తానొకటి తలిస్తే… జరిగేది మరొకటి అన్నట్లు ఉందట ఆ ఎమ్మెల్యే పరిస్థితి. ప్రాంత అభివృద్ధి ఎజెండాగా వేసిన అడుగులు… సత్ఫలితలివ్వక పోగా కొత్త చిక్కులు తెచ్చిపెట్టాయట. ప్రభుత్వ పెద్దల తీరుతో ఆ ఎమ్మెల్యే మాట్లాడిన నైరాశ్యపు మాటలు … ఆయన అసంతృప్తికి అద్దం పడుతున్నా యని చర్చించుకుంటున్నారు.ఇంతకీ ఎవరా ఎమ్మెల్యే..?ఎరక్కపోయి..ఇరుక్కుపోయారా?అసలేం జరిగింది? మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో గద్వాల నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ సిట్టింగ్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి మరోసారి గెలిచారు. కాంగ్రెస్ అధికారంలోకి రావడం, మారిన రాజకీయ పరిణామాలకు తోడు నియోజక వర్గ అభివృద్ధి ఎజెండాగా గతేడాది జూలైలో కృష్ణమోహన్ రెడ్డి రేవంత్ శిబిరంలో చేరిపోయారు. ఈ క్రమంలో బీఆర్ ఎస్ …పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యే లపై న్యాయస్థానాన్ని ఆశ్రయించడం, ప్రస్తుతం విచారణలో భాగంగా స్పీకర్ నోటీసులు ఇవ్వడం, రిప్లై లు తీసుకునే ప్రక్రియ కొనసాగుతోంది. ఐతే ఫిరాయింపుల కేసు తెరపైకి వచ్చినప్పటీ నుంచి , తాను బీఅర్ ఎస్ లోనే ఉన్నా అని,.. ఆ పార్టీ శాసన సభ్యుల్లో ఒకరిగానే కొనసాగుతున్నా అన్ని ప్రకటించడంతో పాటు, మొన్న స్పీకర్ కు రాతపూర్వకంగా ఇచ్చిన నోటీస్ రిప్లై లో కూడా అదే పేర్కొన్నట్లు సమాచారం. ఇక ఇదే సమయం లో ఇటీవల గద్వాలలో పర్యటించిన బీఅర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్,.. పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యే లతో పాటు ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి తీరును ఎండగట్టి , ఉప ఎన్నిక ఖాయమని చెప్పుకొచ్చారు. దీంతో గద్వాల ఎమ్మెల్యే బండ్లకు గులాబీ పార్టీతో తెగతెంపులు అయినట్లే అని పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ నడిచింది కృష్ణ మోహన్ రెడ్డి భవిష్యత్ లో కాంగ్రెస్ తో స్టిక్ ఆన్ అయి ముందుకు పోతారని విశ్లేషకులు అంచనాలు వేస్తున్నారు.
ఇక ఇదిలా ఉంటే వ్రతం చెడ్డ ఫలితం లేదు అన్న భావనలో ఉన్నారంట కృష్ణమోహన్ రెడ్డి. అభివృద్ధి ఎజెండాగా వేసిన రాజకీయ అడుగులకు తగ్గట్లు సర్కార్ నుంచి సహకారం అందట్లేదని తీవ్ర అసంతృప్తిలో ఉన్నట్లు తెలుస్తోంది. నియోజక వర్గానికి సాగునీటి ప్రాజెక్టులు, రోడ్లు, ఇతర మౌలిక సదుపాయాలు కల్పన అనుకున్న దానికంటే ఎక్కువ జరుగుతుందని భావించిన ఎమ్మెల్యేకు భంగపాటు తప్పలేదట. తాజాగా ఆయన చేసిన వ్యాఖ్యలు ఎమ్మెల్యే నైరాశ్యానికి అద్దం పడుతున్నాయని చర్చించుకుంటున్నారు. ప్రభుత్వాలు దక్షిణ తెలంగాణపై సవతి తల్లి ప్రేమ చూపిస్తున్నాయని… మంత్రులు హెలికాప్టర్ల లో వచ్చి రివ్యూలు చేసినా ఈ ప్రాంతానికి ఒరిగిందేమీ లేదని,ర్యాలంపాడు, గట్టు రిజర్వాయర్ ల సామర్థ్యం పెంపు కోసం ఇచ్చిన జీవో 34 కు ఆర్థిక శాఖ క్లియరెన్స్ రాలేదని ఆవేదన వెలిబుచ్చారు.
ఇక మంత్రులకు, ముఖ్యమంత్రికి వినతి పత్రాలు ఇచ్చి, రివ్యూలు చేసినా చిత్తు కాగితాల కింద లెక్క పెట్టారు అంటూ అసహనాన్ని వెళ్లగక్కారు. ఏ ప్రభుత్వం వచ్చినా మా గద్వాల ప్రాజెక్టుల సమస్యలు పరిష్కారం కావడం లేదనీ తీవ్ర అసంతృప్తి తో ఎమ్మెల్యే బండ్ల మాట్లాడినట్లు కనిపిస్తోంది. మొత్తం మీద… ఎన్నో ఆశలతో గెలిచిన పార్టీని వీడి,అభివృద్ధి అంటూ అధికార పార్టీ గడప తొక్కిన ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డి అంచనాలకు తగ్గట్టుగా సర్కార్ నుంచి రెస్పాన్స్ రావట్లేదని స్పష్ట మౌతుంది… మరి రాజుకుంటున్న అసంతృప్తి జ్వాలను సర్కార్ పెద్దలు ఎలా ఆర్పుతారో చూడాలి.