ఉమ్మడి విశాఖజిల్లా వైసీపీకి చాలా కీలకం. రాజకీయ అవసరాల కోసమే కాదు భవిష్యత్ రాజధానిగా ఈ ప్రాంతంపై అంచనాలు ఎక్కువే. ఉత్తరాంధ్రను స్వీప్ చెయ్యడం ద్వారా తమ విధానాలకు ప్రజామోదం లభించిందనే బలమైన సంకేతాలు పంపించాలనేది అధికారపార్టీ ఆలోచన. వచ్చే ఏడాది ఎగ్జిక్యూటివ్ కేపిటల్ నుంచి పాలన ప్రారంభం అవుతుందనే టాక్ ఉంది. ఇంతటి కీలక దశలో ఉమ్మడి విశాఖ జిల్లాపై సంపూర్ణ ఆధిపత్యం సాధించడం వైసీపీకి అత్యవసరం. ఇదే విషయాన్ని పదేపదే అధిష్ఠానం చెబుతోంది. కానీ, క్షేత్రస్ధాయిలో పరిస్ధితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. నియోజకవర్గాల్లో అంతర్గత విభేదాలతో ప్రమాద ఘంటికలు మోగుతున్నాయి. కొన్ని నియోజకవర్గాల్లో అసంతృప్తి మంటలు పుట్టించగా.. చాలాచోట్ల వాతావరణం నివురుగప్పిన నిప్పులా వుంది.
Read Also:Off the Record about Narayankhed Congress: రాజీ చేసినా కలవని నేతలు.. నారాయణఖేడ్ కాంగ్రెస్‌లో రగడ
ఎస్సీ రిజర్డ్వ్ స్ధానమైన పాయకరావుపేటలో ఎమ్మెల్యే గొల్ల బాబూరావుకు ద్వితీయ నాయకత్వం కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. యలమంచిలిలో సీనియర్ ఎమ్మెల్యే కన్నబాబురాజుపై సొంతపార్టీలోనే తిరుగుబాటు మొదలైంది. “జగన్ రావాలి-ఎమ్మెల్యేపోవాలి”అనే నినాదంతో ప్లకార్డులు ప్రదర్శిస్తున్నారు. పాడేరులో ఎమ్మెల్యే, జిల్లా పార్టీ అధ్యక్షురాలు భాగ్యలక్ష్మికి అసమ్మతి సెగ గట్టిగానే తగులుతోంది. అరకులో ఆధిపత్య రాజకీయాలు నడిపేందుకు ప్రయత్నించిన ఎమ్మెల్యే ఫల్గుణకు ప్రత్యర్ధి వర్గం చెక్ పెట్టేసింది. నర్సీపట్నంలో టిక్కెట్ కోసం ముఖ్యనాయకత్వం తలపడుతోంది. సిట్టింగ్ శాసనసభ్యుడు గణేష్‌కు మరోసారి చాన్స్ లేదని విస్త్రత ప్రచారం నడుస్తోంది.
చోడవరంలో ప్రభుత్వ విప్ కరణం ధర్మశ్రీ కనిపించని శత్రువులుతో పోరాడుతున్నారు. పెందుర్తిలో గ్రూప్ రాజకీయాలు వీధికెక్కడమే కాదు పరిధిని దాటి వ్యక్తిగత విమర్శల వరకు వెళ్లిపోయాయి. దక్షిణ నియోజకవర్గంలో ఎమ్మెల్యే వాసుపల్లి, బ్రాహ్మణ కార్పోరేషన్ చైర్మన్ సుధాకర్, మత్స్యకార కార్పోరేషన్ చైర్మన్ గురువులు….ఇలా ఎవరి వర్గాలను వారు నడుపుతున్నారు. తూర్పులో వీఎంఆర్డీఏ చైర్మన్, జీవీఎంసీ మేయర్ మధ్య పంచాయితీ నలుగుతోంది. ఎమ్మెల్సీ వంశీకృష్ణ శ్రీనివాస్ ఆధిపత్యం కోసం ప్రయత్నాలు ప్రారంభించగా ఎత్తులు, పై ఎత్తులు ఊపందుకున్నాయి. వ్యవహారం ముదురు పాకానపడితే తప్ప హైకమాండ్ దగ్గరకు వెళ్లడం లేదు. వీటిని ఉపేక్షించకూడదని హైకమాండ్ కీలక చర్యలకు శ్రీకారం చుట్టింది.
జిల్లాలో గెలిచిన నియోజకవర్గాల్లో తగాదాలు ఓ ఎత్తు అయితే.. వైజాగ్ సిటీలో పట్టు దక్కని నాలుగు చోట్లా పార్టీ నేతల మధ్య గొడవలు. ఎక్కడికక్కడ కుంపట్లు రాజుకుంటున్నాయి. ఎమ్మెల్యేలు ఒంటెద్దు పోకడలకు పోతున్నారని శ్రేణులు రగిలిపోతున్నాయి. వీటన్నింటినీ సెట్ చేయడానికి వచ్చే ఏడాది మార్చి డెడ్‌లైన్‌గా పెట్టుకున్నట్టు సమాచారం. ఇప్పటికే ఈ పనిలో పార్టీ కోఆర్డినేటర్ వైవీ సుబ్బారెడ్డి ఉన్నారు. ఆయన వైసీపీ అధిష్ఠానానికి దగ్గర కావడం.. నిర్మొహమాటంగా అభిప్రాయాలను చెప్పేసే నాయకుడు కావడంతో సమస్యలు సర్దుబాటు అవుతాయని అనుకుంటున్నారట. ఇటీవల రాష్ట్రవ్యాప్తంగా అన్ని నియోజకవర్గాలకు ఎన్నికల పరిశీలకులను నియమించింది. దాంతో ఇప్పటి వరకు ఆడింది ఆట పాడింది పాటగా వుండగా.. ఇకపై కుదరదనే సంకేతాలను పంపించింది.
ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చేవారిని ఉపేక్షించేది లేదని తేల్చేయడంతో ఇప్పుడు ఎమ్మెల్యేలు, సమన్వయకర్తలు దిగివస్తున్నట్టు తెలుస్తోంది. ఇన్నాళ్లూ ఏక చత్రాధిపత్యం అనుకున్నచోట చెక్ అండ్ బ్యాలెన్స్ మెథడ్ అమలులోకి వస్తోంది. ఎన్నికల పరిశీలకులుగా వచ్చే వారు రియల్ టైమ్ సమాచారం అధినాయకత్వానికి చేరవేయడంతో.. నియోజకవర్గాల్లో దిద్దుబాటు చర్యలు మొదలైనట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆత్మీయ కలయికల పేరుతో హడావిడి చేస్తున్నారు నేతలు. మొత్తంగా కీలెరిగి వాత పెడతామనే హెచ్చరికలు వస్తే తప్ప .. మార్పులు రాలేదని పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. మరి.. ఈ ప్రయత్నాలతో విశాఖ జిల్లా వైసీపీలోని పరిస్థితులు సెట్ అవుతాయో లేదో చూడాలి.