Off The Record: అటు పార్టీ… ఇటు పరిపాలన… రెండిటిని త్రాసులో తూకం వేసి మరీ… ఈసారి టైం కేటాయిస్తున్నారు ఏపీ సీఎం, టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు. అంతకు ముందు అధికారంలో ఉంటే పార్టీని పట్టించుకోరన్న విమర్శలు ఆయన మీద ఉన్నాయి. అందుకే ఈసారి మాత్రం వాటికి చెక్ పెడుతూ… బ్యాలెన్స్ చేసుకుంటున్నారు. గత అనుభవాల దృష్ట్యా ఈ విడతలో మాత్రం… ఎట్టి పరిస్థితుల్లో పార్టీ వ్యవహారాలను లైట్ తీసుకునే ప్రసక్తే లేదని ముందే చెప్పారాయన. ఇప్పుడు ఆ దిశగానే ఆయన చర్యలు ఉంటున్నట్టు చెప్పుకుంటున్నాయి టీడీపీ వర్గాలు. కనీసం వారంలో ఒకరోజు రోజు టీడీపీ కేంద్ర కార్యాలయానికి వెళ్ళడం, నేతలను కార్యకర్తలను కలవడం లాంటివి జరుగుతున్నాయి. ఈ క్రమంలో ఇక నుంచి పలు కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నట్టు తెలుస్తోంది. తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్ష పదవిని ప్రస్తుతం కేబినెట్‌లో ఉన్న ఓ బీసీ మంత్రికి ఇవ్వాలనుకుంటున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం పార్టీ జాతీయ అధ్యక్ష హోదాలో చంద్రబాబు ఉండగా… స్టేట్ పార్టీకి పల్లా శ్రీనివాస్ సారధ్యం వహిస్తున్నారు. పల్లా స్థానంలో రాష్ట్ర అధ్యక్ష పదవిని కీలకమైన బీసీ మంత్రికి ఇచ్చేలా ప్లాన్ రెడీ అవుతోందట. ఆ బీసీ మంత్రి పనితీరుపై ముఖ్యమంత్రి కొన్నాళ్ళుగా కాస్త అసంతృప్తితో ఉన్నట్టు తెలుస్తోంది. అందుకే ఆయన్ని కేబినెట్ నుంచి తప్పించి సేవల్ని పార్టీ కోసం వాడుకునేలా ప్లాన్ చేస్తున్నారట.
దశాబ్దాలుగా టీడీపీలోనే ఉండి, గతంలోనే మినిస్టర్ పదవి నిర్వహించిన సదరు నేత ఇప్పుడు కూడా కీలక మంత్రిత్వ శాఖను నిర్వహిస్తున్నారు. పైగా సామాజికవర్గం కోణాన్ని కూడా తీసుకుని ఆయన్ని కేబినెట్ నుంచి తప్పించినా… పార్టీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఇవ్వాలని భావిస్తున్నారట చంద్రబాబు. హై కమాండ్ ఆలోచన అలా ఉంది సరే… మరి అందుకు ఆయన ఒప్పుకుంటారా అన్నది ఇంకో ప్రశ్న. వన్ ఫైన్ మార్నింగ్….. మీరు రాష్ట్ర అధ్యక్ష పదవి తీసుకోవాలని పెద్దలు చెబితే, ఆయన నో అంటే పరిస్థితి ఏంటన్న చర్చలు కూడా నడుస్తున్నాయి టీడీపీ సర్కిల్స్‌లో. ఇక మంత్రివర్గంలో కూడా మార్పు చేర్పులు చేయాలని ముఖ్యమంత్రి భావిస్తున్నట్టు తెలుస్తోంది. మార్పులు తప్పవనే చర్చ ఇప్పటికే మొదలైపోయింది. ఇక ఎవర్ని దించాలి, ఎవర్ని ఉంచాలన్న అంశం మీద సీఎం సీరియస్‌గా దృష్టి పెట్టారని, ఆ దిశగా గట్టి కసరత్తే జరుగుతోందని చెప్పుకుంటున్నారు. ఇప్పటికే కొందరు మంత్రుల విషయంలో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు బాబు. కొన్ని సందర్భాల్లో బహిరంగంగానే అసహనం వ్యక్తం అవుతోంది. దీంతో క్యాబినెట్‌లో మార్పులు ఖాయమైనట్టేనంటున్నారు పరిశీలకులు. అలాగే దించుడు, ఉంచుడు విషయాల్లో ఇప్పటికే సీఎం ఒక క్లారిటీకి వచ్చారన్నది టీడీపీ వర్గాల్లో జరుగుతున్న ప్రచారం.
ప్రస్తుతం కేబినెట్‌లో ఉన్న బీసీ మంత్రికి రాష్ట్ర పార్టీ పగ్గాలు అప్పగించి ఆ పదవిలో ఉన్న పల్లా శ్రీనివాస్‌ను మంత్రివర్గంలోకి తీసుకోవచ్చన్న ప్రచారం జరుగుతోంది. అలాగే…. పితాని సత్యనారాయణ, వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి, పల్లె సింధూర రెడ్డి పేర్లు కూడా కేబినెట్ రేస్‌లో వినిపిస్తున్నాయి. వీళ్ళతో పాటు కోళ్ల లలిత కుమారి, నల్లారి కిషోర్ కుమార్ రెడ్డి, కన్నా లక్ష్మీనారాయణ, మద్దిపాటి వెంకటరాజు లాంటి పేర్ల గురించి కూడా టీడీపీ నాయకులు మాట్లాడుకుంటున్నారు. అయితే… వీళ్ళలో ఎవరెవరికి ఛాన్స్ దక్కుతుందన్నది మాత్రం ఇంకా క్లారిటీ లేదు. ప్రచారంలో ఉన్న పేర్లను చూస్తుంటే… ప్రక్షాళన భారీ స్థాయిలో ఉండవచ్చన్న మాటలు కూడా వినిపిస్తున్నాయి. సామాజిక సమీకరణలు, పనితీరు, అన్నిటినీ ప్రామాణికంగా తీసుకుని ఫైనల్ డెసిషన్ ఉంటుంది. అలాగే… ప్రస్తుతం ఉన్న మంత్రుల్లో కొంతమంది శాఖలు కూడా మారే అవకాశం ఎక్కువగా ఉంది. ఇందుకు ఎంతో సమయం తీసుకోకపోవచ్చు, ఈనెలాఖరులోనే మార్పులు చేర్పులు ఉండవచ్చని ఒక వాదన వినిపిస్తోంది. అదే సమయంలో సీఎం చంద్రబాబు సహజశైలి గురించి తెలిసిన వాళ్ళు మాత్రం మరీ అంత త్వరగా ఉండకపోవచ్చని అంటున్నారు. సరే… నాలుగు రోజులు అటు ఇటైనా….మరీ ఎక్కువ సాగదీతలు లేకుండా త్వరగానే తేల్చేస్తారని, భారీ మార్పులు అయితే ఉండబోతున్నాయన్నది టీడీపీ టాక్.