ఏపీలో కాపుల తరఫున వకాల్తా పుచ్చుకున్నట్టుగా మాట్లాడేస్తున్నారు ఆ రాజ్యసభ సభ్యుడు. కాపునాడు సభలో తాను కులానికి పెద్దకాపు అవుతానని ప్రకటించారు. ఇప్పుడు విజయవాడ ఎయిర్‌పోర్టుకు వంగవీటి రంగా పేరు పెట్టాలనేది ఆయన డిమాండ్. ఎందుకు తేనెతుట్టలను రేపుతున్నారు? కాపు ఓట్లకు గాలం వేస్తున్నారా? ఇది ఆయన పార్టీ ఎత్తుగడా.. లేక సొంత అజెండానా? ఎవరా ఎంపీ?
‘కాపు’ జపం చేస్తున్న బీజేపీ ఎంపీ
జీవీఎల్ నరసింహారావు. బీజేపీ రాజ్యసభ సభ్యుడు. ఈ మధ్య ఏపీ పాలిటిక్స్‌లో సంచలనంగా మారుతున్నారు. వచ్చే ఎన్నికల్లో విశాఖ నుంచి ఎంపీగా పోటీ చెయ్యాలని నిర్ణయించుకున్న ఆయన.. ఆ దిశగా పటిష్టమైన గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నారు కూడా. అయితే రాష్ట్రంలో బలపడటం బీజేపీ టాప్ ప్రయారిటీ. జీవీఎల్ కు ప్రత్యేక బాధ్యతలను అధినాయకత్వం అప్పగించిందనే ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో ఎంపీ చేస్తున్న ప్రయత్నాలు, తెరపైకి తీసుకుని వస్తున్న డిమాండ్స్ చర్చగా మారుతున్నాయి. కాపులకు సామాజిక, రాజ్యాధికారం బీజేపీతోనే సాధ్యం అనే అజెండాను బలంగా తీసుకుళ్లే పనిని భుజనా వేసుకున్నారు ఈ ఎంపీ.
కాపు ఓట్లకు బీజేపీ గురి..!
ఏపీలో అతిపెద్ద సమూహంగా వున్న కాపులు ప్రస్తుత రాజకీయ పరిస్ధితుల్లో సందిగ్ధంలో ఉన్నారనే అభిప్రాయం బీజేపీ వర్గాల్లో ఉందట. గత ఎన్నికల్లో టీడీపీపై కోపంతో కాపులు వైసీపీ వైపు మొగ్గారనేది ఓ లెక్క. జనసేన ఉన్నప్పటికీ ఒక్క సీటుకే పరిమితం కావడంతో కాపుల ఓట్లు ఎక్కడా గంపగుత్తగా JSPకి పడలేదనేది వారి అభిప్రాయం. అందుకే బీజేపీ ఫోకస్ కాపులపైనే వుందనేది ఇటీవల పరిణామాల ద్వారా తెలుస్తోంది. బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవిని వరుసగా రెండుసార్లు కాపులకే కేటాయించింది. మాజీ మంత్రి కన్నా లక్ష్మీనారాయణ అలక వహిస్తే.. పార్టీ అగ్రనేత విజయవాడ వచ్చి సర్దుబాటు చేశారు. ఇంకోవైపు జనసేన, బీజేపీల మైత్రి కొనసాగుతోంది. భవిష్యత్తులోను జనం, జనసేనతోనే తమ ప్రయాణమని సోము వీర్రాజు చెబుతున్నారు. కాపులకు మరింత దగ్గర కావడం కీలకంగా భావిస్తోంది బీజేపీ.
ఏపీలో కర్నాటక మోడల్ అమలు చేస్తోందా?
ఏపీలో ఎదగడానికి కర్ణాటక మోడల్ ను తీసుకుని బీజేపీ ప్రయోగం చేస్తుండగా….అందుకు జీవీఎల్ అస్త్రాలు బయటకు తీసుకున్నారనేది ఓ వాదన. కన్నడనాట లింగాయత్‌లను ఆకర్షించడంలో కాషాయ పార్టీ సక్సెస్ అయింది. సామాజిక సాధికారిత అజెండాగా కాపులను దగ్గర చేర్చుకోగలిగితే అధికారం ఖాయమనే అంచనాలు ఉన్నాయట. ఆ కోణంలోనే జీవీఎల్ వేదిక ఏదైనా.. వ్యవహారం ఎంత కాంట్రవర్సీ అయినా వెనక్కు తగ్గడం లేదు. కాపుల ఐక్యత పేరుతో కొద్ది నెలల క్రితం విశాఖ వేదికగా రంగారాధా రీయూనియన్ ఓ బహిరంగ సభను నిర్వహించింది. రాజకీయ వేదికగా భావించిన టీడీపీ, వైసీపీ, జనసేనల్లోని కాపు నాయకత్వం సభకు డుమ్మా కొడితే.. అతిథిగా వచ్చిన జీవీఎల్ మాత్రం అందరి దృష్టిలో పడేలా కామెంట్స్ చేశారు. ఆ సభ తర్వాత జీవీఎల్ సామాజికవర్గం ఏమిటి అనేంతగా చర్చ జరిగిందంటే ఆయన కామెంట్స్ ఎంతటి ప్రభావం చూపాయో అర్ధం చేసుకోవచ్చు.
గన్నవరం ఎయిర్‌పోర్టుకు రంగా పేరు పెట్టాలని డిమాండ్
కృష్ణా.. ఎన్టీఆర్ జిల్లాల్లో ఒకదానికి వంగవీటి మోహనరంగా పేరు పెట్టాలని ప్రతిపాదన తీసుకుని రావడం ద్వారా విస్త్రతమైన చర్చకు తెరతీశారు జీవీఎల్. ఇదేదో రాజకీయ ఎత్తుగడగా భావించగా ఇప్పుడు పార్లమెంట్ వేదికగా కాపు సామాజికవర్గం తమ ఐడెంటిటీగా భావిస్తున్న రంగా ప్రస్తావన తీసుకొచ్చారు. ఆయన పేరును విజయవాడ ఎయిర్ పోర్టుకు పెట్టాలని డిమాండ్ చేశారు. అయితే అసలు జీవీఎల్ కు కాపులకు సంబంధం ఏంటనే ప్రశ్నలు సంధించేవారు ఉన్నారు. బలమైన రాజకీయ వ్యూహంలో భాగంగానే తేనెతుట్టలను రగిలించడం ద్వారా జీవీఎల్ వేడిని రాజేస్తున్నారనే వాదన ఉంది. మరి.. కాపులకు పెద్దకాపుగా ఉంటానన్న ఈ రాజ్యసభ సభ్యుడి వ్యూహం బీజేపీకి వర్కవుట్ అవుతుందా? ఆ సామాజికవర్గం ఎలా రిసీవ్ చేసుకుంటుందో కాలమే చెప్పాలి.