OTR: సీఎం కుటుంబాన్ని వెనకేసుకొచ్చి ఎంపీ చామల అడ్డంగా బుక్కయ్యారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఆ ఎంపీ మార్కులు కొట్టేద్దామని ప్రయత్నించి మొదటికే మోసం తెచ్చుకున్నారా? పెద్ద సబ్జెక్ట్ మీద గొప్పగా… ఏదో మాట్లాడదామనుకుని ఇంకేదో మాట్లాడేసి మొత్తాన్ని ఇరకాటంలో పెట్టేశారా? అడక్కుండానే అపోజిషన్ చేతికి తల, కాళ్ళు ఒకేసారి అందించేశారా? కొండ నాలుక్కి మందేయబోతే ఉన్న నాలుక ఊడింది, ఎరక్కపోయి ఇరుక్కుపోయాడు లాంటి సామెతలన్నిటినీ ప్రస్తుతం ఏ ఎంపీకి అప్లయ్ చేస్తున్నారు? అంత తేడాగా ఏం మాట్లాడారాయన?
కుడి ఎడమైతే పొరపాటు లేదోయ్…. అంటారు. అది సినిమా పాట వరకు సరిపోతుందేమోగానీ…. బయట ఎక్కడా వర్క్ అవదు. ప్రత్యేకించి రాజకీయాల్లో అస్సలు అలాంటి పరిస్థితులు ఉండవు. వేసే ప్రతి అడుగు, నోటి నుంచి వచ్చే ప్రతి మాట అదుపులో ఉండాలి. కుడి ఎడమవడం సంగతి తర్వాత… చిన్న తేడా వచ్చినా అడ్డంగా బుక్కయిపోయి కుడితిలో పడ్డ ఎలకలా తన్నుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. జనం మధ్యలో ఉన్నప్పుడు ఆచి తూచి అడుగులు వేయాలన్న సంగతి తెలిసి కూడా కొందరు నాయకులు అప్పుడప్పుడూ మాట తూలుతుంటారు, తమకు సంబంధం లేని సబ్జెక్ట్‌లోకి దూరిపోయి తేడా చేస్తుంటారు. ప్రస్తుతం భువనగిరి కాంగ్రెస్ ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి విషయంలో కూడా ఇదే తరహా మాటలు వినిపిస్తున్నాయి రాజకీయవర్గాల్లో. ప్రస్తుతం నడుస్తున్నది సోషల్ మీడియా యుగం. అది ప్రెస్‌మీట్ అయినా, పబ్లిక్ మీటింగ్ అయినా… నాయకుల నోటి నుంచి వచ్చే మాట చాలా జాగ్రత్తగా రావాలి, స్పష్టత ఉండాలి. కానీ… చామల మాత్రం ఆ రెండూ మిస్ అయి ఎరక్క పోయి… ఇరుక్కున్నట్టు అయిందన్న చర్చలు నడుస్తున్నాయి. అసలు మేటర్ ఏంటంటే… ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరులకు రాష్ట్ర ప్రభుత్వం 200 కోట్ల రూపాయల విలువైన భూమిని అప్పనంగా కట్టబెట్టిందని ఆరోపించాయి ప్రతిపక్షాలు. ఆ ఆరోపణల మీద సంబంధిత పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు… రియాక్ట్ అయ్యారు. అసలు భూ కేటాయింపులు జరిగిన సదరు కంపెనీకి, సీఎం సోదరులకు సంబంధం ఏంటని ప్రశ్నించారాయన. దీనికి కొనసాగింపుగా… ఆ కంపెనీలో డైరెక్టర్లుగా ఎవరెవరున్నారో పేర్లు బయట పెట్టారు కూడా. అలాగే… సదరు కంపెనీకి ఐదు ఎకరాల భూమిని… ఎకరాకు కోటి 50 లక్షల చొప్పున రేటు కట్టి మరీ ఇచ్చారంటూ డాక్యుమెంట్స్ బయట పెట్టారు.
