కీలక నేతల మధ్య గ్యాప్ తగ్గించే పనిపై ఢిల్లీ బీజేపీ పెద్దలు దృష్టి పెట్టారు సరే..! తెలంగాణ బీజేపీలో అడుగు ముందుకు పడని చేరికల సంగతి ఏంటి? ప్రత్యేకంగా కమిటీ వేసినా.. ఎందుకు పురోగతి లేదు? ఈ అంశంపై బీజేపీ హైకమాండ్ ఏదైనా క్లారిటీ ఇచ్చిందా? దిశానిర్దేశం చేసిందా? అమిత్ షా నిర్వహించిన మీటింగ్‌లో ఏం జరిగింది?
చేరికలపై సమీక్షలతోనే సరి..!
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల సమయం దగ్గర పడుతోంది. బీజేపీ నేతలు అధికారంలోకి వస్తామని భారీ ప్రకటనలు చేస్తున్నారు. క్షేత్రస్థాయిలో బలోపేతం కావడానికి.. బలమైన నాయకులను పార్టీలోని ఆహ్వానించడానికి పార్టీ ప్రత్యేకంగా చేరికల కమిటీని వేసింది. గల్లీ నుంచి ఢిల్లీ స్థాయి నేతలకు కాషాయ కండువా కప్పాలన్నది పార్టీ పెద్దల ఆలోచన. కానీ.. బీజేపీ ఆశించిన స్థాయిలో చేరికలు లేవు. ఈ అంశంపై హైదరాబాద్‌లోనూ.. హస్తినలోనూ పలుమార్లు సమీక్షలు చేసినా ఎక్కడి గొంగళి అక్కడే అన్నట్టు ఉంది సమస్య.
చేరికల కమిటీకి అమిత్ షా ఫ్రీ హ్యాండ్ ఇచ్చారా?
చేరికలు లేకపోవడానికి బీజేపీ నేతలు చెబుతున్న కారణం ఒక్కటే. టికెట్‌పై హామీ ఇస్తే జంప్ చేయడానికి చాలా మంది సిద్ధంగా ఉన్నారని. అయితే అలాంటి హామీ ఇచ్చే పరిస్థితి లేకపోవడంతో చేరిక కమిటీలోని నేతలు చేతులు ఎత్తేసినట్టు తెలుస్తోంది. దీనికితోడు బీజేపీలోకి రావడానికి సిద్ధంగా ఉన్న నాయకులు వివరాలు లీక్ కావడంతో ఆగిపోతున్నారని మరో వాదన ఉంది. తాజాగా ఢిల్లీలో అమిత్ షా నిర్వహించిన సమావేశంలో చేరికలపై గట్టిగానే ప్రశ్నించినట్టు సమాచారం. బీజేపీ ఇతర పార్టీల నేతలు ఎందుకు చేరడం లేదు? అని షా ప్రశ్నిస్తే.. టికెట్‌పై హామీ లభించక ఎవరూ రావడం లేదని రాష్ట్ర నాయకులు బదులిచ్చారట. బలమైన నాయకులు రావడానికి ఆసక్తితో ఉన్నా.. టికెట్‌పై భరోసా లేక ముందడుగు పడటం లేదని చెప్పారట. ఈ విషయంలో రాష్ట్ర నాయకులకు కొంత ఫ్రీ హ్యాండ్ ఇచ్చారట అమిత్ షా. బలమైన నాయకులు బీజేపీలోకి రావడానికి సిద్ధంగా ఉంటే.. అలాంటి హామీ ఇవ్వాలని స్పష్టం చేశారట. అయితే ఒకరొస్తుంటే.. ఇంకొకరు అడ్డుకుంటున్నారని మరికొందరు ప్రస్తావించారట. ఆ తరహా సమస్యలు వస్తే అధ్యక్షుడితో మాట్లాడి సెట్ చేసుకోవాలని.. రెగ్యులర్‌గా అంతా సమావేశం కావాలని సూచించారట షా.
ముందుగానే అభ్యర్థుల ప్రకటనకు నో..!
అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులను ముందుగానే ఖరారు చేయాలని ఇంకొందరు రాష్ట్ర నాయకులు ఢిల్లీ పార్టీ పెద్దల దగ్గర ప్రస్తావించారట. అన్నిచోట్లా కాకపోయినా.. బలమైన అభ్యర్థులు ఉన్నచోట ఆ మేరకు ప్రకటన చేస్తే ఫీల్డ్‌లో పనిచేసుకోవడానికి వీలు కలుగుతుందని చెప్పారట. ఇదే విషయాన్ని గతంలోనూ బీజేపీ సంస్థాగత జాతీయ ప్రధాన కార్యదర్శి BL సంతోష్ ముందు పెట్టారు. బీజేపీలో అలాంటి సాంప్రదాయం లేదని ఆయన నో చెప్పారు. తాజా సమావేశంలోనూ ఈ అంశంపై రిప్లయ్ లేదని తెలుస్తోంది. ఇప్పుడు కూడా టికెట్‌పై హామీ ఇవ్వాలని చెప్పారు కానీ.. వాళ్లే అభ్యర్థులని మాత్రం ప్రకటన చేయొద్దని ఢిల్లీ పెద్దలు గీత గీశారట. మరి.. బీజేపీ లైన్‌లో చేరికలు ఎంత వరకు ముందుకెళ్తాయో కాలమే చెప్పాలి.