పార్టీని బలోపేతం చేయాల్సిన కొత్త అధ్యక్షుడే మరిన్ని సమస్యలు సృష్టిస్తున్నారా? అంతా నా ఇష్టం… రేపు మీరంతా నా దగ్గరికి రావాల్సిన వాళ్ళేనని వార్నింగ్స్ ఇస్తూ సమస్యను మరింత జఠిలం చేస్తున్నారా? జిల్లా అధ్యక్షుడిగా అందర్నీ కలుపుకుని పోవాల్సిన నేత తన బాధ్యతల స్వీకారానికి కూడా కొందర్ని పిలవకపోవడాన్ని ఎలా చూడాలి? ఎవరా నాయకుడు? ఏ జిల్లాలో జరుగుతోందా వ్యవహారం? అలంపూర్, గద్వాల నియోజకవర్గాలు కలిసి ఉన్న గద్వాల జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడిగా తొలి నుంచి పార్టీలోనే కొనసాగుతున్న రాజీవ్ రెడ్డి పేరు ప్రకటించింది అధిష్టానం. అయితే… అంతకంటే ముందు నుంచే… రాజీవ్ రెడ్డి వ్యవహార శైలి గద్వాల కాంగ్రెస్‌లో దుమారం రేపుతోంది. డీసీసీ బాధ్యతలు తీసుకోక ముందునుంచే ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డితో చెట్టపట్టాలేసుకుని తిరుగుతున్నారాయన. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూడా ఇద్దరూ కలిసే పనిచేశారు. అదే సమయంలో జిల్లాకు చెందిన మిగతా నేతలతో సఖ్యత లేదనిచెప్పుకుంటున్నారు. జిల్లా కాంగ్రెస్‌లో ముఖ్య నాయకులుగా ఉన్న ఏఐసీసీ నాయకుడు సంపత్ కుమార్‌తో పాటు సరితా తిరుపతయ్యతో కొత్త డీసీసీ అధ్యక్షుడికి విభేదాలున్నాయన్నది స్థానికంగా చెప్పుకునే మాట.
అది నిజమేనా అన్నట్టు వాళ్ళు లేకుండానే డీసీసీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టారాయన. నిజంగానే తేడాలున్నాయా? అసలు ఎక్కడ తేడా జరిగిందని ఆరా తీస్తే… సంపత్, సరితలకు అసలు ఆహ్వానాలే పంపలేదట. విభేదాల కారణంగానే…రాజీవ్‌రెడ్డి తన బాధ్యతల స్వీకార కార్యక్రమానికి వాళ్ళని పిలవలేదన్న టాక్ నడుస్తోంది. ఇదిలా ఉంటే…. తాజాగా గద్వాల ఎమ్మెల్యే కృష్ణమోహన్‌రెడ్డి నిలబెట్టి గెలిపించుకున్న సర్పంచ్ల ఆత్మీయ సమ్మేళనం, సన్మానాల కార్యక్రమం జరిగింది. డీసీసీ అధ్యక్షుడి హోదాలో ఆ కార్యక్రమానికి రాజీవ్ అటెండ్ అవడం దుమారం రేపుతోంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ నుంచి గెలిచి కాంగ్రెస్ గూటికి చేరిన కృష్ణమోహన్ రెడ్డి… ఫిరాయింపుల కేసు విచారణ జరుగుతున్న క్రమంలో తాను బీఆర్ఎస్లోనే ఉన్నానని, పార్టీ మారలేదని చెప్పారు. అసెంబ్లీ స్పీకర్ కూడా అదే అంశాన్ని తన జడ్జిమెంట్‌లో చెప్పారు. ఈ క్రమంలో… బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా చెప్పుకునే కృష్ణమోహన్‌రెడ్డి నిర్వహించిన కార్యక్రమానికి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఎలా అటెండ్ అవుతారన్నది ప్రత్యర్థుల క్వశ్చన్.
అదే విషయమై…ఇప్పుడు సరిత వర్గం భగ్గుమంటోంది. రాజీవ్ రెడ్డి తీరును తీవ్రంగా తప్పుబట్టడంతో పాటు , ఆయన వ్యవహారశైలిపై పెద్దలకు ఫిర్యాదు చేసేందుకు సిద్దమవుతోంది సరిత వర్గం. ఇక దీనికి తోడు తాజాగా రాజీవ్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి జిల్లా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయం మాత్రమే ఉండాలే తప్ప వ్యక్తుల పేర్లపై పార్టీ కార్యాలయాలు ఉండకూడదని, రాబోయే మున్సిపల్, ఎంపిటిసి, జడ్పిటిసి ఎన్నికలలో బీ ఫామ్ ఇచ్చేది తానే అన్న విషయం గుర్తు పెట్టుకోవాలంటూ హాట్ కామెంట్స్ చేశారు. ఇప్పుడు ఇది ఇంకో వివాదంగా మారింది. గడిచిన అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలోని రెండుకు రెండు అసెంబ్లీ స్థానాల్ని బీఆర్ఎస్ గెలుచుకోవడం , గద్వాల నియోజక వర్గంలో క్రిష్ణమోహన్ రెడ్డి చేరికతో కాంగ్రెస్ రెండు వర్గాలుగా చీలడం వంటి పరిణామ క్రమంలో డీసీసీ అధ్యక్షుడు చాలా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆచితూచి అడుగులేస్తూ…. పార్టీ బలోపేతానికి కృషి చేయాల్సి ఉండగా … పేరు ప్రకటన నుంచే వివాదాలు రేపడం ఏంటన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. దీంతో ఇప్పటికే రెండు ముక్కలుగా ఉన్న గద్వాల కాంగ్రెస్ ఇప్పుడు మూడు ముక్కలవుతోందా అన్న చర్చలు నడుస్తున్నాయి. రాజీవ్ రెడ్డి ఎంట్రీ అండ్ దూకుడుతో లాభమా నష్టమా అన్న లెక్కలు సైతం తెర మీదికి వస్తున్నాయి. డీసీసీ కొత్త అధ్యక్షుడు గద్వాల కాంగ్రెస్‌ను ఎటువైపు నడిపిస్తారో చూడాలి మరి.