Off The Record: కాంగ్రెస్ పార్టీ ఫైర్ బ్రాండ్ లీడర్ జగ్గారెడ్డి. తెలంగాణ పాలిటిక్స్‌లో ఆయన గురించి పరిచయం అవసరం లేదు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి.. ప్రభుత్వం … పార్టీ పై వచ్చే ఆరోపణలకు ఆయనే సమాధానం చెప్పారు. మంత్రులు కూడా స్పందించని రోజుల్లో సైతం… అంతా తానై నడిపారాయన. సీఎం రేవంత్‌పై సోషల్ మీడియాతో పాటు బీఆర్‌ఎస్ లీడర్స్ ఎంతలా అటాక్ చేసినా, ఒక దశలో అసభ్యంగా మాట్లాడినా…. ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు ఎవరూ పెద్దగా స్పందించలేదు. కానీ గాంధీ భవన్ వేదికగా.. సీఎంకు మద్దతుగా గళం విప్పారు జగ్గారెడ్డి. ఆయన్ని సపోర్ట్ చేస్తూ నిలబడ్డారు. ఎన్నికలకు ముందు నాయకుల మధ్య భిన్నాభిప్రాయాలు ఉన్నా…అధికారంలోకి వచ్చాక.. ఉత్తం మీద.. భట్టి మీద ఆరోపణలు వచ్చినా గాంధీ భవన్‌లో మీడియా సమావేశాలు పెట్టి ఖండించేవారు జగ్గారెడ్డి. అలా…బీజేపీ, brs నేతల విమర్శలకు కౌంటర్ ఎటాక్ లు చేస్తూ వచ్చారు. అదంతా ఒక ఎత్తయితే….. ఈ మధ్య కాలంలో… అసలు గాంధీ భవన్ మెట్లెక్కడమే మానేశారు మాజీ ఎమ్మెల్యే. పూర్తిగా మూగనోము నోస్తున్నారు. ఇంకా చెప్పాలంటే అసలు సంగారెడ్డి దాటి రావడం లేదు. కూతురు పెళ్లి నుంచి నియోజకవర్గానికే పరిమితం అయ్యారు. అక్కడ కూడా రాజకీయాలు మాట్లాడటం మానేశారట జగ్గన్న. అవసరం ఉన్న వాళ్ళకు సాయం, పార్టీ కార్యకర్తలతో వేడుకలకు హాజరవడం లాంటి కార్యక్రమాలకే పరిమితం అవుతున్నట్టు చెప్పుకుంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో… జగ్గారెడ్డి కనిపించారంటే…. అక్కడ బోనాలో.. జాతరో జరుగుతుండాలి. లేదంటే ఆయన అస్సలు బయటికి రావడం లేదట.
Read Also: EPFO 3.0: ఏటీఎంల ద్వారా పీఎఫ్ డబ్బులు విత్‌డ్రా.. ఎప్పటి నుంచి అంటే..
సంగారెడ్డి నియోజకవర్గ అభివృద్ధి నిధుల మీద ఫోకస్ చేసినట్టు కనిపిస్తోందంటున్నారు పరిశీలకులు. ఇప్పటికే సంగారెడ్డి చెరువు.. పట్టణంలో అభివృద్ధి పనులకు నిధుల వేటలో ఉన్నారట. సీఎం రేవంత్‌తో అక్కడ భారీ సభకు ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. దసరా వేడుకలకు రాహుల్ గాంధీని రప్పించే స్కెచ్ ఏదో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. ఐతే… అలాంటి కార్యక్రమాలు ఎన్ని ఉన్నా…జగ్గన్న గాంధీ భవన్‌కి రాకుండా ఉండరని, ఇలా గ్యాప్ తీసుకోవడం వెనక వెనక.. ఏదైనా కారణం ఉండి ఉంటుందన్న అనుమానాలు వెంటాడుతున్నాయట కాంగ్రెస్ నేతల్ని. అది అలకా… అసంతృప్తా అనే వాళ్ళు కూడా లేకపోలేదు. ఐతే… జగ్గారెడ్డి రాజకీయంగా అలకలు… అసంతృప్తి తో ఉండే వ్యక్తి కాదని, అవసరం అనుకుంటే బహిరంగంగా మాట్లాడేస్తారుగానీ.. ఇలా ముసుగులో గుద్దులాట ఉండదన్నది కొందరి అభిప్రాయం. కారణం ఏదైనా… చాలా రోజుల నుంచి ఎలాంటి పొలిటికల్ స్టేట్‌మెంట్ రాకపోవడంతో అసలు ఆయనకేమైందన్న చర్చ మొదలైంది. ఆయన మాట్లాడినా చర్చలో ఉంటారు. లేక ఇలా పార్టీ యాక్టివిటీకి దూరంగా ఉన్నా ఆయన గురించే మాట్లాడుకుంటారు. మొత్తంగా ఇప్పుడు మాజీ ఎమ్మెల్యే ఇలా మౌనంగా ఉన్నారంటే… అది వ్యూహాత్మకమేనని అంచనా వేస్తున్నాయి కాంగ్రెస్ వర్గాలు.