Off The Record: కొన్ని రోజుల క్రితం బెజవాడ వైసీపీలో ఓ సంఘటన జరిగింది. వైసీపీ నగర అధ్యక్షుడు బొప్పన భవకుమార్ పుట్టిన రోజు వేడుకలకు వెళ్లిన మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్.. ఎమ్మెల్యే సామినేని ఉదయభానులు నువ్వెంత అంటే నువ్వెంత అనుకున్నారు. అక్కడితో ఆగకుండా.. ఉదయభాను మీదకు వెల్లంపల్లి దూసుకెళ్లారనే చర్చ కూడా అప్పట్లో నడిచింది. ఈ గొడవంతా బెజవాడ పశ్చిమ నియోజకవర్గానికి చెందిన కాంగ్రెస్ పార్టీ నేత ఆకుల శ్రీనివాస్ గురించే. ఆకుల శ్రీనివాస్ వెస్ట్ నియోజకవర్గంలో మొన్నటి వరకు వెల్లంపల్లికి వైరివర్గంగా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో తన శత్రువుగా ఉన్న ఆకుల శ్రీనివాస్‌ను వెంటపెట్టుకుని సీఎం వద్దకు ఎందుకెళ్లారని ఉదయభానుతో మాజీ మంత్రి గొడవకు దిగారని ప్రచారం జరిగింది. సీన్ కట్ చేస్తే.. అదే ఆకుల శ్రీనివాస్‌ను వెల్లంపల్లినే స్వయంగా వెంటపెట్టుకుని సీఎం వద్దకు తీసుకెళ్లి.. వైసీపీలో జాయిన్ చేయించారు. ఇది బెజవాడ రాజకీయల్లో ఆసక్తికరకమైన చర్చకు కారణమైంది. అప్పటికీ.. ఇప్పటికీ తేడా ఏంటీ..? అనేదానిపై ఆరా తీస్తున్నారట.
Read ALso: Off The Record: భూమా మౌనిక పొలిటికల్ ఎంట్రీ ఇస్తారా..? ఏ పార్టీ నుంచి పోటీ..?
2019లో వైసీపీ ఎమ్మెల్యేగా గెలిచాక వెల్లంపల్లి తన నియోజకవర్గంలోని బలమైన సామాజిక వర్గాలుగా ఉన్న మైనారిటీలకు నామినేటెడ్ పదవులు, మహిళా నేతకు మేయర్ పదవిని ఇప్పించుకుని తనకు పోటీ లేకుండా చేసుకున్నారు. వెస్ట్ సెగ్మెంట్‌లో కాపు సామాజికవర్గం కూడా చెప్పుకోదగ్గ స్థాయిలోనే ఉంది. ఆకుల శ్రీనివాస్ విషయంలో ఉదయభానుతో వెల్లంపల్లి గొడవ పడటంపై కాపు సామాజికవర్గం నేతల్లో మాజీ మంత్రిపై వ్యతిరేకత వచ్చిందట. కాపు సామాజికవర్గానికి చెందిన MLA ఉదయభానుపై వెల్లంపల్లి దూకుడుగా ఎలా వెళ్తారని మండిపడ్డారట. దాంతో వెస్ట్ సెగ్మెంట్‌లో లేనిపోని జగడాలు వస్తాయని ఆందోళన చెందారట మాజీ మంత్రి.
బెజవాడ వెస్ట్‌లో జనసేన పోటాపోటీగా కార్యక్రమాలు చేపడుతోంది. అవకాశం చిక్కితే వెల్లంపల్లిని ఎక్కడికక్కడ కార్నర్ చేస్తున్నారు ఇక్కడి జనసేన ఇంఛార్జ్ పోతిన మహేష్. జనసేనకు కాపు సామాజికవర్గం ఓట్లు ఎక్కువుగా మళ్లే అవకాశం ఉండడంతో.. ఇప్పుడు ఆ వర్గానికి చెందిన నేతతో కయ్యం వల్ల నష్టమే తప్ప లాభంలేదని వెల్లంపల్లి భావించారట. అందుకే ఆకుల శ్రీనివాస్‌ను స్వయంగా సీఎం జగన్ దగ్గరకు తీసుకెళ్లి పార్టీ కండువా కప్పించారని ప్రచారం జరుగుతోంది. ఆకుల ఎపిసోడ్‌ను అలాగే వదిలేస్తే.. ఆయనకున్న పరిచయాలతో వైసీపీలోని వేరే నియోజకవర్గ నేతల జోక్యం వెస్ట్‌లో పెరుగుతుందని ఆందోళన చెందారట. అందుకే చడీచప్పుడు లేకుండా సమస్యను పరిష్కరించుకున్నారని అనుకుంటున్నారు. మరి.. ఈ ఎత్తుగడ మాజీ మంత్రికి రాజకీయంగా ఏ మేరకు కలిసి వస్తుందో చూడాలి.