కాపులకు అన్యాయం జరిగిందని.. ఆ సామాజికవర్గం ప్రతినిధులతో సమావేశం అవుతారు జనసేనాని పవన్ కల్యాణ్. అలా అని తనను కాపు కులానికే పరిమితం చేయొద్దని ఆయన కంగారు పడతారు. కాపులు ఓటేయకపోవడం వల్లే తాను ఎన్నికల్లో ఓడిపోయానని కూడా కొన్ని సందర్భాల్లో ముక్తాయిస్తారు పవన్. దీనికితోడు వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేయాలో క్లారిటీ లేదని ఓపెన్‌గా ఒప్పేసుకుంటున్నారు. ఇంతకీ జనసేనానికి ఏమైంది? ఆయన డైలమాలో ఉన్నారా? వచ్చే ఏడాదే ఎన్నికలు ఉన్నా ఆయనలో ఇంకా కన్ఫ్యూజన్ కొనసాగుతోందా?
కుల ముద్ర నుంచి బయట పడేందుకు ఆపసోపాలు
బీసీ సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం తర్వాత కాపు సంక్షేమ సేన ప్రతినిధుల సమావేశంలో పవన్ కల్యాణ్ చేసిన ఈ కామెంట్స్ ప్రస్తుతం చర్చగా మారాయి. కుల ముద్ర నుంచి బయట పడేందుకు పవన్ ప్రయత్నిస్తున్నట్టు ఆయన వ్యాఖ్యలతో అర్థం అవుతోంది. అయితే ఈ ముద్ర పడటానికి కారణం ఎవరు? జనసేన పార్టీ పెట్టిన నాటి నుంచే పవన్ కల్యాణ్‌కు కాపు కుల ట్యాగ్ లైన్ తగులుకుంది. రాజకీయంగా ఆ ట్యాగ్‌లైన్ ఏ మేరకు కలిసి వస్తుందో 2019 ఎన్నికల్లో స్వయంగా రుచి చూశారు జనసేనాని. అప్పటి నుంచి తాను అందరివాడినని చెప్పుకోవడానికి ఆపసోపాలు పడుతున్నారు. అయితే ఈ క్రమంలో పవన్ కల్యాణ్ వేస్తున్న అడుగులు మాత్రం చర్చకు దారి తీస్తూనే ఉన్నాయనేది విశ్లేషకుల మాట.
కులం ముద్ర వద్దంటారు.. కాపులతో భేటీ అవుతారు..!
తనను కాపు కులానికే పరిమితం చేయొద్దన్నది పవన్ కల్యాణ్ మాటగా ఉన్నప్పటికీ.. కాపు సామాజికవర్గం నేతలతో ఆయన భేటీ కావడం ప్రశ్నలకు తావిస్తోంది. కాపులకు అన్యాయం జరిగిందని కొన్నిసార్లు గట్టిగా స్వరం వినిపించారు కూడా. ఆయనకు క్యాస్ట్ లైన్ వదలుకోవాలని ఉన్నా.. ఆ గీత నుంచి బయట పడలేని పరిస్థితి కనిపిస్తోంది. పైపెచ్చు కాపులనే బ్లేమ్ చేసిన ఉదంతాలు ఉన్నాయి. భీమవరం, గాజువాకలో తాను పోటీ చేస్తే కాపులు పూర్తిగా ఓటేయలేదన్నదీ ఆయన మాటే.
కులం విషయంలో పవన్ కల్యాణ్ డైలమాలో ఉన్నారా?
తాజాగా పవన్ కల్యాణ్ నిర్వహించిన రెండు సమావేశాలను ఈ సందర్భంగా ప్రత్యేకంగా ప్రస్తావిస్తున్నారు. బీసీ సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించిన మర్నాడే కాపు సంక్షేమ సేన ప్రతినిధులతోనూ జనసేనాని భేటీ అయ్యారు. రెండు సమావేశాల్లోనూ అటూ ఇటూగా సేమ్ ట్యూన్‌లో ఆయన ప్రసంగం సాగింది. పైగా సమాజంలో కాపులు వ్యవహరించాల్సిన తీరుపై గట్టి ఉపన్యాసమే ఇచ్చారు. ఒక పార్టీకి అధినేతగా ఉండి.. ఒక కులం గురించి.. అందులోనూ తన సొంత సామాజికవర్గం గురించి ఈ స్థాయిలో బ్యాటింగ్ చేస్తే .. ఆ ముద్రను చేరిపేసుకోగలరా అనేది కొందరి ప్రశ్న. వైసీపీ, టీడీపీ అధినేతలు రెడ్డి, కమ్మ కులాలకు ప్రాతినిథ్యం వహిస్తున్నా.. వారి ప్రవర్తన ఎలా ఉంది? కులాల విషయంలో వారి నడవడిక ఏంటి? అనేది మరికొందరు బేరీజు వేస్తున్నారు. అందుకే పవన్ కల్యాణ్ కులం విషయంలో డైలమాలో ఉన్నారా అని ఇంకొందరు సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.
2024లో ఎక్కడి నుంచి పోటీ చేయాలో తేల్చుకోలేకపోతున్నారా?
ఇక వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేయాలో కూడా పవన్ కల్యాణ్‌కు క్లారిటీ లేనట్టుంది. గత ఎన్నికల్లో ఆయన భీమవరం, గాజువాకలో పోటీ చేసి ఓడిపోయారు. ఈ రెండుచోట్ల కాపు సామాజికవర్గం ఓటర్ల సంఖ్య ఎక్కువే. కానీ.. కాపు ఓట్లన్నీ గంపగుత్తగా పవన్ కల్యాణ్‌కు పడలేదు. ఇప్పుడు 2024లో ఎక్కడి నుంచి పోటీ చేయాలో తేల్చుకోలేకపోతున్నారు. ఆయన నోటి నుంచే పలు నియోజకవర్గాల పేర్లు బయటకొచ్చాయి. భీమవరం, గాజువాకతోపాటు పిఠాపురం పేరును ప్రస్తావించారు. కాపులు ఎక్కువుగా ఉన్నచోట నుంచి పోటీ చేస్తే.. మిగిలిన కులాల ఓట్లు పోలరైజ్ అయ్యి తనను ఓడిస్తారనే ఆందోళన పవన్ మాటల్లో కనిపించిందని కొందరు అభిప్రాయ పడుతున్నారు. అందుకే తాను కాపు నేతను కాదు అని పదే పదే చెప్పుకొంటున్నారు. దీంతో కులం ఆయన్ని ఓన్ చేసుకుంటుందో.. లేక పవన్ కల్యాణే కులాన్ని ఓన్ చేసుకోకుండా దూరంగా ఉండాలని అనుకుంటున్నారో కానీ.. ఆ ముద్ర మాత్రం బలంగా నాటుకుపోయింది. మరి.. ఈ అంశం నుంచి పవన్ కల్యాణ్ ఎప్పుడు ఎలా బయట పడతారో కాలమే చెప్పాలి.