ఆదోని జిల్లా విషయంలో కొత్త డ్రామాకు తెర లేస్తోందా? సీఎం చంద్రబాబు సైతం పరిశీలించమని చెప్పినా…. మొత్తం మేటర్‌ని పక్కదారి పట్టించే ఎత్తుగడలు నడుస్తున్నాయా? కూటమిలో… అందులోనూ… తెలుగుదేశం పార్టీలోనే ఎందుకు భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి? అందరి అభిప్రాయాలకు భిన్నంగా మోకాలడ్డుతున్న ఆ ఒక్క ఎమ్మెల్యే ఎవరు? ఎందుకలా జరుగుతోంది? ఆదోని జిల్లా ఏర్పాటు కోసం ఆందోళనలు తీవ్రరూపం దాలుస్తున్న క్రమంలో… మెల్లిగా అది కూటమి పార్టీల మధ్య చిచ్చు రేపుతున్నట్టు కనిపిస్తోంది. వాళ్ల వ్యవహారం మొత్తం ఉద్యమాన్నే నీరుగార్చేలా ఉందని, నేతలు తలో మాట మాట్లాడ్డం వల్ల నష్టం జరుగుతోందన్న చర్చ జరుగుతోంది. ప్రజాభిప్రాయం మేరకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడం మానేసి కొత్త డిమాండ్స్ పెట్టడం కూడా స్వార్ధ రాజకీయ వ్యూహంలో భాగమేనన్న విమర్శలు పెరుగుతున్నాయి. కర్నూలు జిల్లా నుంచి విడగొట్టి ఆదోని జిల్లా ఏర్పాటు చేయాలన్న డిమాండ్ రోజు రోజుకు పెరుగుతుంటే…. కూటమి నేతలు తలోమాట మాట్లాడడం గందరగోళానికి దారి తీస్తోందన్నది స్థానికంగా వినిపిస్తున్న మాట. ఎక్కడైనా ఇలాంటి డిమాండ్స్, ఆందోళనల విషయంలో రాజకీయ పార్టీలు ముందుంటాయి. కానీ… ఆదోని జిల్లా కోసం ప్రజలు, ప్రజాసంఘాలే స్వచ్చందంగా ఉద్యమిస్తున్నాయి. ప్రజా ప్రతినిధులు, నేతలు మద్దతు మాత్రమే ప్రకటిస్తున్నారు. రాజకీయపార్టీలు మొదట్లో ఆ పని కూడా చేయకుండా టచ్ మీ నాట్ అన్నట్టుగా ఉన్నాయి. కానీ…. పెరుగుతున్న ప్రజల మద్దతు చూశాక నేతలు కూడా దీక్షా శిబిరానికి వచ్చి మద్దతు ప్రకటించక తప్పలేదు. ఇతర పార్టీలతోపాటు కూటమి భాగస్వాములు, మాజీ ఎమ్మెల్యేలు, జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యే కూడా ఆదోని జిల్లా సాధనకు మద్దతు ప్రకటించారు.
