ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్లో పదవుల పంపకాలు గొడవలకు దారితీస్తున్నాయా? జిల్లాలో నామినేటెడ్ పోస్టులకు ఎందుకంత గిరాకీ ఏర్పడింది?పక్క పార్టీల నుంచి వచ్చిన వాళ్లకే ఉన్నట్టుండి ప్రాధాన్యత పెరుగుతోందా?పార్టీ కోసం పనిచేసిన వాళ్లను పక్కన పెడుతున్నదెవరు?ఇంతకీ…ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్లో ఏం జరుగుతోంది?పదవుల కోసం పోటీ పడుతున్న నేతలెవరు?అసలు…గొడవలకు కారణం అవుతున్న ఆ పదవులేంటీ? ఆదిలాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో పదవుల పందేరం కొనసాగుతోంది. సర్పంచ్ ఎన్నికల తర్వాత పార్టీలో పదవులు ఆశించే నాయకుల సంఖ్య అమాంతం పెరిగిపోయిందట. మరీ ముఖ్యంగా పార్టీ పదవులతో పాటు నామినేటెడ్ పదవుల కోసం పైరవీలు మొదలు పెట్టారని రాజకీయ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది. ఏళ్లతరబడి పనిచేస్తున్నాం…తమకో పదవి ఇవ్వండి అంటూ గాడ్ ఫాదర్ల చుట్టూ చక్కర్లు కొడుతున్నారట కొందరు నాయకులు. మరికొంతమంది అయితే నేతల వద్దకు వెళ్లి అర్జీలు సైతం పెట్టుకుంటున్నారని తెలుస్తోంది. ఇంకొంతమంది తమకు కానీ తమ బంధువులకు, తమ అనుచరులకు పదవులు అంటూ చక్రం తిప్పే పనిలో ఉన్నారనే ప్రచారం జరుగుతోంది. ఆదిలాబాద్, బోథ్ నియోజకవర్గాలకు చెందిన డజన్ మందికిపైగా నేతలు ఆశల పల్లకిలో ఊరేగుతున్నారని టాక్ వినిపిస్తోంది. దీంతో ఏళ్ల తరబడి పార్టీ జెండా మోస్తే పదవులు రావడం లేదనే ఆవేదన ఉందట చాలామంది నేతల్లో. పార్టీలు మారి వచ్చిన వాళ్లకు పదవులు కట్టబెడుతున్నారనే ఆరోపణలు సైతం సొంత పార్టీ నేతలే చేస్తండటం డైజెస్ట్ కాని విషయం.
ఇప్పటికే ఇచ్చోడ మార్కెట్ కమిటి చైర్మన్, గ్రంథాలయ, ఇతర మార్కెట్ కమిటి చైర్మన్ పదవులను భర్తీ చేశారు. ఆదిలాబాద్ మార్కెట్ కమిటి చైర్మన్ పదవి మాత్రం పెండింగ్లో ఉంది. ఆ పదవి ఓ రెడ్డి నేతకు కన్ఫార్మ్ అయిందనే ప్రచారం జరుగుతోంది. రెడ్డి, రావులకే పదవులు ఇస్తే దళిత, బీసీల పరిస్థితి ఏంటనే ప్రశ్నలు ఉత్పన్నమౌతున్నాయి. ఇప్పటికే ఓ నేత తన అనుచరుడికి నామినేటెడ్ పదవిని కట్టబెట్టారని తెలుస్తోంది. మరో నాయకుడికి మార్కెట్ చైర్మన్ పదవి రాబోతోందట. మరి పార్టీ సీనియర్ల బతుకు ఇంతేనా? అంటూ ఓ సీనియర్ నేత తన బాధను వీడియో రూపంలో వెళ్లగక్కారు. ఆ వీడియోను కాస్తా సోషల్ మీడియాలో తెగ వైరల్ చేస్తున్నారు.
మరోవైపు…పీఏసీఎస్, మిగిలిన ఇతర నామినేటెడ్ పదవులతో పాటు పార్టీ పదవులు సైతం ఇవ్వనున్నారు. జిల్లాకు ప్రధాన కార్యదర్శి, ఉపాధ్యక్షులు, కోశాధికారులు ఇలా జిల్లా కార్యవర్గం కూర్పు చేయనుంది పార్టీ హైకమాండ్. దాని కోసం హైకమాండ్ టీంలు రంగంలోకి దిగుతున్నాయట. అయితే పదవులు ఊరికే రావంటున్నారు కొంతమంది నేతలు. పైరవీలు, నేతల బందువులు అయినంత మాత్రాన ఎలాంటి పోస్టులు రావంటున్నారట. పార్టీ కోసం పని చేస్తున్న వాళ్లకే వస్తాయని జిల్లా నేతలు చెప్తున్నారని టాక్. సర్పంచ్ ఎన్నికల్లో సైతం పార్టీలోని గ్రూపులే ఫలితాలపై దెబ్బకొట్టాయనే చర్చ సైతం నేతల్లో ఉంది. పార్టీలో ఉండి పక్కపార్టీకి సపోర్ట్ చేశారనే ఆరోపణలు ఉన్నాయని తెలుస్తోంది. సొంత పార్టీకే వెన్నుపోటు పొడిచిన వాళ్లపై చర్యలు తీసుకోవాలనే డిమాండ్ పెరిగిపోతుందనే చర్చ జిల్లా పార్టీలో నడుస్తోంది.
ఇక…పార్టీ లైన్ తప్పిన వాళ్లను సహించబోమని ఇప్పటికే జిల్లా అధ్యక్షులు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో నామినేటెడ్, అలాగే పార్టీ పదవుల విషయంలో కొత్త, పాత, సీనియర్, జూనియర్ నాయకుల మద్య అంతర్గతంగా పోరుసాగుతోందనే ప్రచారం నడుస్తోంది. కొంతమంది రచ్చకెక్కితే మరికొంతమంది అంతర్గతంగానే చర్చిస్తున్నారట. అధికార పార్టీల పదవుల లొల్లి రోడ్డెక్కే పరిస్థితి రాకముందే చక్కదిద్దుతారా?మొత్తానికి…జెండా మోసిన వాళ్లకే పదవులు కట్టబెట్టాలని క్యాడర్ కోరుతుందని టాక్. మరి ఈ విషయంలో అధిష్ఠానం ఎలా హ్యాండిల్ చేస్తుందో చూడాలి.