OTR: తెలంగాణ పాలిటిక్స్‌లో ‘క్షుద్ర పూజల’ కలకలం.. హరీష్ రావుపై ఆరోపణల వెనుక అసలేం జరిగింది?

Otr

Otr

OTR: తెలంగాణలో పొలిటికల్ అఘోరాలు స్వైర విహారం చేస్తున్నారు. రాష్ట్ర రాజకీయమంతా క్షుద్ర పూజల చుట్టే తిరుగుతోంది. కాంగ్రెస్‌, బీఆర్‌ఎస్‌ మధ్య నడుస్తున్న వ్యవహారం రాష్ట్ర ప్రజల్లో సరికొత్త సందేహాలకు తావిస్తోందట. చివరికి ముఖ్యమంత్రి నోటి వెంట కూడా క్షుద్ర ప్రస్తావన రావడం కలకలం రేపుతోంది. ఇంతకీ… హరీష్‌రావు మీద ఆ ఆరోపణలు ఎందుకు వచ్చాయి? అసలు ఆయన చేసిన పూజలేంటి? ఎక్కడ చేశారు? తెలంగాణ రాజకీయ వాతావరణం ఉన్నట్టుండి మారిపోయింది. సాధారణంగా అవినీతి ఆరోపణలు, ప్రభుత్వాల పనితీరు చుట్టూ తిరిగే వ్యవహారం ఒక్కసారిగా క్షద్ర పూజల టర్న్‌ తీసుకుంది. అదీకూడా… ప్రధాన పార్టీలకు చెందిన ముఖ్య నేతల నోటి వెంట అఘోరాలు, క్షుద్ర పూజల మాటలు రావడంతో… రాష్ట్రంలో అసలేం జరుగుతోందంటూ అందరి అటెన్షన్‌ అటువైపు మళ్ళింది. బీఆర్‌ఎస్‌ ముఖ్యనేత, మాజీ మంత్రి హరీష్‌రావు కేంద్రంగా పది రోజుల నుంచి ఇదే టాపిక్‌ నడుస్తుండటంతో… ఆసలు ఆయన ఏం చేశారు? కాంగ్రెస్‌ ఆరోపణల్లో నిజమెంత? ఇందులో నిజా నిజాలేంటి అన్న చర్చలు పెరిగిపోయాయి.

మొదట కాంగ్రెస్ ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్‌తో పాటు మరి కొందరు నేతలు హరీష్‌రావు పై ఆరోపణలు చేశారు. తెలంగాణలో వర్షాలు కురవకూడదంటూ ఆయన క్షుద్ర పూజలు చేశారన్నది హస్తం నేతల ఆరోపణ. అక్కడితో సరిపెట్టకుండా… మే 31న తిరుచ్చిలో, జూన్ 1న శివమొగ్గలో హరీష్‌రావు పూజలు చేశారంటూ తేదీలతో సహా చెప్పడం కలకలం రేపింది. అవసరమైతే ఫోటోలు కూడా బయటపెడతామని కాంగ్రెస్‌ లీడర్స్‌ అనడం ఇంకా ఉత్కంఠను పెంచింది. చివరికి ఏకంగా పీసీసీ అధ్యక్షుడు మహేష్‌కుమార్ గౌడ్ నోటి నుంచి కూడా.. క్షుద్ర పూజల మాటలు రావడంతో…అసలేం జరుగుతోందంటూ ఆరా తీసేవాళ్ళు పెరిగిపోయారు. అదే సమయంలో క్షుద్ర పూజల ఆరోపణలు చేసిన వారికి లీగల్‌ నోటీసులు పంపారు మాజీ మంత్రి. తాను అలాంటి పనులు చేసినట్టు ఆధారాలు ఉంటే బయటపెట్టాలని, లేదంటే లీగల్ యాక్షన్ తీసుకుంటానని కూడా హెచ్చరించారు హరీష్‌. ఇదంతా వారం రోజుల క్రితం జరిగిన వ్యవహారం. హరీష్‌రావు లీగల్‌ నోటీసుల తర్వాత ఎక్కడా రియాక్షన్‌ లేకపోవడంతో… ఆ వ్యవహారం అక్కడితో ఆగిపోయిందని అనుకున్నారు అంతా. కానీ…

