కాస్తో కూస్తో పార్టీ నష్టపోయినా ఫర్లేదుగానీ, మన పరంపరకు మాత్రం బ్రేక్ పడకూడదని ఆ సీనియర్ లీడర్ అనుకుంటున్నారా? అందుకే అండర్‌స్టాండింగ్ పాలిటిక్స్ చేస్తున్నారా? ప్రతిపక్ష పార్టీ జిల్లా అధ్యక్ష బాధ్యతల్లో ఉండి కూడా… అధికార పార్టీని అందుకే గట్టిగా టార్గెట్ చేయలేకపోతున్నారా? మా సార్ స్లో మోషన్ లీడర్ అని ఎవరి గురించి వైసీపీ కేడర్ అనుకుంటోంది? అసలేంటా అండర్‌స్టాండింగ్ పాలిటిక్స్? శ్రీకాకుళం జిల్లా రాజకీయాలు మిగతా వాటికంటే కాస్త డిఫరెంట్‌గా ఉంటాయి. రెండు ప్రధాన పార్టీల్లోని ముఖ్య నేతలు దశాబ్దాలుగా యాక్టివ్ పాలిటిక్స్ చేస్తున్నవాళ్ళే. రెండు ప్రధాన కుటుంబాలు రాష్ట్ర స్థాయిలో పేరున్నవే. ఒకటి కింజరాపు, మరోటి ధర్మాన ఫ్యామిలీ. మొదట కాంగ్రెస్‌లో, ఆ తర్వాత వైసీపీలో కొనసాగుతున్నారు ధర్మాన సోదరులు. అటు టీడీపీలో కీలకంగా ఉండే కింజరాపు ఫ్యామిలీతో వైరం ఉన్నా… అది రాజకీయం వరకే. విమర్శల విషయంలో కూడా ఇరు కుటుంబాలకు చెందిన నాయకులు పరస్పరం సంయమనం పాటిస్తారు. ఈ క్రమంలోనే… ప్రస్తుతం వైసీపీ పార్లమెంటరీ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నారు ధర్మాన కృష్ణదాస్. ఆయన రాజకీయమంతా… వైసీపీ సహజ శైలికి భిన్నంగా, కర్ర విరగదు, పాము చావదన్నట్టుగా నడుస్తోందని ఇప్పుడు భగ్గుమంటున్నాయి వైసీపీ వర్గాలు. పార్టీ అధికారంలో ఉన్నప్పుడు డిప్యూటీ సీఎం పదవి నిర్వహించిన కృష్ణదాస్ సంచలన వ్యాఖ్యలు చేసేవారు. కానీ ఇప్పుడుప్రతిపక్షంలోకి వచ్చాక.. సంచలనాల సంగతి తర్వాత మామూలుగా కూడా స్పందనలు లేకుండా పోయాయన్నది పార్టీ టాక్. జిల్లా కేంద్రానికి అడపా దడా వచ్చి వెళ్తున్నారు తప్ప…పార్టీ గురించి సరిగా పట్టించుకోవడం లేదని చెప్పుకుంటున్నారు.
జిల్లాలో వైసీపీకి బలమైన క్యాడర్ ఉంది. సమర్ధ నాయకత్వం ఉంది. కానీ మిస్సయింది సమన్వయం. జిల్లా పార్టీ అధ్యక్షుడిగా , సీనియర్ నేతగా ముందుండి నడపాల్సిన నేత, అస్త్ర సన్యాసం చేసినట్టుగా మాట్లాడ్డం చూసి నీరసపడుతున్నాయట వైసీపీ వర్గాలు. ఏదో…. పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాలకు అటెండ్ అవుతూ.. మమ అనిపిస్తున్నారట. నరసన్నపేటలో అంతా తన కుమారుడు చూసుకుంటారని చెప్పేసిన దాస్… పార్టీకే ఎక్కువ సమయం కేటాయిస్తానని గతంలో చెప్పారు. కానీ… చేతల్లో మాత్రం అదెక్కడా కనిపించడం లేదు. గ్రూప్ రాజకీయాలను చక్కదిద్దటంగానీ, పార్టీ కార్యక్రమాలను సమన్వయం చేయటంలోగానీ… స్లో మోషన్‌లో నడుస్తున్నారట మాజీ డిప్యూటీ సీఎం. పార్టీ గొంతుకగా ఉండే మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు పై కేసుల మీద కేసులు పడుతున్నాయి. జిల్లాలో ప్రకృతి వనరులైన వంశధార, నాగావళి నదుల్ని కూటమి ఎమ్మెల్యేలు లూటీ చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. కొండలు గుట్టల్ని గ్రావెల్ మాఫియా కొల్లగొడుతోంది. ఇక బెల్ట్ షాప్స్ గురించి అయితే చెప్పేపనేలేదు. ధాన్యం కొనుగోళ్ల విషయంలో రైతాంగం ఆవేదనగా ఉంది. ఇలా … రకరకాల సమస్యలు కనిపిస్తున్నా… ప్రతిపక్ష పార్టీ జిల్లా అధ్యక్షుడుగా దూకుడు ప్రదర్శించడంలో ధర్మాన కృష్ణదాస్ బాగా వెనకుబడ్డారన్నది పార్టీ వర్గాల అభిప్రాయం. ప్రభుత్వం వైపునుంచి జరుగుతున్న తప్పుల్ని ఎత్తి చూపడం, పార్టీ బలోపేతానికి కృషి చేయడంలో దాస్ ఎందుకు మీనమేషాలు లెక్కిస్తున్నారన్నది వైసీపీ కేడర్ క్వశ్చన్. అండర్‌స్టాండింగ్ పాలిటిక్స్‌లో భాగంగా… అధికార పక్షాన్ని గట్టిగా విమర్శించి టార్గెట్ అవడం ఎందుకని అనుకుంటున్నారో… లేక పోరాటాలకు ఇంకా చాలా సమయం ఉందిలే అనుకుంటున్నారో తెలియదుగానీ ఆయన తీరు మాత్రం మాకు మహా చెడ్డ చికాకు పుట్టిస్తోందని అంటోంది సిక్కోలు వైసీపీ కేడర్.