జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం కాంగ్రెస్ పార్టీ స్పెషల్ స్కెచ్ సిద్ధం చేస్తోందా? దానికి సంబంధించి ఇప్పటికే క్షేత్ర స్థాయిలో యాక్టివిటీ మొదలైపోయిందా? షెడ్యూల్ కంటే ముందే… బ్యాటింగ్ మొదలుపెట్టాలని కాంగ్రెస్ పెద్దలు గట్టిగా ఫిక్స్ అయ్యారా? ఇంతకీ అక్కడ అధికార పార్టీ ప్లాన్ ఏంటి? ఎలా అమలు చేయాలనుకుంటోంది? జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ పార్టీ…. ఆల్రెడీ యుద్ధానికి అవసరమైన అస్త్ర శస్త్రాలన్నిటినీ సిద్ధం చేసుకుంటోందట. ప్రస్తుతం ఇది బీఆర్‌ఎస్ సిట్టింగ్ సీటుకాగా… దాన్ని సొంతం చేసుకోవడం… అధికార పార్టీగా అత్యంత ముఖ్యమని భావిస్తున్నారట కాంగ్రెస్ పెద్దలు. జాతీయ అధ్యక్షుడు ఖర్గే కూడా ఇటీవల జరిగిన సమావేశంలో ఇదే విషయం చెప్పినట్టు తెలిసింది. పార్టీ, ప్రభుత్వం ఈ ఉప ఎన్నికను సవాల్‌గా తీసుకోవాలని ఆయన సూచించినట్టు సమాచారం.
అందుకే ఫుల్ ఫోకస్ పెట్టిన రాష్ట్ర పెద్దలు అవసరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నారట. ఉప ఎన్నికకు పార్టీ ఇన్ఛార్జ్‌గా మంత్రి వివేక్‌ను ఇటీవలే ప్రకటించారు. అభ్యర్థి ఎవరైనా సరే… గెలిపించుకుని వచ్చే బాధ్యత అంతా… వివేక్‌దేనని క్లారిటీ ఇచ్చేసింది పీసీసీ. ఇప్పటికే జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్న పొన్నం ప్రభాకర్ కూడా జూబ్లీహిల్స్‌లో ఎన్నికల పనులు మొదలుపెట్టారు. సెప్టెంబర్‌లో ఎలక్షన్ ఉండవచ్చన్నది కాంగ్రెస్ పెద్దల అంచనా. అందుకోసం ఇప్పట్నుంచే కసరత్తు మొదలైంది. పరిధి పరంగా జూబ్లీహిల్స్ పెద్ద నియోజక వర్గం. దీంతో పార్టీ ఇచ్చిన సవాల్‌లో సత్తా చూపాలని భావిస్తున్నారట మంత్రులు. అందుకే నోటిఫికేషన్ రావడానికి ముందే వివిధ అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారట.
సీసీ రోడ్లు, డ్రైనేజీలు, బస్తీల్లో ఇతరత్రా డెవలప్‌మెంట్ యాక్టివిటీతో దూసుకుపోవాలనుకుంటున్నట్టు తెలిసింది. ఆ దిశలో ఇప్పటికే తొలి అడుగు పడగా… మంత్రులు వివేక్, పొన్నంతో పాటు తుమ్మల నాగేశ్వరరావు కూడా యాక్టివ్ పార్ట్ తీసుకుంటున్నారు. తాజాగా వెంగళరావు నగర్ గురుద్వార్ కమాన్ దగ్గర సీసీ రోడ్ల నిర్మాణం మొదలైంది. షేక్ పేట ఫ్లై ఓవర్ పిల్లర్ నంబర్ 4 దగ్గర క్రీడా ప్రాంగణం, కమ్యూనిటీ హాల్ కు శంకుస్థాపన, పలు ప్రధాన రహదారులకు ఫుట్ పాత్ నిర్మాణాలకు శంకుస్థాపన లాంటి కార్యక్రమాలు జరిగాయి. ఇలా… మొత్తంగా ఉప ఎన్నిక షెడ్యూల్ వచ్చే నాటికి గ్రౌండ్‌లో పరిస్థితుల్ని తనకు అనుకూలంగా మలుచుకునే పనిలో పడింది కాంగ్రెస్. ఇప్పటికే రేషన్ కార్డులు.. సన్నబియ్యం లాంటి పథకాలు జనంలోకి వెళ్లాయి. అటు పార్టీ నేతలకు పని విభజన చేసి డివిజన్స్ వారీగా బాధ్యతలు అప్పగించడం ద్వారా జనంలోకి వెళ్ళి జూబ్లీహిల్స్‌లో పాగా వేయాలన్నది కాంగ్రెస్ ప్లాన్‌గా తెలుస్తోంది.