తాజాగా గురువారం కూకట్‌పల్లి బహిరంగ సభలో ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నోటి వెంట క్షుద్ర పూజల మాటలు వచ్చాయి. రాష్ట్రంలో వర్షాలు పడకూడదు, సుభిక్షంగా ఉండకూడదంటూ కొందరు అలాంటి పూజలు చేయిస్తున్నారంటూ చెప్పుకొచ్చారాయన. నేరుగా… ఎక్కడా… హరీష్‌రావు పేరు ప్రస్తావించలేదు సీఎం. కానీ… గత వారం నుంచి ఆయన మీదే ఆరోపణలు రావడంతో… ముఖ్యమంత్రి ఉద్దేశ్యం ఏమై ఉంటుందా అన్న చర్చలు మొదలయ్యాయి. సరిగ్గా ఇక్కడే సరికొత్త అనుమానాలు పెరుగుతున్నాయట. అసలు ఏమీ లేకపోతే పదే పదే ఎందుకు ఇలాంటివి వినిపిస్తున్నాయి? ఎందుకు ఆ తరహా పూజల చుట్టూనే మేటర్‌ తిరిగుతోందంటూ ప్రశ్నించుకునే వాళ్ళు పెరిగిపోతున్నట్టు తెలుస్తోంది. చివరికి బీఆర్‌ఎస్‌ వర్గాల్లో సైతం ఇలాంటి డిస్కషన్స్‌ మొదలయ్యాయట. కానీ… హరీష్‌రావుతో పాటు ఆయన అనుచరులు ఈ ఆరోపలను గట్టిగా కొట్టి పారేస్తున్నారు. పుట్టిన రోజు, పెళ్ళి రోజుకు ముందు వివిధ ఆలయాలకు వెళ్లడం ఆయనకు అలవాటని, ఆ క్రమంలోనే జూన్ మూడున తన బర్త్ డే సందర్భంగా అంతకు రెండు రోజుల ముందు తమిళనాడులోని తిరుచ్చి, కర్ణాటకలోని శివమొగ్గకు వెళ్లి ప్రత్యేక పూజలు చేయించుకున్నారంటూ వివరణ ఇస్తున్నారు.

ప్రత్యేక సందర్భంలో అందరిలాగే తమ నేత కూడా ప్రముఖ ఆలయాలకు వెళ్ళి పూజలు చేయించుకుంటే… కాంగ్రెస్ పార్టీ దానికి వేరే రంగు పూయడం ఏంటంటూ ప్రశ్నిస్తున్నారు. ఆరోపణలు చేసిన ముగ్గురికి ఇప్పటికే లీగల్ నోటీసులు పంపించామని, వారు కచ్చితంగా క్షమాపణలు చెప్పడంతో పాటు ఆరోపణలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్‌ చేస్తోంది హరీష్‌ వర్గం. ఈ వ్యవహారంపై నేరుగా స్పందించడానికి హరీష్‌రావు నిరాకరిస్తున్నా… ఆయన అనుచరులు, బీఆర్ఎస్ నేతలు మాత్రం గట్టిగానే కౌంటర్స్‌ వేస్తున్నారు. అయితే… మొన్నటి వరకు కాంగ్రెస్ నేతలు ఇలా ఆరోపణలు చేసినప్పటికీ లైట్‌గా తీసుకున్న తెలంగాణ ప్రజలు… ఇప్పుడు ఏకంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నోటి నుంచి అఘోర పూజలు, క్షుద్ర రాజకీయాలన్న మాటలు రావడంతో… అసలేంటి ఈ చర్చ అని మాట్లాడుకుంటున్నారు.