Off The Record: ఉన్నట్టుండి ఉలిక్కిపడి నిద్ర లేచినట్టు… తెగ హడావిడి చేసేస్తున్నారు ఆ మాజీ ఎంపీ. గత ఎన్నికల్లో వైసీపీ ఓటమి తర్వాత అసలు ఎక్కడున్నాడో కూడా తెలియని సదరు నేత.. ఇప్పుడు మాత్రం పిలవకుండానే పలుకుతూ… ఇక్కడెవరన్నా నన్ను పిలిచారా అంటూ డైరెక్ట్‌గా సీన్‌లోకి వచ్చేస్తున్నారట. ఇంతలోనే అంత మార్పు ఏంటి? ఎవరా లీడర్? పార్టీ అధిష్టానం నుంచి ఆయనకు పే…ద్ద భరోసా వచ్చిందన్నది నిజమేనా?
మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి ఉన్నట్టుండి యాక్టివ్ అయిపోయారు. ఇన్నాళ్ళు… ఉన్నావా…. అసలున్నావా… అంటూ వెదుక్కున్న వాళ్ళందరికీ ఇప్పుడు కనిపిస్తూ, డోంట్ వర్రీ… ఉన్నా,ఇక్కడే ఉన్నానంటూ తెగ తిరిగేస్తున్నారట. ఇంతలోనే ఎంత మార్పు అంటూ నరసరావుపేట పొలిటికల్ సర్కిల్స్‌లో తెగ గుసగుసలాడేసుకుంటున్నారు. 2009లో రాజకీయాల్లోకి వచ్చారు మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి. ప్రజారాజ్యం పార్టీతో పొలిటికల్ కెరీర్ మొదలైనా… అప్పటి ఎన్నికల సమయానికే ఆ పార్టీని వదిలేసి టీడీపీలో చేరి నరసరావుపేట ఎంపీగా గెలిచారు. అప్పటినుంచి పల్నాడులో యాక్టివ్ పాలిటిక్స్ మొదలుపెట్టారాయన. దాంతో… ఈ ఏరియాలో మంచి పరిచయాలు ఏర్పడ్డాయి.
Off The Record: ఈ నాయకుడు మాకొద్దు.. కేడర్ గగ్గోలు..!
2014లో మరోసారి టీడీపీ తరపున నరసరావుపేట ఎంపీ టిక్కెట్ ఆశించినా….దాన్ని రాయపాటి సాంబశివరావుకు కేటాయించి మోదుగులకు ఎమ్మెల్యే టిక్కెట్ ఇచ్చింది టీడీపీ అధిష్టానం. దాంతో గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో గెలిచినా…అప్పుడు పార్టీ అధికారంలో ఉన్నా…. నియోజకవర్గ రాజకీయాల్ని తట్టుకోలేకపోయారట ఆయన. ఈ క్రమంలో….ఇంకోసారి టీడీపీ టిక్కెట్ రాదని ముందే గ్రహించి వైసీపీ పంచన చేరిపోయారు. అప్పటికే మోదుగుల వేణుగోపాలరెడ్డి బంధువులు అయోధ్యరామిరెడ్డి, ఆళ్ళ రామకృష్ణారెడ్డి వైసీపీలో కీలకంగా ఉండటంతో… తేలిగ్గా లైన్ క్లియర్ అయింది. ఇక 2019 ఎన్నికల్లో వైసీపీ తరపున గుంటూరు ఎంపీగా బరిలో దిగారు మోదుగుల. కానీ… అనుహ్యంగా స్వల్ప తేడాతో ఓటమిపాలయ్యారాయన. అయినా… అప్పుడు పార్టీ అధికారంలోకి రావడంతో… గుంటూరు పార్లమెంట్ ఇన్ చార్జిగా ఐదేళ్లపాటు హవా నడిపారు. కానీ.. 2024లో వైసీపీ కూడా టిక్కెట్ నిరాకరించడం, పార్టీ సైతం ఓడిపోవడంతో… సైలెంట్‌గా ఉండిపోయారు మాజీ ఎంపీ. కానీ…గత కొద్ది రోజులుల నుంచి యాక్టివ్‌గా తిరుగుతుండటం చూస్తున్నవాళ్ళు మాత్రం తెర వెనక ఏదో జరిగిందని గుసగుసలాడుకుంటున్నారు.
గుంటూరు జిల్లా వైసీపీ అధ్యక్షుడిగా వేణుగోపాల్‌రెడ్డిని నియమిస్తారని ఆ మధ్య పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. కానీ… అనూహ్యంగా మాజీ మంత్రి అంబటి రాంబాబుకు ఆ పోస్ట్ దక్కింది.మోదుగులకు జిల్లా అధ్యక్ష పదవి వస్తే తనకు ప్రాధాన్యత తగ్గుతుందని భావించిన గుంటూరు నేత ఒకరు అంబటికి మద్దతు ఇచ్చినట్టు అప్పట్లో చెప్పుకున్నారు. జిల్లా అధ్యక్ష పదవి మిస్ అవడంతో బాగా హర్టయిన మాజీ ఎంపీ… తన బావ అయిన ఆళ్ళ అయోధ్యరామిరెడ్డి ద్వారా జగన్ దగ్గర పావులు కదిపారట. ఆ తర్వాతే ఆయనకు నరసరావుపేట, విజయవాడ పార్లమెంట్ ఇన్ఛార్జ్ పదవి దక్కిందని చెప్పుకుంటున్నారు. ఇక ప్రభుత్వ వైఫల్యాలపై పార్టీ పిలుపునిచ్చిన కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారాయన. ఎలాగైనా సరే… వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ సంపాదించాలనుకుంటూ… ఇప్పటినుంచే అధినేత దృష్టిలో పడేందుకు తెగ కష్టపడుతున్నారట. ఇదే సమయంలో అయోధ్యరామిరెడ్డి కూడా మోదుగులకు ప్రాధాన్యత ఇవ్వాలని జగన్‌కు సిఫారసు చేసినట్టు తెలిసింది.
7800mAh బ్యాటరీ, IP66/68/69/69K రేటింగ్ లతో వచ్చేస్తున్న OnePlus Ace6 స్మార్ట్ ఫోన్..!
దీంతో…ఈసారి మోదుగులకు సీటు గ్యారెంటీ అన్న ప్రచారం జరుగుతోంది వైసీపీ సర్కిల్స్‌లో. సీటు ఇస్తే చాలు… ఎక్కడినుంచైనా పోటీకి సిద్ధమని చెప్పారట ఆయన. పైకి ఎక్కడి నుంచైనా అని అంటున్నారేగానీ…ఆయన చూపు మొత్తం గతంలో పోటీ చేసిన నరసరావుపేట మీదే ఉన్నట్టు తెలుస్తోంది.గత ఎన్నికల్లో పార్టీ తరపున ఇక్కడి నుంచి పోటీ చేసి ఓడిపోయిన మాజీ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ప్రస్తుతం నెల్లూరుకే పరిమితమయ్యారు. ఇక ఆయన ఇక్కడికి తిరిగి వచ్చే అవకాశం కూడా లేదన్న మాటలు వినిపిస్తున్నాయి. అందుకే…. తనకు మంచి పరిచయాలున్న నరసరావుపేటపై ఫోకస్ పెంచారట వేణుగోపాల్‌రెడ్డి. ఇప్పుడు చేస్తున్న ఈ హంగామా అంతా అందుకోసమేనన్నది లోకల్ వాయిస్.