ఆంధ్రప్రదేశ్‌లో అధికార, ప్రతిపక్షాలు అత్యంత కీలకంగా భావిస్తున్న గుడివాడ రాజకీయం ఎలా టర్న్ అవబోతోంది? ఈసారి రెండు పార్టీలు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నియోజకవర్గంలో కీలకమైన ఓటు బ్యాంక్ ఎటు మళ్ళే ఛాన్స్ ఉంది? పైకి కమ్మ సెగ్మెంట్‌గా చెప్పుకునే గుడివాడలో అసలు కీలకమైన సామాజికవర్గం ఏది? ఇక్కడ టీడీపీ-జనసేన కలిస్తే ఎలా ఉంటుంది? విడివిడిగా పోటీ చేస్తే ఏం జరుగుతుంది?
గెలుపు ఓటముల్లో కాపు ఓటు బ్యాంకే కీలకం
గుడివాడ రాజకీయాలు ఎప్పుడూ ఆసక్తి రేపుతూనే ఉంటాయి. గతంలో ఎన్టీఆర్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించిన నియోజకవర్గం ఇది. ఇక్కడి నుంచి వరుసగా నాలుగుసార్లు ఎమ్మెల్యే అయ్యారు కొడాలి నాని. రెండు విడతలు టీడీపీ నుంచి, మరో రెండు సార్లు వైసీపీ నుంచి ఎమ్మెల్యే అయ్యారాయన. మారిన రాజకీయ పరిస్థితుల్లో కొడాలిని ఓడించి తీరాలని పట్టుదలగా ఉందట టీడీపీ. అదే సమయంలో వైసీపీ కూడా ఈ సీటును ప్రతిష్టాత్మకంగా తీసుకుందట. సాధారణంగా గుడివాడ అనగానే… కమ్మ సామాజికవర్గం డామినేటెడ్ అనుకుంటారు. కానీ.. వాస్తవంలో మేటర్ వేరే ఉంది. దాదాపు 2 లక్షల ఓటర్లు గుడివాడ నియోజకవర్గంలో ఉన్నారు. ఇందులో లక్షా పదివేల ఓట్లు బీసీలవే. ఎస్సీలకు 45 వేలు, కాపులకు 35 వేల ఓట్లు ఉన్నాయి. మొత్తంగా చూసుకున్నప్పుడు ప్రతి ఎన్నికలో ఇక్కడ కాపు ఓటు బ్యాంకు కీలకంగా మారుతోదంట. దీంతో ఆ ఓటు బ్యాంకును తమ వైపు తిప్పుకునే ప్రయత్నాల్లో ఉన్నాయట ప్రధాన పార్టీలు.
కాపు ఓటర్లు జనసేన వైపు మొగ్గుతారన్న అంచనా
కాపు ఓటర్లు జనసేన వైపు మొగ్గుచూపే అవకాశం ఎక్కువన్నది రాజకీయ పార్టీల అంచనా . గత ఎన్నికల్లో ఓటింగ్ తీరును బట్టి ఈ క్లారిటీకి వచ్చాయట. గత 4 సార్వత్రిక ఎన్నికలను పరిశీలిస్తే 2004లో టీడీపీ తరపున పోటీ చేసిన కొడాలి నాని కాంగ్రెస్ అభ్యర్థి కఠారిపై 8 వేలకుపైగా మెజార్టీతో గెలిచారు. 2009 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగానే ఉన్న కొడాలి నానికి 68 వేల ఓట్లు వచ్చాయి. అప్పుడు కాంగ్రెస్‌కు 50 వేలు, ప్రజారాజ్యానికి 21 వేల ఓట్లు పడ్డాయి. ప్రజారాజ్యం పార్టీ కాపు ఓట్లను భారీగా చీల్చిందన్నది నాటి లెక్క. ఇక 2014లో కొడాలి వైసీపీ అభ్యర్థిగా బరిలో దిగారు. ఫైట్ వైసీపీ, టీడీపీ మధ్య జరగటంతో నాని గెలిచారు. 2019లో జనసేన అభ్యర్థి గణేష్ నామినేషన్‌ను తిరస్కరించడంతో ఫైట్ వైసీపీ, టీడీపీకి పరిమితమై నాలుగోసారి గెలిచారు కొడాలి. ఆయన వరుస విజయాలకు కాపు ఓట్ బ్యాంకే కీలకం అన్నది లోకల్ టాక్. కృష్ణా జిల్లాలో కాపు సామాజికవర్గానికి ఆరాధ్యదైవం లాంటివారు వంగవీటి మోహనరంగా. ఆయన కుమారుడిగా రాధాకు కూడా ప్రాధాన్యం ఉంది. రాధాతో కొడాలికి ఉన్న స్నేహ సంబంధాలే ఆయన విజయ రహస్యం అన్నది విశ్లేషకుల మాట. రాధా టీడీపీలో ఉన్నా… గుడివాడలో మాత్రం ఆ పార్టీ తరపున ప్రచారం చేయరు. కొడాలితో ఉన్న స్నేహం కారణంగానే ఆయన అలాంటి స్టాండ్ తీసుకుంటారన్నది వారి సన్నిహితుల మాట.
ఈసారి టీడీపీ గుడివాడ కాపులపై కన్నేసిందా?
ఈసారి ఎలాగైనా…కొడాలిని గుడివాడలో ఓడించాలని పట్టుదలగా ఉన్న టీడీపీ కూడా నియోజకవర్గంలోని కాపు సామాజిక వర్గంపై ఫోకస్ పెట్టిందట. అందుకే..తెలుగుదేశం తరపున రాధా రావి మిత్ర మండలిని కూడా ఏర్పాటు చేశారట. రంగా వర్థంతి కార్యక్రమాలను స్థానికంగా నిర్వహిస్తున్నారు. అయితే గుడివాడ ఎప్పుడు వచ్చినా రాధా… టీడీపీ కార్యక్రమాలకు దూరంగా ఉండి, నానితో మాత్రమే కలుస్తుంటారు. ఈ పరిస్థితుల్లో ఇటీవల జరిగిన రంగా వర్థంతి కార్యక్రమాలను టీడీపీ, వైసీపీ పోటా పోటీగా చేయటం ఉద్రిక్తతకు దారితీసింది. గుడివాడ టీడీపీ ఇన్చార్జి రావి కూడా రాధాను పలు కార్యక్రమాల్లో కలవటమే తప్ప అంతకు మించి ఏం జరగటంలేదట. మరోవైపు జనసేన అధినేత పవన్ ను కొడాలి తన మాటల తూటాలతో ఇబ్బంది పెడుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఈసారి కాపు సామాజిక వర్గం ఓటు బ్యాంకు ఎటు టర్న్ అవుతుందోనన్న ఉత్కంఠ పెరుగుతోందట.