సమీపిస్తున్న వేళ ఈ పరిణామాలు ఎటు దారితీస్తాయోనని ఆందోళన వ్యక్తం చేస్తోంది కాంగ్రెస్ కేడర్. రాజకీయాల్లో ముందు చూపే కాదు…. వెనక చూపు కూడా ముఖ్యమని ఎమ్మెల్యే సత్తన్న చూస్తే అర్ధమవుతోందని గుసగుసలాడుకుంటున్నారు కాంగ్రెస్ నాయకులు.