రాజకీయాల్లో ఒక అడుగు వేయాలన్నా.. ఒక మాట మాట్లాడాలన్నా.. ప్రతిదానికీ ఓ లెక్క ఉంటుంది. అసెంబ్లీలో ఈటల పేరును ప్రస్తావించడంలోనూ ఆ లెక్కే ఉందా? బీజేపీ నుంచి గెలిచిన వెంటనే తెగిడి.. ఇప్పుడు ఆకాశానికి ఎత్తేలా గులాబీ పార్టీ నేతలు మాట్లాడం వెనుక కథేంటి?
గత రెండు సమావేశాల్లో సభ నుంచి ఈటల సస్పెండ్
ఈటెల రాజేందర్. గులాబీ కండువా తీసేసి.. బీజేపీలోకి వెళ్లిన తర్వాత అధికారపార్టీ నేతలు ఈటలపై అగ్గిమీద గుగ్గిలం అయ్యే వారు. ఆయన ఏమీ మాట్లాడినా కౌంటర్ వచ్చేంది. బీజేపీ ఎమ్మెల్యేగా గెల్చిన తరవాత జరిగిన అసెంబ్లీ సమావేశాలకు వచ్చిన ఈటలను సభలో ఉండనివ్వలేదు. రెండుసార్లు ఆయన్ని సస్పెండ్ చేశారు. అసెంబ్లీ బయట చేసిన కామెంట్స్‌పై ఆగ్రహం వ్యక్తం చేసి.. ఆయన్ని సభలోకి రానివ్వలేదు. అసెంబ్లీ ఆవరణలోను నిరసన తెలిపే అవకాశం ఇవ్వలేదు. అసెంబ్లీ ప్రాంగణంలోనే అదుపులోకి తీసుకుని ఈటలను ఇంటి దగ్గర వదిలి వచ్చారు పోలీసులు. తన సొంత వాహనంలో కూర్చోవడానికి కూడా మాజీ మంత్రికి అనుమతి ఇవ్వలేదు. ఆ తర్వాత జరిగిన అసెంబ్లీ సెషన్‌లోనూ అదే పరిస్థితి.
తాజా సమావేశాల్లో నాటకీయ పరిణామాలు
సీఎం తన ముఖాన్ని చూడొద్దనే సభలోకి రాకుండా అడ్డుకుంటున్నారని ఈటల ఆరోపించిన సందర్భాలు ఉన్నాయి. సభలో తన గొంతు నొక్కేస్తున్నారని ఆక్రోశించారు. అయితే తాజా బడ్జెట్ సమావేశాల్లో సీన్ మారింది. ఈటలను సభలో ఉండనిస్తారా లేదా అనే చర్చ జరుగుతున్న సమయంలో అనేక నాటకీయ పరిణామాలు జరిగాయి. బడ్జెట్ సమావేశాల్లో ఈటలపై ఎలాంటి చర్య లేదు. పైగా సీఎం కేసీఆర్ తన ప్రసంగంలో పదే పదే ఈటల పేరును ప్రస్తావించారు. మంత్రులతో కలిసి ఈ మాజీ మంత్రి లంచ్ కూడా చేశారు. అంతేనా.. సీఎంతోపాటు ఇతర మంత్రులు కూడా ‘మా ఈటల’అని పలకరించడం ఆశ్చర్యపరిచింది.
ఈటలపై వైఖరి మారిందా అని ఆరాలు
అసెంబ్లీ లాబీలో కేటీఆర్‌తో ఈటల ముచ్చట్లపై అధికారపార్టీలో చర్చ జరుగుతున్న సమయంలో సీఎం కేసీఆర్ ప్రసంగంలో ఈటల పేరు ప్రస్తావనకు రావడంతో ఏం జరుగుతుందా అనే ఆరాలు మొదలయ్యాయి. ఇదే సమయంలో హుజూరాబాద్‌కు చెందిన ఎమ్మెల్సీ కౌశిక్‌రెడ్డికి మండలిలో విప్ పదవి ఇచ్చారు. ఈటల సామాజికవర్గానికే చెందిన బండా ప్రకాష్‌ను శాసనమండలి డిప్యూటీ ఛైర్మన్‌ను చేశారు. ఇవన్నీ చూసినవాళ్లు.. జరుగుతున్న ఘటనలను బేరీజు వేసుకుంటున్నవాళ్ల అభిప్రాయం మరోలా ఉందట. బీజేపీలో ఒక గందరగోళ వాతావరణం ఏర్పరిచేందుకే సీఎంతోపాటు ఇతర మంత్రులు ఈటల విషయంలో ఆ కామెంట్స్ చేశారని అనుకుంటున్నారట. స్వయంగా ఈటల సైతం తనను డ్యామేజ్ చేసేందుకే తన పేరును ప్రస్తావించారని చెప్పుకొచ్చారు. తాను బీజేపీని వీడేది లేదని ఆయన స్పష్టత ఇచ్చారు. మొత్తానికి గులాబీ బాస్ ఏం చేసినా ఓ లెక్క ఉంటుందని.. ఈటల విషయంలోనూ అదే స్ట్రాటజీ అమలు చేశారని రాజకీయ వర్గాలు చెవులు కొరుక్కుంటున్నాయి.