వైసీపీలో నిత్యం వివాదాలు ఉండే నియోజకవర్గాల్లో అదీ ఒకటి. ఎమ్మెల్యే.. ఇంఛార్జి మధ్య, వారి అనుచరుల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. ఇది చాలదన్నట్టు తాజాగా పక్క జిల్లా నుంచి ఓ మంత్రి సోదరుడు వైద్య శిబిరాల పేరుతో నియోజకవర్గంలో ఎంట్రీ ఇవ్వడంతో కలకలం రేగుతోందట.
కోడుమూరువైపు చూస్తున్న ఆదిమూలపు బ్రదర్స్
కర్నూలు జిల్లాలోని కోడుమూరు SC రిజర్డ్వ్ నియోజకవర్గం. ఇక్కడ ఎమ్మెల్యే డాక్టర్ సుధాకర్. వైసీపీ నియోజకవర్గ ఇంఛార్జ్‌గా ఉన్నారు కోట్ల హర్షవర్ధన్‌రెడ్డి. ఈ ఇద్దరి మధ్య నిత్యం తగాదాలే. అనేకసార్లు అధిష్ఠానం పంచాయితీలు చేసినా.. వారి మధ్య గ్యాప్ ఏమాత్రం తగ్గలేదు. ఇప్పటికీ వారిద్దరికీ మాట్లల్లేవ్. తాజాగా మంత్రి ఆదిమూలపు సురేష్ సోదరుడు సతీష్ వైద్య శిబిరాల పేరుతో కోడుమూరులో ఎంట్రీ ఇవ్వడం చర్చగా మారింది. ఇప్పటికే ఎమ్మెల్యే సుధాకర్‌కు రాబోయే ఎన్నికల్లో టికెట్ ఇవ్వొద్దని కోట్ల హర్ష వర్గం అధిష్ఠానానికి ఫిర్యాదు చేసిందట. ఎమ్మెల్యే సుధాకర్, ఇంఛార్జ్ హర్ష విభేదాలతో ఆ నియోజకవర్గం టికెట్ కోసం చాలా మంది ఆశలు పెంచుకుంటున్నారు. మంత్రి ఆదిమూలపు సురేష్ సోదరుడు సతీష్ కూడా ఆ ఆశావహుల్లో ఒకరు.
నియోజకవర్గంలో వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తున్న సతీష్
ఆదిమూలపు సతీష్ కోడుమూరుపై కన్నేసి చాలా రోజులైంది. ఎమ్మెల్యే సుధాకర్‌కు నియోజకవర్గంలో ప్రతికూల పరిస్థితులు ఉన్నాయని.. గట్టిగా ప్రయత్నిస్తే వైసీపీ టికెట్ దక్కుతుందని సతీష్ కొన్నాళ్లుగా పావులు కదుపుతున్నారట. సతీష్ గూడూరులో వైద్య శిబిరం నిర్వహించేందుకు ప్రయత్నిస్తే ఎమ్మెల్యే సుధాకర్ అడ్డుకున్నారట. MLC ఎన్నికల కోడ్ అమలులో ఉండగా అనుమతి ఎలా ఇస్తారని అధికారులపైనా ఆగ్రహం వ్యక్తం చేశారట. దీంతో అధికారులు అనుమతి రద్దు చేసినా సతీష్ పట్టుబట్టి కార్పొరేట్ ఆసుపత్రి వైద్యులను పిలిపించి శిబిరం నిర్వహించారు.
మంత్రి సురేష్ సైతం ఆరా తీశారట..!
వాస్తవంగా మంత్రి ఆదిమూలపు సురేష్ కూడా కోడుమూరు నుంచి పోటీ చేస్తే ఎలా ఉంటుందనే ఆలోచన చేస్తున్నారట. గతంలో ఇంఛార్జ్ కోట్ల హర్షతో ఇదే విషయాన్నే ప్రస్తావించారట. తాను వస్తే ఏమైనా అభ్యంతరమా అని సురేష్ ఆరా తీశారట. అధిష్ఠానం టికెట్ ఇస్తే తనకు ఎలాంటి అభ్యంతరం లేదని మంత్రికి సమాధానం ఇచ్చారట హర్ష. కర్నూలులో ఆదిమూలపు సురేష్, సతీష్ కుటుంబానికి విద్యాసంస్థలు ఉన్నాయి. ఈ విద్యాసంస్థలు ఆదిమూలపు సతీష్ చూస్తున్నారు. అందుకే ఆయన కోడుమూరు నియోజకవర్గ నేతలతో టచ్‌లో ఉంటున్నారు. ఎన్నికల్లో పోటీ చేసేందుకు అవసరమైన గ్రౌండ్ ప్రిపేర్ చేసుకుంటున్నారట సతీష్. అందులో భాగంగానే వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారనే టాక్ నడుస్తోంది. ఈయన సంగతి ఇలా ఉంటే.. ఆ మధ్యకాలంలో ఓ జర్నలిస్టు కూడా రేస్‌లోకి వచ్చారట. కోడుమూరు నియోజకవర్గ వైసీపీ ముఖ్య నేతలకు తన బర్త్ డే పేరుతో భారీ విందు కూడా ఇచ్చారట. ఇపుడు ఏకంగా సతీష్ వైద్య శిబిరం నిర్వహించడంతో ఎమ్మెల్యే సుధాకర్ వర్గంలో కలకలం బయలు దేరింది. మొత్తమ్మీద అధిష్ఠానం నిర్ణయం ఏంటో ఏమో.. కోడుమూరు వైసీపీ పాలిటిక్స్ మాత్రం హాట్ హాట్ గా ఉన్నాయి.