క్కడ బీజేపీలో బొమ్మ కోసం కుమ్ములాట నడుస్తోందా? ఫ్లెక్సీలో నా బొమ్మ పడలేదేం……. అంటూ ఆ ఎమ్మెల్యే ఫైర్ ఫైర్స్ ద ఫైర్ అంటున్నారా? శాసనసభ్యుడి ఫోటో వెనక కనిపించని కట్టప్పలున్నారా? ఎవరా ఎమ్మెల్యే? ఏంటా ఫోటో వివాదం? నిజామాబాద్ జిల్లా బీజేపీలో ప్లెక్సీల వివాదం చినికి చినికి గాలివానలా మారుతోంది. ఇటీవల జిల్లాలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి పర్యటన, ఎంపీ అర్వింద్ బర్త్‌డే సందర్భంగా… ప్లెక్సీలు ఏర్పాటు చేశారు నేతలు. పనిలో పనిగా జిల్లా పార్టీ కార్యాలయం ఎదుట కూడా భారీ ప్లెక్సీలు పెట్టేశారు. సరే… వాళ్ళ అభిమానం అలాంటిది అనుకుంటున్న టైంలోనే…ఊహించని వివాదం ఒకటి తెర మీదికి వచ్చింది. ఆ ప్లెక్సీల్లో ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్‌రెడ్డి ఫోటో లేకుండా చేయడం వివాదాస్పదమైంది. జిల్లా పార్టీ ఆఫీస్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన ఆర్మూర్ ఎమ్మెల్యే… ఆ ప్లెక్సీలు చూసి.. అవాక్కయ్యారట.
లోపలికి వెళ్లి సమావేశంలో పాల్గొంటూ… అక్కడి నేతలకు తనదైన స్టైల్ లో స్వీట్ వార్నింగ్ కూడా ఇచ్చినట్టు తెలిసింది. బయట అధికార పార్టీ నేతలు అవమానిస్తుంటే.. ఇంట్లో సొంత పార్టీ నేతలు కూడా, పార్టీ ఆఫీస్ ముంగటే.. ప్లెక్సీలో ఫోటో వేయకుండా… అవమానించారంటూ సీరియస్ అయినట్టు సమాచారం. అవమానిస్తే బయటకు పోతానని మీరు అనుకుంటే పొరపాటే.. నేను పార్టీ విడిచి బయటకు వెళ్లే వ్యక్తిని కాదంటూ… భగ్గుమన్నట్టు చెబుతున్నాయి పార్టీ శ్రేణులు. నేను బీజేపీని విడవను, ధర్మాన్ని వదలను అంటూ క్లారిటీ ఇచ్చారట. నిజామాబాద్ జిల్లాలో కాషాయ పార్టీకి ఇద్దరు ఎమ్మెల్యేలు ఉన్నారు. నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యానారాయణ గుప్తా ఒకరైతే.. మరొకరు ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. ఐతే పార్టీ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన ప్లెక్సీలో అర్బన్ ఎమ్మెల్యే ఫోటో మాత్రమే పెట్టి.. తనను విస్మరించడాన్ని జీర్ణించుకోలేకపోయారట రాకేష్‌రెడ్డి.
జిల్లాలో గెలిచిందే ఇద్దరం ఎమ్మెల్యేలం…. అందులో ఒకరి ఫోటో పెట్టి ఒకర్ని వదిలేయడం కరెక్టేనా అంటూ…జిల్లా అధ్యక్షుడు దినేష్‌ను గట్టిగానే నిలదీసినట్టు చెప్పుకుంటున్నారు. బహుశా… జిల్లా పార్టీ ఆఫీస్ కు తాను రావడం ఇదే చివరిసారి కావొచ్చని కూడా ఓ దశలో సీరియస్ అయ్యారట ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి. నేను తలచుకుంటే లక్ష ప్లెక్సీలు పెడతా…. కానీ… నా సిద్ధాంతం అది కాదంటూ చురకలు అంటించినట్టు తెలిసింది. ఈ వివాదం కాస్తా రాష్ట్ర పార్టీకి చేరిందట. ఆఫీస్లోఎమ్మెల్యే ఫోటో ఎందుకు పెట్టలేదని రాష్ట్ర పెద్దలు కూడా ఆరా తీసినట్టు సమాచారం. ఇటు ఎమ్మెల్యే అనుచరులు మాత్రం… కావాలనే తమ ఎమ్మెల్యే ఫోటో లేకుండా ప్లెక్సీలు పెట్టారంటూ మండిపడుతున్నారట.
ఈ విషయమై ఇప్పటికే ఆర్మూర్ ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి- జిల్లా అధ్యక్షుడు దినేష్‌కు మధ్య గ్యాప్ ఏర్పడిందనే టాక్ నడుస్తోంది. పొరపాటు జరిగిందని పార్టీ జిల్లా అధ్యక్షుడు వివరణ ఇచ్చుకున్నా… వేడి ఇంకా చల్లబడలేదని తెలుస్తోంది. ఈ వివాదం మరింత ముదరకముందే.. అధిష్టానం పెద్దలు జోక్యం చేసుకుని.. ఎమ్మెల్యేను శాంతింపచేయాలని కోరుతోంది కేడర్. కాషాయ పార్టీలో ఫైర్ బ్రాండ్ గా గుర్తింపు తెచ్చుకున్న రాకేష్ రెడ్డికి సొంత పార్టీలో జరుగతున్న అవమానం పై గుర్రుగా ఉన్నారట. ఈ లొల్లి ఎక్కడికి దారితీస్తుందో చూడాలి మరి.