Also Read
గతంలో ఉన్న ప్రభుత్వం అదే ప్రాంతంలో ఎకరా 90 లక్షలకే కేటాయించిందని, ఇప్పుడు మేం వాళ్ళకంటే ఎక్కువ ధరే తీసుకున్నామని చెప్పే ప్రయత్నం చేశారాయన. దాంతోపాటు అసలు భూములు ఇచ్చేది, ధర నిర్ణయించేది కమిటీ అని కూడా పిక్చర్ క్లియర్ చేసేశారు. అలాగే… ఆ భూమి విలువ అసలు 200 కోట్లు కాదు.. ఏడున్నర కోట్లేనని కూడా క్లారిటీ ఇచ్చారు శ్రీధర్‌బాబు.పరిశ్రమల శాఖ మంత్రిగా తన హోదాతో స్పష్టత ఇచ్చి వివాదానికి ముగింపు పలికే ప్రయత్నం చేశారాయన. ఈ వివాదాన్ని క్లోజ్‌గా ఫాలో అవుతున్నవాళ్ళు కూడా ఇక ఆ ఎపిసోడ్ అక్కడితో ముగిసిపోయిందని భావించారు. కానీ…ఇంతలోనే… నేనున్నానంటూ కథను కొత్త మలుపు తిప్పుతూ సీన్లోకి ఎంటరైపోయారు భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్ రెడ్డి. తన స్టేట్మెంట్తో మూడున్నర నిమిషాల వీడియో విడుదల చేసి అందరికీ షాకిచ్చారు. మంత్రి శ్రీధర్ బాబు చెప్పిన దానికి… అందులో చామల చెప్పిన దానికి పొంతనే లేదు. కంపెనీ పెడతామంటూ సీఎం రేవంత్ రెడ్డి సోదరులు దరఖాస్తు పెట్టుకున్నారు. అందుకోసం భూమి ఇచ్చారు… కంపెనీ పెట్టి పది రూపాయలు సంపాదించుకుంటే తప్పేంటి? కేసీఆర్ హయాంలో ఆయన కుటుంబం సంపాదించుకోలేదా..? అంటూ కామెంట్స్ చేయడంతో అంతా షాకయ్యారట. సీఎం కుటుంబాన్ని సమర్ధించే క్రమంలో ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో సీన్ రివర్స్ అయిందని అంటున్నారు రాజకీయ పరిశీలకులు.
చివరికి సోషల్ మీడియాలో కూడా ఇదే హైలైట్ అయింది. దాంతో… ఎంపీగారు రేవంత్ కుటుంబాన్ని సమర్ధించబోయి అడ్డంగా బుక్ చేశారన్న కామెంట్స్ సైతం వినిపిస్తున్నాయి. అసలు ఆ కంపెనీ సీఎం సోదరుల పేరు మీదనే లేదని మంత్రి శ్రీధర్ బాబు క్లారిటీ ఇస్తే…. తగుదునమ్మా అంటూ ఎంపీ ఎంటరైపోయి మొత్తం కంపు చేశారన్న కామెంట్స్ కాంగ్రెస్ వర్గాల్లోనే వినిపిస్తున్నాయి. ఈ వ్యవహారం పై… ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ కూడా సీరియస్ అయ్యారట. మనం ఏం మాట్లాడుతున్నామో తెలుసుకోవాలి కదా..? అంటూ ఎంపీ మీద సీరియస్ అయినట్టు సమాచారం. రాజకీయాల్లో అప్పుడప్పుడు ఇలాంటి పొరపాట్లు సహజమే అయినా… అసలే ప్రతిపక్షం నానా యాగీ చేస్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండాల్సింది పోయి ఎలాగంటే అలా మాట్లాడటం కరెక్ట్ కాదని క్లాస్ పీకినట్టు చెప్పుకుంటున్నారు.మరో వైపు దీనిపై రేవంత్ కూడా సీరియస్ అయినట్టు తెలిసింది. దాంతో.. వాతావరణాన్ని తేలికపరచడానికి చామల మరుసటి రోజు మళ్ళీ మీడియాతో మాట్లాడినా… జరగకూడని నష్టం మాత్రం అప్పటికే జరిగిపోయింది. ప్రస్తుతం ఎంపీ పరిస్థితి చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు ఉందని అంటున్నారు రాజకీయ పరిశీలకులు.
తాజావార్తలు
-
BJP: స్మృతి ఇరానీకి మళ్లీ ప్రమోషన్.. యూపీ సహా పలు రాష్ట్రాలకు కొత్త ఇంఛార్జ్‌లు నియామకం
-
Flipkart BBD Sale: Samsung గెలాక్సీ ఎస్25పై రూ.20 వేల డిస్కౌంట్.. పూర్తి వివరాలివే..
-
Srikanth Odela: : నాని ‘జడల్’ లుక్ వెనుక ఉన్న అసలు వ్యక్తి ఎవరో తెలుసా?
-
DA Release : తెలంగాణ ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. రెండు డీఏలకు గ్రీన్ సిగ్నల్.!
-
Nani : ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లో సినిమా.. హుందాగా వెనక్కి తగ్గిన న్యాచురల్ స్టార్!
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!