మేడారం సమ్మక్క సాక్షిగా… కాంగ్రెస్‌లోని కుమ్ములాటలు బయటపడుతున్నాయా? మంత్రుల మధ్య ఆధిపత్య పోరు పీక్స్‌కు చేరి ఢిల్లీలో పితూరీలు చెప్పుకునేదాకా వెళ్ళిపోయిందా? జరుగుతున్న వ్యవహారాలపై చివరికి ముఖ్యమంత్రి కూడా అసహనంగా ఉన్నారా? ఏయే మంత్రుల మధ్య కోల్డ్‌వార్ నడుస్తోంది? దాని ప్రభావం మేడారం జాతర పనులపై ఎలా పడుతోంది? మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, కొండా సురేఖ రగడ జగడ కంటిన్యూ అవుతోంది. ఆయన ఇన్ఛార్జ్ మంత్రి అయితే కావచ్చుగానీ… జిల్లా మీద పెత్తనం ఏంటని ప్రశ్నిస్తున్నారు కొండా. మేడారం జాతర టెండర్ల విషయంలో ఆయన చెప్పిందే అధికారులు చేశారంటూ… ఇప్పటికే కాంగ్రెస్ అధిష్ఠానానికి కూడా ఫిర్యాదు చేశారామె. తాను దేవాదాయ శాఖ మంత్రిగా ఉంటే… సొంత జిల్లాలోనే తనకు సంబంధం లేకుండా ఏదేదో జరిగిపోతోందని కొండా అసహనంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై పొంగులేటి ఇప్పటి వరకు స్పందించలేదుగానీ…. ఇక్కడి గొడవను కొండా దంపతులు ఢిల్లీదాకా తీసుకు వెళ్ళడంపై… సీఎం రేవంత్ రెడ్డి అసహనం వ్యక్తం చేసినట్టు సమాచారం.మేడారం జాతర, అభివృద్ధి పనులను రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సమయంలో కలిసి పనిచేయడానికి బదులు ఇలా రచ్చ చేసుకోవడం ఏంటని ముఖ్యమంత్రి కొంత కోపంగా ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. ఓవైపు ఈ గొడవ ఇలా జరుగుతుండగానే….తాజాగా మేడారంలో మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్కల కలిసి మేడారం అభివృద్ధి పనులపై సమీక్ష సమావేశం నిర్వహించడం హాట్ హాట్‌గా మారింది.
ఈ సమీక్షా సమావేశానికి కొండా సురేఖ హాజరు కాకపోవడంపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. 2026లో జరగబోతున్న మేడారం మహా జాతరను విజయవంతం చేయడంతో పాటు శాశ్వత ప్రాతిపదికన కొన్ని ఏర్పాట్లు చేయాలని భావించిన రేవంత్ రెడ్డి సర్కార్… 150 కోట్లతో పనులు మొదలుపెట్టింది. ఆలయ గద్దెల ప్రాంగణాన్ని విస్తరించడంతో పాటు అన్ని శాఖల ద్వారా శాశ్వత పనులకు ఏర్పాట్లు జరుగుతున్నాయి.స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఒకసారి రివ్యూ మీటింగ్ పెట్టి మంత్రులంతా కలిసి పని చేయాలని ఆదేశించినా…వాస్తవం మాత్రం అందుకు విరుద్ధంగా ఉంది. తన పరిధిలోని దేవాదాయశాఖ ఆధ్వర్యంలో జరిగే అభివృద్ధి కార్యక్రమాలకు సంబంధించిన టెండర్ల విషయంలో పొంగులేటి అతిజోక్యం ఎందుకని ప్రశ్నిస్తున్నారు కొండా సురేఖ. ఆ కారణంతోనే… పీసీసీ చీఫ్ మహేశ్‌కుమార్‌గౌడ్‌కు కూడా ఫిర్యాదు చేశారట.
అయితే… ప్రతిష్టాత్మకంగా నిర్వహించాల్సిన కార్యక్రమం విషయంలో ఈ గిల్లికజ్జాలేంటంటూ… సీఎం అసహనంగా ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇక్కడే కొండా దంపతులు కూడా ఫీలవుతున్నారట.తమ ఆత్మాభిమానం మీద దెబ్బకొడుతున్న మంత్రి పొంగులేటికే మద్దతిచ్చేలా సీఎం వ్యవహారం ఉందని తమ సన్నిహితుల దగ్గర వాపోతున్నారట. తాజా రివ్యూ మీటింగ్ షెడ్యూల్‌లో కూడా దేవాదాయ శాఖ మంత్రి ప్రస్తావన లేకపోవడంతోనే కొండా సురేఖ అలిగి దూరంగా ఉన్నట్టు సమాచారం. వాస్తవానికి వరంగల్ జిల్లా ఇన్చార్జి మంత్రిగా పొంగులేటి పర్యటనలు ఎక్కువగా ఉండటం, ఇక్కడి అధికారులు, ప్రజాప్రతినిధులతో ఆయన నేరుగా మాట్లాడుతుండటం, పార్టీ కార్యక్రమాల్లోనూ ఆయన దిశా నిర్దేశం చేయడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారట కొండా కపుల్. ఈ కోల్డ్‌వార్ జిల్లాలో పార్టీని ఎటువైపు తీసుకువెళ్తుందోనని ఆందోళన పెరుగుతోంగట కేడర్‌లో.