ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఎండీ వేమూరి రాధాకృష్ణ లక్ష్యంగా మాజీ మంత్రి , బీఆర్ఎస్ సీనియర్ నాయకులు జగదీష్ రెడ్డి తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. రాధాకృష్ణ తన పత్రికలో రాస్తున్న కథనాలు, విశ్లేషణలు అత్యంత జుగుప్సాకరంగా ఉన్నాయని, వాటిపై తక్షణమే విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. పత్రికా విలువల గురించి నీతులు చెప్పే వ్యక్తి, తన రాతలతో సమాజంలో విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు.
ఒక పత్రికా అధినేతగా విశ్లేషణ చేసేటప్పుడు రెండు వైపుల వాదనలను పరిగణనలోకి తీసుకోవాలని, కానీ రాధాకృష్ణ కేవలం ఒక వర్గానికి కొమ్ముకాస్తూ ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని జగదీష్ రెడ్డి ఆరోపించారు. ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని రాధాకృష్ణకు దొరికిన “పాలేరు”గా అభివర్ణిస్తూ.. తన పాలేరు చేతిలో అధికారం ఉందని అహంకారంతో రాధాకృష్ణ పిచ్చిరాతలు రాస్తున్నారని విమర్శించారు. ఆయన ఎన్ని క్లీన్ షీట్లు ఇచ్చినా రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని ప్రజల అసహ్యం నుండి కాపాడలేరని స్పష్టం చేశారు.
గత పదేళ్లుగా , బీఆర్ఎస్ అధికారం కోల్పోయిన తర్వాత కూడా కేసీఆర్‌పై రాధాకృష్ణ నిరంతరం విషం కక్కుతున్నారని జగదీష్ రెడ్డి మండిపడ్డారు. ఉద్యమ సమయంలో మీరు ఎంత విషం చిమ్మినా, చంద్రబాబుతో కలిసి ఎన్ని కుట్రలు చేసినా కేసీఆర్ ఎప్పుడూ కక్ష సాధింపులకు పాల్పడలేదని గుర్తు చేశారు. మీ ఆఫీసుపై దాడి జరిగినప్పుడు స్వయంగా కేసీఆరే వచ్చి పరామర్శించారని, కానీ ఇప్పుడు మీరు ఆ కృతజ్ఞత లేకుండా రోత రాతలు రాస్తున్నారని ధ్వజమెత్తారు.
రాధాకృష్ణ తన కథనాల్లో ఐఏఎస్ అధికారుల పేర్లు ప్రస్తావిస్తూ వారి పరువు తీస్తున్నారని జగదీష్ రెడ్డి ఆరోపించారు. ముఖ్యంగా ఒక మహిళా ఐఏఎస్ అధికారి ఆత్మహత్యకు ప్రయత్నించిందని ఏ ఆధారాలతో రాశారో చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ వ్యవహారంపై ఐఏఎస్ అధికారుల సంఘం మౌనం వీడాలని, రాధాకృష్ణ రాసిన అబద్ధపు కథనాలపై విచారణ జరపాలని కోరాలని ఆయన సూచించారు.
బొగ్గు గనుల టెండర్ల రద్దు , ఇతర స్వార్థ ప్రయోజనాల కోసమే ఇలాంటి తప్పుడు కథనాలను రాధాకృష్ణ సృష్టిస్తున్నారని జగదీష్ రెడ్డి ఆరోపించారు. ఈ వ్యవహారంలో ఉన్న అసలు నిజాలను వెలికితీయడానికి ఏసీబీ (ACB) లేదా ప్రత్యేక విచారణ బృందం (SIT) తో దర్యాప్తు చేయించాలని డిజీపీని డిమాండ్ చేశారు.
“నిరంతరం నీతులు వల్లించే రాధాకృష్ణ.. లోపల మాత్రం కుళ్లును నింపుకున్నారు” అని జగదీష్ రెడ్డి వ్యాఖ్యానించారు. మీడియా ముసుగులో జరుగుతున్న ఈ రాజకీయ బ్రోకరిజం వల్ల ఎన్నో కుటుంబాలు క్షోభకు గురవుతున్నాయని, ప్రజలు ఇలాంటి రాతలను అసహ్యించుకుంటున్నారని ఆయన హెచ్చరించారు.