ఆ నియోజకవర్గంలో కాంగ్రెస్ పంచాయితీ ఎప్పటికీ ఒడవని ముచ్చటేనా? మున్సిపల్ ఎన్నికల వేళ ఇద్దరు నేతల మధ్య వార్డుల వాటా వ్యవహారం మొదటికే మోసం తెస్తుందా? తగ్గేదేలే అంటున్న రెండు వర్గాలు ఏం చేయబోతున్నాయి? ఎక్కడ జరుగుతోందా పోట్ల గిత్తల పోరు? ఆ విషయంలో కాంగ్రెస్ అధిష్టానం ఏం చేయాలనుకుంటోంది? మున్సిపల్ ఎన్నికల వేళ గద్వాల్ నియోజకవర్గ రాజకీయం రసత్తరంగా మారుతోంది. కాంగ్రెస్ పార్టీ టికెట్ల కేటాయింపు అంశం వివాదాస్పదం అవుతోంది. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ సరితా తిరుపతయ్య మధ్య అగ్గి మరింత రాజుకుంటున్నట్టు తెలుస్తోంది. మొత్తం టికెట్లు నా వర్గానికే కావాలని ఎమ్మెల్యే… సగానికి పైగా మాకేనంటూ మరో వర్గం పార్టీ పెద్దల ముందు ప్రతిపాదనలు పెట్టడం ఉత్కంఠ రేపుతోంది. దీనికి తోడు గద్వాల మున్సిపల్ చైర్మన్ పీఠం పై తమ వారినే కూర్చోపెట్టాలంటూ ఇద్దరు నాయకులు పట్టుదలగా ఉన్నారట. దీంతో… ఈ మొత్తం వ్యవహారం హస్తం పార్టీ అధిష్ఠానానికి తలనొప్పిగా మారింది. గద్వాల్ కాంగ్రెస్ వర్గ పోరు ఒడవని ముచ్చటగా మారిపోయింది. బీఆర్ఎస్ తరపున గెలిచిన ఎమ్మెల్యే కృష్ణ మోహన్ రెడ్డి ఆ పార్టీకి దూరమైనప్పటి నుంచి వర్గ పోరు మొదలైంది. తాజాగా మున్సిపల్ ఎన్నికల వేళ మరోమారు తన వర్గీయులకు టికెట్టు ఇప్పించుకొని పై చేయి సాధించేలా ఎత్తుగడలు వేస్తున్నారట ఎమ్మెల్యే. 37 వార్డులు ఉన్న గద్వాల్ మున్సిపాలిటీలో తమ వర్గం వాటా తేల్చాలని పట్టుబడుతున్నారు ఇన్ఛార్జ్ సరిత. ఇప్పటికే సర్పంచ్ ఎన్నికల్లో ఆశించిన స్థాయిలో తన వర్గీయులను గెలిపించుకున్న సరిత… మున్సిపాలిటీలోనూ పట్టు తగ్గకుండా సగానికి పైగా వార్డులు తమకు కేటాయించాలని పట్టుబడుతున్నారు.
T20 World Cup: రంగంలోకి పాకిస్తాన్ ప్రధాని.. టీ20 వరల్డ్ కప్ ఆడుతుందా లేదా..?
ఇదే డిమాండ్‌ను జిల్లా ఇంచార్జి మంత్రితో పాటు ఎంపీ మల్లు రవి, ఇతర పార్టీ పెద్దల ముందు పెట్టినట్టు సమాచారం. ఇదే సమయంలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి ఫిరాయింపు అంశాన్ని తెరమీదకు తెస్తూ అసలు ఆయన మనుషులకు టిక్కెట్లు ఎలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారట. తాను పార్టీ మారలేదని, బీఆర్ఎస్లోనే ఉన్నానని చెబుతున్నారు బండ్ల. అలాంటి నాయకుడి వర్గానికి కాంగ్రెస్ టిక్కెట్స్ ఎలా ఇస్తారన్నది సరిత ప్రశ్న. అదే సమయంలో ఎమ్మెల్యే కూడా…. మొత్తం 37 వార్డులను తన వర్గీయులకే ఇవ్వాలని, ఒక్కటి కూడా అటు ఇటు కాకుండా 100శాతం గెలిపిస్తానని చెబుతున్నారట. ఒకవేళ పూర్తి స్థాయిలో తన వర్గీయులకు ఇవ్వకుంటే రెబెల్స్‌ని నిలబెట్టే యోచనలో ఉన్నట్టు సమాచారం. సర్పంచ్ ఎన్నికల్లో తన అనుయాయులను నిలబెట్టి గెలిపించుకున్న అంశాన్ని ఉదాహరిస్తున్నారాయన. మున్సిపల్ ఎన్నికలను కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టాత్మకంగా భావించి ముందుకెళ్తున్న టైంలో గద్వాల ఎపిసోడ్ తలనొప్పిగా మారింది. దీంతో పార్టీ పెద్దలు ఈ అంశంపై ఇప్పటికే ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది. ఇద్దరితో మీటింగ్ పెట్టి వార్డుల వాటా తేల్చేందుకు సిద్ధమైనట్లు సమాచారం. ఒకవేళ ఈ పంచాయతీకి ఫుల్ స్టాప్ పడకపోతే బీజేపీ, BRSలు వ్యూహాత్మకంగా అడుగులు వేసి పరిస్థితిని అనుకూలంగా మలుచుకోవాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తున్న కాంగ్రెస్ పెద్దలు మున్సిపల్ నగరా మోగే నాటికి ఇష్యూ క్లోజ్ చేయాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. దీంతో గద్వాల కాంగ్రెస్ యుద్ధంలో ఎవరికి పైచేయి అవుతుందన్నది ఆసక్తికరంగా మారింది.
T20 World Cup: రంగంలోకి పాకిస్తాన్ ప్రధాని.. టీ20 వరల్డ్ కప్ ఆడుతుందా లేదా..?