గ్రామీణ నాయకులు స్వయంగా ఆందోళనలో పాల్గొంటున్నారు. అదంతా ఒక ఎత్తనుకుంటే…. అసలు అధికారంలో ఉన్న కూటమి నాయకులు తప్పదన్నట్టు మద్దతిస్తున్నారు తప్ప…ప్రభుత్వం మీద ఎందుకు వత్తిడి చేయలేకపోతున్నారన్నది లోకల్ క్వశ్చన్. చివరి రక్తపు బొట్టు వరకు ఆదోని జిల్లా ఏర్పాటు కోసం పోరాడతానని బీజేపీ ఎమ్మెల్యే డా.పార్థసారథి చెబుతున్నా.. ఇందుకోసం ప్రత్యేకంగా సీఎంను కలిసి ఎందుకు ఒత్తిడి తీసుకురావడంలేదనే చర్చ జరుగుతోంది. అటు టీడీపీ జిల్లా అధ్యక్షుడు తిక్కారెడ్డి ఆదోని జిల్లా సాధన శిబిరాన్ని సందర్శించి మద్దతు ప్రకటించడంతోపాటు ఈ అంశాన్ని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో… జిల్లా ఏర్పాటు డిమాండ్ గురించి గతంలో ఎందుకు చెప్పలేదు, ఎన్నికల్లో హామీ ఇచ్చామా అంటూ సీఎం చంద్రబాబు కూడా ఆరా తీసినట్టు తెలిసింది. ఆదోని జిల్లా ఏర్పాటు సాధ్యాసాధ్యాలపై లోకల్ ఎమ్మెల్యేలతో చర్చించాలని ఇంచార్జి మంత్రి నిమ్మల రామానాయుడును చంద్రబాబు ఆదేశించారట. ఆ మేరకు మంత్రి నిమ్మల అమరావతిలో జిల్లా ఎమ్మెల్యేలతో సమావేశం కాగా….అంతా ఆదోని జిల్లా కావాలని, ప్రజలు తీవ్రస్థాయిలో ఆందోళనలు చేస్తున్నారని చెప్పినట్టు తెలిసింది. కానీ… ఎమ్మెల్యే జయనాగేశ్వర్ రెడ్డి మాత్రం ఎమ్మిగనూరు జిల్లా అంశాన్ని కొత్తగా తెర మీదికి తెచ్చినట్టు తెలిసింది. ఆదోని జిల్లా సాధన కోసం అన్ని రాజకీయపక్షాలు, ప్రజా సంఘాలు ఆందోళన చేస్తుండగా.. ఆ సంగతి వదిలేసి టీడీపీకే చెందిన ఎమ్మిగనూరు ఎమ్మెల్యే కొత్త డిమాండ్ పెట్టడం ఏంటంటూ అంతా షాకయ్యారట.
అసలు ఆదోని జిల్లా కావాలని, మద్దతివ్వమని తననెవరూ అడగలేదన్న జయనాగేశ్వర్‌రెడ్డి… తనకు మాత్రం ఎమ్మిగనూరు జిల్లా కావాలని వుందన్నట్టు తెలిసింది. ఆ విషయంలో తన స్వార్థం తనదన్నది ఆయన వాదన. నా నియోజకవర్గ ప్రజల ఆకాంక్షను సీఎం దృష్టికి తీసుకెళతానని కూడా చెప్పారు జయనాగేశ్వర్ రెడ్డి. ఓవైపు ఆదోని జిల్లా కోసం ఆందోళనలు ఉధృతంగా జరుగుతున్న టైంలో…టీడీపీలోని నాయకులే ఎమ్మిగనూరు ప్రస్తావన తీసుకురావడమంటే.. ఆ ఉద్యమాన్ని నీరుగార్చడంగాక మరేంటన్న ప్రశ్నలు వినిపిస్తున్నాయి. ఎమ్మిగనూరు జిల్లా కావాలని కోరుకోవడంలో తప్పులేదని, జిల్లాల పునర్విభజనపై ప్రభుత్వం మంత్రుల కమిటీని నియమించి అభిప్రాయాలు తీసుకున్నప్పుడు నోరు మెదపకుండా…. ఇప్పుడు ఆదోని ఆందోళన తీవ్రమయ్యాక కొత్త డిమాండ్ తెర మీదికి తీసుకురావడం ఏంటన్న ప్రశ్న తలెత్తుతోంది. కేవలం ఆదోని ఆందోళనలను నీరుగార్చడానికే కొత్త ఎత్తుగడ వేశారా అని అనుమానించే వాళ్ళు సైతం ఉన్నారు. ఈ మొత్తం ఎపిసోడ్ కూటమికి, ప్రధానంగా టీడీపీకి నష్టం కలిగిస్తుందేమోనన్న ఆందోళన పార్టీ శ్రేణుల్లో పెరిగిపోతోంది.