Off The Record:కన్నా లక్ష్మీనారాయణ. కరుడుగట్టిన కాంగ్రెస్ వాది. రాష్ట్ర విభజన తర్వాత అనూహ్యంగా బీజేపీలోకి వెళ్లి అందరినీ ఆశ్చర్యపరిచారు. పైగా తన రాజకీయ జీవిత ప్రయాణంలో టీడీపీని బద్ధ శత్రువుగానే చూశారు. ఓ రేంజ్‌లో టీడీపీని.. టీడీపీ పెద్దలను విమర్శించిన ఉదంతాలు ఎన్నో.. ఎన్నెన్నో. అలాంటిది బీజేపీని వీడిన కన్నా.. ఇప్పుడు తెలుగుదేశం పార్టీలోకి వెళ్తుండటం మరింత ఆశ్చర్య పరుస్తోంది. విద్యార్ధి దశ నుంచి కన్నా కాంగ్రెస్ వాది. దాదాపు మూడు దశాబ్దాలుగాపైగా టీడీపీని వ్యతిరేకిస్తూ వస్తున్నారు. ఒకవేళ ఆయన టీడీపీలోకి వెళ్లాలని అనుకుంటే.. రాజకీయ భవిష్యత్తే ముఖ్యమని భావిస్తే 2014లోనే వెళ్లేవారు. ఆ సమయంలో టీడీపీ నుంచి ఆహ్వానాలు వెళ్లాయని ప్రచారం సాగింది. ఇప్పుడు పదేళ్ల తర్వాత ఆయన చూపు తెలుగుదేశంపై పడింది. ఇక్కడ ఇంకో గమ్మత్తు ఉంది. ఇన్నాళ్లూ కన్నా ప్రయాణం చేసింది జాతీయ పార్టీలలోనే. ఒకటి కాంగ్రెస్, రెండోది బీజేపీ. సడెన్‌గా గేర్ మార్చి టీడీపీ సైకిల్ ఎక్కబోతున్నారు. అలాగే బీజేపీ నాయకుడు టీడీపీలోకి వెళ్లడం పెద్ద విషయం కాకపోయినా.. కన్నా ఆ నిర్ణయం తీసుకోవడమే ఆసక్తి కలిగిస్తోంది.
Read Also: Top Headlines @ 9 PM: టాప్ న్యూస్
ఇన్నాళ్లూ కన్నా లక్ష్మీనారాయణ ఏం చెబితే అదే పార్టీల్లో నడిచేది. ఇప్పుడు టీడీపీలోకి వెళ్తే పార్టీ చెప్పింది కన్నా చేయాలి. లేదంటే పార్టీలో మనుగడ కష్టం. ఆ విషయం కన్నాకు తెలియంది కాదు. పైగా టీడీపీ పట్ల ఆయన దశాబ్దాల వైఖరి కూడా ప్రస్తుతం ప్రశ్నలకు కారణం అవుతోంది. కన్నా టీడీపీలో ఇమడగలరా? తెలుగుదేశంపార్టీలో తన రాజకీయ ప్రయాణంపై ఎలాంటి రూట్ మ్యాప్ సిద్ధం చేసుకున్నారు? అనే టాక్ నడుస్తోంది. ఇప్పటికే కన్నాతోపాటు కన్నా అనుచరుల కార్లకు టీడీపీ స్టిక్కర్లు అంటించేశారు. నిన్న మొన్నటి వరకు ఉమ్మడి గుంటూరు జిల్లాలో కన్నాను రాజకీయంగా విభేదించిన నాయకులు వచ్చి ఈ మాజీ మంత్రిని కలిసి మాటలు.. చేతులు కలిపేసి పొలిటికల్ తాలింపులు పెట్టేస్తున్నారు.
Read Also: YS Sharmila : హిజ్రాలకు వైఎస్ షర్మిల బహిరంగ క్షమాపణ చెప్పాలే..
ఈ మధ్య కన్నా రాజకీయ ప్రత్యర్థి రాయపాటి సాంబశివరావు కీలక కామెంట్స్ చేశారు. కన్నా టీడీపీలోకి ఎలా వస్తారో చూస్తానని.. ఆయన వస్తే టీడీపీ అధిష్ఠానంతో అటోఇటో తేల్చుకుంటాననే విధంగా వ్యాఖ్యలు చేశారు రాయపాటి. గతంలో కన్నా టీడీపీపై.. టీడీపీ నేతలపై చేసిన కులం పరమైన విమర్శలకు ఇప్పుడేం సమాధానం చెబుతారని కూడా మాజీ ఎంపీ ప్రశ్నించారు. ఇది ఒక్క రాయపాటే కాదు.. రాయపాటిలాంటి చాలా మంది నేతలు కన్నాను ఇవే ప్రశ్నలు వేస్తున్నారు. కానీ బయట పడటం లేదు. వాస్తవానికి కన్నా.. రాయపాటి గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. అప్పుడు కూడా ఇద్దరూ ఉప్పూ నిప్పే. దానిని మరోసారి రిపీట్ చేశారు రాయపాటి. ఎవరి సందేహాలు ఎలా ఉన్నా.. టీడీపీలో ఆ పార్టీ అధినేతతో కలిసి కన్నా ప్రయాణం చేయాలి. గతంలో టీడీపీ అధినేతను ఇదే కన్నా తీవ్ర విమర్శలు చేశారు. ఇప్పుడు సర్దుబాటు తప్పదు. కన్నా గతంలో టీడీపీ అధినేతపై చేసిన విమర్శలు అప్పుడే సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. తన అంతరాత్మకు వ్యతిరేకంగా వెళ్లను అని పదే పదే చెప్పే కన్నా.. ఇప్పుడు తన అంతరాత్మకు ఎలా సమాధానం చెప్పుకొంటారో ఏమో..! ఇప్పటికైతే రాయపాటి బయటపడ్డారు. కన్నాను వ్యతిరేకించే లీడర్లు టీడీపీలో మరీ ముఖ్యంగా గుంటూరు జిల్లాలో అనేక మంది ఉన్నారు. వాళ్లంతా రాజకీయ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని సర్దుకుపోతారో లేక కడుపులో కత్తులు పెట్టుకుని ముఖాలపై పైకి నవ్వులు చిందిస్తారో చూడాలి. ప్రస్తుతానికి కార్యక్రమాలు చకచకా జరిగిపోతున్నాయి. కన్నా టీడీపీలో మింగిల్ అవుతారో లేదో.. కన్నాకు టీడీపీలో ఎలాంటి గౌరవం లభిస్తుందో అనేది ప్రస్తుతం రాజకీయ వర్గాల్లో ఉత్కంఠ రేకెత్తిస్తోంది.