Off The Record: జాతీయ రాజకీయాల్లో వైసీపీ కొత్త దారులు వెదుక్కుంటున్నట్టు కనిపిస్తోందంటున్నారు రాజకీయ విశ్లేషకులు. రాష్ట్రంలో అధికారంలో ఉన్నంత కాలం బీజేపీతో అంటకాగి, ఆ పార్టీ ఆడించినట్టు ఆడి… ఏది చెబితే దానికి ఓకే చెప్పేసింది వైసీపీ. పార్టీలే వేరు కానీ… బీజేపీ నేతలు మేం వేరు కాదన్నట్టు జాతీయ స్థాయిలో వ్యవహరించింది వైసీపీ. ఒకట్రెండు సందర్భాల్లో మినహా ఎక్కువ, కీలక అంశాల్లో కాషాయ దళానికి ఉభయ సభల్లో బాసటగా నిలిచింది. అలాంటి వైసీపీ… ఓడిపోయాక రూట్ మార్చేసినట్టు కనిపిస్తోందట. బీజేపీ కావాలి కానీ… ఆ పార్టీతో పొత్తు మాత్రం వద్దంటూ ఒంట్టెద్దు పోకడలు పోయిన వైసీపీ ఎన్నికల్లో దారుణ ఓటమిని మూట కట్టుకుంది. ఇక ప్రస్తుతం బీజేపీ తన ప్రధాన శత్రువు టీడీపీతో కలిసి ఉండటంతో అట్నుంచి తనకు ద్వారాలు మూసుకుపోయినట్టేనని గ్రహించారట జగన్. బీజేపీ జాతీయ నేతలకు లోపల ఎలా ఉన్నా… పైకి మాత్రం జగన్ వ్యతిరేకతనే చూపిస్తున్నారు. తనకు చేదోడుగా ఉండే పరిస్థితి ఇప్పట్లో బీజేపీ వైపు నుంచి అయ్యే పని కాదని అర్ధం అయ్యింది.
Read Also: Off The Record: ఆ ఎమ్మెల్యేకి కాషాయం బోర్ కొట్టిందా.. మూడు రంగులు ముద్దు వస్తున్నాయా..?
దీంతో జగన్ రూట్ మారుస్తున్నారట. రాష్ట్రంలో రాజకీయ దాడులు జరుగుతున్నాయంటూ, వాటికి నిరసనగా ఢిల్లీలో ఇటీవలే ధర్నా చేశారు జగన్. ఆ దీక్షకు కాంగ్రెస్ మినహా ఇండియా కూటమి పార్టీలన్నీ క్యూ కట్టాయి. ఇక జగన్ అటు వైపు వెళ్లడం ఖాయమని అదే రోజు అంచనాకు వచ్చారు అంతా. అయితే ఇండియా కూటమి వైపు వెళ్లడం మీద అవునని కానీ.. కాదని కానీ వైసీపీ నేతలు ఇప్పటికీ ధృవీకరించడం లేదు. వాళ్ల చర్యలు మాత్రం దాన్నే సూచిస్తున్నాయి. తాజాగా వక్ఫ్ బోర్డుల సవరణ బిల్లును బీజేపీ పార్లమెంట్ లో పెట్టింది. దీనికి వైసీపీ మద్దతు ఇవ్వలేదు సరికదా… ఆ బిల్లును వ్యతిరేకించింది. దాని మీద అసదుద్దీన్ వ్యక్తం చేసిన అభిప్రాయంతో ఏకీభవించింది వైసీపీ. గతంలో ఇలాంటి ఇరకాటంలో పడేసే సమస్యలు వచ్చినప్పుడు అవుననకుండా… కాదనకుండా… ఉండే వైసీపీ ఈసారి ఓపెన్ అయ్యింది.
Read Also: Manish Sisodia: కేజ్రీవాల్ ఇంట్లో ఉద్వేగ పరిస్థితులు.. సిసోడియాను హత్తుకున్న కుటుంబ సభ్యులు
బీజేపీ ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న వక్ఫ్ బోర్డు చట్ట సవరణకు జగన్ నో చెప్పేశారు. లోక్ సభలో వైసీపీ అవసరం లేకున్నా… రాజ్యసభలో ప్రభుత్వానికి వైసీపీ అవసరం పడుతుంది. కానీ, ఇప్పుడు అక్కడ కూడా వైసీపీ ఎర్ర జెండా చూపేందుకు రెడీ అయినట్టు తెలుస్తోంది. రాష్ట్రంలో తనను ఓడించిన కూటమికి ఏరకంగానూ సహకరించకూడదనే ఉద్దేశంతోపాటు తనకు అండగా ఉన్న ఇండియా కూటమి వైపే జగన్ మొగ్గుతున్నారట. మైనార్టీలు తనకు స్థిరమైన ఓటు బ్యాంకని నమ్ముతుంటారు జగన్. నా ఎస్సీ, నా ఎస్టీ, నా బీసీల సీరిస్ చివరల్లో నా మైనార్టీలు అని కూడా అంటుంటారు. మరి ఈ నిర్ణయం వారి కోసమే తీసుకున్నారా? అంటే… నేరుగా ఎస్ అని చెప్పలేని పరిస్థితి వైసీపీ నేతలది. మైనార్టీలంతా మాకే ఓట్లేసి ఉంటే 11 సీట్లే ఎందుకు వస్తాయి.? ముస్లింలు ఎక్కువగా ఉండే కర్నూల్, కడప, మదనపల్లి, నెల్లూరు సిటీ, రూరల్, గుంటూరు తూర్పు నియోజకవర్గాల్లో ఎందుకు ఓడిపోతాం. అని తిరిగి ప్రశ్నిస్తున్నాయి వైసీపీ వర్గాలు. అందుకే ఇదంతా పొలిటిక్ ఇంట్రెస్ట్ తో చేసేదేనని అంటున్నారట వైసీపీ నేతలు. మరి వైసీపీ ఆడుతున్న ఈ ఎఫెన్స్ గేమ్ కు బీజేపీ అధిష్టానం ఎలా రియాక్ట్ అవుతుందో… పరిణామాలు ఎలా మారతాయో చూడాలన్నది రాజకీయ వర్గాల అభిప్రాయం.