Off The Record: బాపట్ల జిల్లా చీరాల. నిన్న మొన్నటి వరకూ మూడు ముక్కలాటగా కొనసాగిన ఇక్కడ వైసీపీ వ్యవహారాలకు పార్టీ అధిష్ఠానం చెక్ పెట్టింది. చీరాల ఎమ్మెల్యే కరణం బలరాం.. మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్, ఎమ్మెల్సీ పోతుల సునీత చీరాల వైసీపీలో మూడు పవర్ సెంటర్స్‌గా మారటంతో పార్టీ పరిస్థితి మూడడుగులు ముందుకు.. ఆరడుగులు వెనక్కు అన్నట్టుగా తయారైంది. గత ఎన్నికల్లో వైసీపీ నుంచి ఆమంచి కృష్ణమోహన్ పోటీ చేసి ఓడారు. ఆమంచిపై గెలిచిన టీడీపీ ఎమ్మెల్యే కరణం బలరాం.. ఆ తర్వాత తనయుడు వెంకటేష్‌తో కలిసి సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరారు. అప్పటి నుంచి చీరాలలో ఆమంచి.. కరణం వర్గీయులు ఒకే పార్టీలో ఉన్నా ప్రత్యర్థులుగా మారిపోయారు. గత మున్సిపల్ ఎన్నికల్లో ఇరువర్గాలు అభ్యర్థులను రంగంలోకి దింపాయి. అధిష్ఠానం జోక్యంతో అప్పటికి ఓ పరిష్కారం దొరికినా రెండువర్గాల మధ్య సయోధ్య కుదరలేదు. ఎమ్మెల్సీ పోతుల సునీత సైతం టికెట్ రేసులో ఉన్నానని సిగ్నల్స్ ఇచ్చారు.
Read Also: Off The Record: కంటోన్మెంట్ సీటుపై నేతల ఆశలు..! పోటీకి ఆ ముగ్గురు తహతహ..!
పార్టీ పెద్దలు కరణం వెంకటేష్‌ను చీరాల వైసీపీ ఇంఛార్జ్‌గా ప్రకటించడంతో ఆయన సారథ్యంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇదే సమయంలో పర్చూరులో వైసీపీని బలోపేతం చేయాలని భావించి.. మాజీ ఎమ్మెల్యే ఆమంచి కృష్ణమోహన్‌కు అక్కడి బాధ్యతలు తీసుకోవాలని సూచించింది. కొన్నాళ్లు ఎటూ తేల్చకుండా ఉన్న ఆమంచి ఎట్టకేలకు పర్చూరు పార్టీ బాధ్యతలు స్వీకరించారు. దీంతో చీరాల వైసీపీ టికెట్‌పై రకరకాల ఈక్వేషన్స్ ప్రచారంలోకి వచ్చాయి. చీరాల బీసీ ఓటర్లను దృష్టిలో పెట్టుకుని ఎమ్మెల్సీ పోతుల సునీతకు అవకాశం ఇస్తారనే ప్రచారం జరిగింది. ఆమె ఎమ్మెల్సీ పదవికాలం ముగుస్తుండటంతో ఎమ్మెల్యేగా పోటీ చేసేందుకు సునీత ఇంట్రస్ట్‌గా ఉన్నారనే టాక్ నడిచింది. కానీ సునీతను ఎమ్మెల్సీగా కొనసాగించటంతో అన్నింటికీ సమాధానం దొరికిందనే వాదన నడుస్తోంది.
Read Also: Off The Record: గతంలో తీవ్ర విమర్శలు..! టీడీపీలో కన్నా ఇమడగలరా?
ఆమంచి పర్చూరు వెళ్లడం.. సునీత మళ్లీ ఎమ్మెల్సీ కావడంతో చీరాల వైసీపీలో ఇక మిగిలిన నాయకుడు కరణం బలరాం ఆయన తనయుడు వెంకటేష్ మాత్రమే. కరణం వర్గంలోనూ ఒకరకమైన ధీమా కనిపిస్తోందట. చీరల బరిలో వెంకటేషే ఉంటారని ప్రచారం చేస్తున్నారు. ఇటీవల చీరాలలో జరిగిన నియోజకవర్గ పార్టీ సమన్వయ సమావేశంలోనూ రీజనల్ కోఆర్డినేటర్లు బీదా మస్తాన్ రావు, భూమన కరుణాకర్ రెడ్డిలు వచ్చే ఎన్నికల్లో కరణం వెంకటేష్ పోటీ చేస్తారని చెప్పారట. సీఎం జగన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాకే వాళ్లు ఆ ప్రకటన చేశారని చెబుతున్నారు. చీరాలలో ఉన్న బీసీ ఓటర్లను సంతృప్తి పరిచేందుకు సునీతకు ఎమ్మెల్సీ.. కాపు ఓటర్లును సంతృప్తి పరిచేందుకు మాజీ ఎమ్మెల్యే ఆమంచిని పర్చూరులో అకామిడేట్ చేయటం పార్టీకి కలిసి రావచ్చని లెక్కలు వేస్తున్నారట. ప్రస్తుతం చీరాలలో కీలకంగా మారిన పార్టీ నేతలు వరికూటి అమృతపాణి, పాలేటి రామారావు తదితరుల మద్దతు ఎవరికి అనేది చర్చగా మారిందట. అంతా ఓకే అనుకుంటున్న తరుణంలో కొందరు మాత్రం ఎన్నికల సమయానికి ఏవైనా మార్పులు జరగవచ్చు.. ఏమో గుర్రం ఎగరావచ్చు అని రచ్చబండ చర్చలు పెడుతున్నారట. చీరాల, పర్చూరు నియోజకవర్గాల బాధ్యతలు ఎవరివి వారికి అప్పగించటంతో ఒకరి గెలుపునకు ఒకరు సహకరించుకుంటారా? ఎమ్మెల్సీ సునీత.. కరణం వెంకటేష్ వెంట నిలుస్తారా? వర్గ రాజకీయాలకు పెట్టింది పేరైన చీరాలలో ఏ వర్గం ఎటు మారుతుంది? ఇంకాస్త స్పష్టత రావాలంటే ఎన్నికల వరకు ఆగాల్సిందే.