Off The Record: ఉత్తరాంధ్ర పట్టభద్రుల ఎమ్మెల్సీ సీటుకు జరిగబోయే పోటీ ఆసక్తి రేకెత్తిస్తోంది. సిట్టింగ్ సభ్యుడు పీవీఎన్ మాధవ్ పదవీ కాలం వచ్చే నెలలో ముగుస్తోంది. ఇక్కడ ఎన్నిక కోసం కేంద్ర ఎన్నికల సంఘం త్వరలో నోటిఫికేషన్ విడుదల చేయనుంది. ఇప్పటికే ఎన్నికల ప్రక్రియ ప్రారంభమై.. ఓటర్ల నమోదు జరిగింది. ఉత్తరాంధ్రలో శాసనమండలి ఎన్నికలను బలనిరూపణకు కీలకంగా భావిస్తున్నాయి ప్రధాన పార్టీలు. తొలిసారి టీడీపీ, వైసీపీ ఎక్కువ ఫోకస్ పెట్టడంతో అనేక అంచనాలు నెలకొన్నాయి. అందరికంటే ముందుగానే అభ్యర్థిని ప్రకటించింది అధికారపార్టీ వైసీపీ. ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ సీతంరాజు సుధాకర్ పేరును ప్రకటించి.. గెలిపించుకుని తీసుకొచ్చే బాధ్యత ఉత్తరాంధ్రలోని వైసీపీ ఎమ్మెల్యే భుజాలపై పెట్టింది అధిష్ఠానం. వామపక్షాల తరపున ప్రొగ్రెసివ్ డెమోక్రాటిక్ ఫ్రంట్ అభ్యర్థిగా రమాప్రభ ప్రచారం చేస్తున్నారు. బీజేపీ నుంచి మాధవ్ మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్నారు. మాధవ్ కోసం ఇప్పటికే ఏపీ బీజేపీ చీఫ్ సోము వీర్రాజు ఉత్తరాంధ్రలో పర్యటిస్తూ ప్రచారం కూడా ప్రారంభించేశారు. ప్రధాన పార్టీలు ఎమ్మెల్సీ ఎన్నికల కోసం ఈ విధంగా రేస్ మొదలుపెడితే.. టీడీపీలో ఆరంభం నుంచి తడబడుతోంది. ఇప్పుడేమో లెక్క మారింది అని చెబుతున్నారు తెలుగుదేశం పార్టీ నేతలు.
Read Also: Off The Record: ఎమ్మెల్యే వసంత తీరుపై వైసీపీలో చర్చ.. చర్యలు భిన్నం..!
భీమిలి ప్రాంతంలో ఓట్ బ్యాంక్ ఉన్న నాగవంశీయుల కులానికి చెందిన మహిళ నేత గాడు చిన్ని కుమారి లక్ష్మిని తొలుత అభ్యర్థిగా ప్రకటించింది టీడీపీ. ఎమ్మెల్యేల సహకారం లేకుండా ఈ ఎన్నికల్లో గెలవడం సాధ్యం కాదని తెలిసీ టీడీపీ తరపున పోటీకి ఎవరు ఆసక్తి ప్రదర్శించలేదు. చిన్ని కుమారి లక్ష్మి ప్రచారం చేసుకుంటున్నారు. అయితే ఆమె అభ్యర్థిత్వంపై అధిష్ఠానం మొదటి నుంచి ఆసక్తిగా లేదనే టాక్ ఉంది. పోటీకి అభ్యర్థులు దొరక్కపోతే పరువు పోతుందనే అప్పటికిప్పుడు ఆమెను ఎంపిక చేశారని మరికొందరి వాదన. మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు తనకు సన్నిహితుడైన ఓ వ్యక్తి పేరు సూచించినా.. టీడీపీలోని గంటా వ్యతిరేకవర్గం అడ్డుకుందట. ఇప్పుడు సడెన్‌గా కాపు సామాజికవర్గానికి చెందిన రిటైర్డ్ లెక్చరర్ చిరంజీవిరావును అభ్యర్థిగా తెరపైకి తీసుకొచ్చింది టీడీపీ.
Read Also: Off The Record: కొత్తపేటలో బండారు బ్రదర్స్ మధ్య సయోధ్య నిల్.. పొత్తు కుదిరితే కలిసి సాగుతారా?
అంగ, అర్ధబలం ఆధారంగా చిరంజీవిరావును టీడీపీ ఎంపిక చేసినట్టు టాక్. సుదీర్ఘకాలం ఉపాధ్యాయ వృత్తిలో ఉన్న చిరంజీవిరావుకు శిష్యులు ఎక్కువ. టీచర్ కావడంతో యూనియన్ల ఓట్లను సమీకరిస్తారనే లెక్కలూ ఉన్నాయట. అయితే బీసీలకు ఇచ్చిన అవకాశాన్ని చివరి నిమిషంలో లాగేసుకున్నారనే ప్రచారం డ్యామేజ్ చేస్తుందనే టెన్షన్ టీడీపీ వర్గాల్లో ఉందట. ముందుగా ఒకరిని క్యాండిడేట్‌గా ప్రకటించి.. ఇప్పుడు మరొకరికి అవకాశం కల్పించడం తప్పుడు సంకేతాలకు పంపే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారట. అసలు పోటీకి వెళ్లడం ఎంత వరకు సరైనదోననే మథనంలో ఉంటే ఇప్పుడు అభ్యర్థి మార్పుతో ఎటువంటి ప్రయోజనాలను ఆశించలేమని చెవులు కొరుక్కుంటున్నారట. వైసీపీ శిబిరం మాత్రం టీడీపీలో జరుగుతున్న పరిణామాలను గమనిస్తోంది. బీసీ మహిళకు అవకాశం కల్పించి.. ఇప్పుడు హ్యాండిచ్చారనే ప్రచారాన్ని జనాల్లోకి తీసుకెళ్లే యోచనలో అధికారపార్టీ నేతలు ఉన్నారట. అలాగే తాజా టీడీపీ అభ్యర్థి టీచర్ కావడంతో.. ఆ వర్గం ఓట్లు… PDF, టీడీపీ మధ్య చీలి తమకే కలిసి వస్తుందని వైసీపీ నేతలు అనుకుంటున్నారట. మొత్తంమీద ఎమ్మెల్సీ ఎన్నికలతో జరిగే లాభ నష్టాలు టీడీపీకి చిక్కులు తెచ్చినట్టే కనిపిస్తోంది. మరి.. ఈ సమస్యను ఉత్తరాంధ్ర టీడీపీ నేతలు ఎలా అధిగమిస్తారో చూడాలి.