సంగారెడ్డి జిల్లా నారాయణఖేడ్ కాంగ్రెస్ పార్టీలో వర్గవిభేదాల గురించి ఎంత తక్కువ చెప్పుకొంటే అంత మంచింది. ఇక్కడ మాజీ ఎంపీ సురేష్ షెట్కార్, పీసీసీ నేత సంజీవ్‌రెడ్డి మధ్య ఒక్క క్షణం పడటం లేదు. ఇద్దరి మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటోంది. నారాయణఖేడ్‌లో కాంగ్రెస్ టికెట్ కోసం ఇద్దరూ తీవ్రంగా పోటీ పడుతున్నారు. తండ్రుల వారసత్వంతో రాజకీయం చేస్తూ.. దానిని కొత్త పుంతలు తొక్కిస్తున్నారు. 2016లో అప్పటి ఎమ్మెల్యే కిష్టారెడ్డి చనిపోవడంతో.. ఇక్కడ కాంగ్రెస్‌లో మొదలైన జగడం ఆరని చిచ్చులా రగులుతూనే ఉంది. ఆనాటి ఉపఎన్నికలో నారాయణఖేడ్ గెలిచే సీటు అని పార్టీ భావించినా.. ఇద్దరు నేతల మధ్య ఉన్న గ్యాప్‌తో చేజారిపోయింది. తర్వాత 2018 అసెంబ్లీ ఎన్నికల్లోనూ అదే రిపీటైంది. కాంగ్రెస్ టికెట్ సురేష్ షెట్కార్‌కు ఇవ్వడంతో అలిగి బీజేపీలోకి వెళ్లారు కిష్టారెడ్డి కుమారుడు సంజీవ్‌రెడ్డి. ఆ తర్వాత సంజీవ్‌రెడ్డి కాంగ్రెస్‌లోకి రీఎంట్రీ ఇచ్చారు. మళ్లీ వర్గపోరు షురూ. పార్టీ తరఫున ఏ కార్యక్రమం చేపట్టాలన్నా ఇద్దరూ ఎడముఖం పెడముఖమే. కలిసి సాగిన సందర్భాలు లేవంటాయి పార్టీ వర్గాలు.
చివరకు రాహుల్‌గాంధీ భారత్ జోడో యాత్ర సమయంలోనూ సురేష్ షెట్కార్, సంజీవ్‌రెడ్డి మధ్య విభేదాలు ముదురుపాకాన పడటంతో మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ రాజీ చేశారు. అయినా మాట వింటేనా.. రాహుల్ పాదయాత్రలోనూ వీధి పోరాటానికి దిగారు. రాహుల్ ఎదుటే పోటాపోటీగా నినాదాలు చేసుకున్నాయి రెండు వర్గాలు. తాజాగా ధరణి సమస్యలపై నియోజకవర్గ కేంద్రాల్లో నిరసనలకు పిలుపిచ్చింది టీపీసీసీ. అందులోనూ ఎవరి కుంపటి వాళ్లదే. ఒకటే కార్యక్రమం అయినా.. వేర్వేరుగా ఆందోళనలు నిర్వహించారు. ఆర్డీవోకు వినతిపత్రాలు ఇచ్చేందుకు కూడా వేర్వేరు మార్గాలనే ఎంచుకున్నారు. ఎవరి అనుచరులను వాళ్లు తీసుకెళ్లి వినతిపత్రాలు అందజేశారు. ఒకటే నియోజకవర్గం.. ఒకటే కార్యక్రమం అయినప్పటికీ.. పార్టీ నుంచి రెండు వినతిపత్రాలు ఆర్డీవోకు ఇవ్వడం నారాయణఖేడ్ కాంగ్రెస్‌కే చెల్లింది. కాంగ్రెస్ పెద్దలు.. సన్నిహితులు చెప్పినా.. సురేష్, సంజీవ్‌రెడ్డి మధ్య వర్గపోరు సెగలు చల్లారడం లేదు. వచ్చే ఎన్నికల్లో టికెటే లక్ష్యంగా ఎత్తుగడలు వేస్తున్నారు. మరి.. అధిష్ఠానం వీరిని బుజ్జగిస్తుందా.. లేక నాన్చి నాన్చి చేతులు కాల్చుకుంటుందో చూడాలి.