Off The Record: నెల్లూరు జిల్లాలో ఎమ్మెల్యే కోటంరెడ్డి ఎపిసోడ్ తర్వాత వివిధ జిల్లాల్లో వైసీపీ నేతల పనితీరుపై స్థానికంగా ఎక్కడికక్కడ చర్చ జరుగుతోంది. పైకి చెప్పేదొకటి.. తెరవెనుక మరొకటి చేస్తున్న నేతల గురించి టాక్ నడుస్తోంది. ఇదే తరహాలో ఉమ్మడి కృష్ణా జిల్లాలోని ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌పై ఫోకస్ నెలకొంది. గత ఎన్నికల్లో బిగ్ షాటైన దేవినేని ఉమా మహేశ్వరరావును ఓడించడం ద్వారా అందరి దృష్టిని ఆకర్షించారు మైలవరం ఎమ్మెల్యే వసంత. ఇప్పుడు ఆయన తీరు వైసీపీ వర్గాల్లో చర్చగా మారింది. కీలక సమయాల్లో సొంత పార్టీలోని నాయకులతో సరిగా ఉండకపోవడం.. బహిరంగంగానే పార్టీని, ప్రభుత్వాన్ని ఇబ్బందిపెట్టేలా ఆయన కామెంట్స్ చేస్తున్నారు.
Read Also: Off The Record: పక్కా ప్లాన్..! రేవంత్ పాదయాత్రపై కాంగ్రెస్ పార్టీలో చర్చ
పార్టీ ఇచ్చిన కార్యక్రమాలను వసంత లైట్ తీసుకుంటున్నారట. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని మైలవరంలో అంటీ ముట్టనట్టుగానే చేపడుతున్నారనే విమర్శలు ఉన్నాయి. పార్టీ అధినాయకత్వానికి కూడా ఇదే ఫీడ్ బ్యాక్ ఉందట. అడపాదడపా పాల్గొనే కార్యక్రమాల్లో వసంత మాట్లాడే తీరును ప్రశ్నిస్తున్నారు. ఎమ్మెల్యేల వెంట ఉండేవారిని ఉద్దేశించి వసంత చేసిన వ్యాఖ్యలు.. మొత్తం పార్టీని.. తోటి నాయకులను ఇరుకున పెట్టింది. ప్రత్యర్థి పార్టీల కార్యకర్తలు.. నేతల మీద అన్యాయంగా కేసులు పెట్టే సంస్కృతి తనది కాదని చెప్పడం ద్వారా మరో చర్చకు ఆస్కారం ఇచ్చారు. ఇది చాలదన్నట్టు గుంటూరులో చీరల పంపిణీలో తొక్కిసలాటకు కారణమైన NRI ఉయ్యూరు శ్రీనివాస్‌ను వెనకేసుకొచ్చారు. శ్రీనివాస్‌కు క్లీన్‌చిట్ ఇవ్వడమే కాకుండా.. టీడీపీలో ఉన్నందునే కేసులు పెట్టారని కామెంట్ చేసి తెలుగుదేశం పార్టీ వాదనను ఆయన సమర్థించినట్టు అయ్యింది. వైసీపీ అధిష్ఠానం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందనే అర్థం వచ్చేలా వసంత మాటలు ఉన్నాయనే అభిప్రాయం వ్యక్తమైంది.
ఓ పక్క అధికారపార్టీ నేతలను ఇరుకున పెడుతూనే.. మరోవైపు తాను సీఎం జగనుకు అత్యంత విశ్వాసపాత్రుడిగా ఉన్నానని.. ఎట్టి పరిస్థితుల్లోనూ వైసీపీని వీడి వెళ్లేదే లేదని చెబుతున్నారు వసంత. సీఎం జగన్‌కు తాను రుణపడి ఉంటానంటూ సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. దీంతో నోటితో మెచ్చుకుంటూ నొసటితో విమర్శించడమంటే ఇదేనని వైసీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. తనకు 2024లో సీటు రాబోదనే భావనలో వసంత ఉన్నారనేది మరికొందరి వాదన. కీలక సందర్భాల్లో మంత్రి జోగి రమేష్ లాంటి నాయకులను ప్రత్యక్షంగానే టార్గెట్ చేస్తున్నారు. ఇదే సందర్భంలో మరో చర్చా ఉంది. తన బంధువుల అవినీతి బయటకు రాకుండా చేసే ఎత్తుగడగా మరికొందరి అభిప్రాయం. వసంత బంధువుల అవినీతిని వైసీపీ అధినాయకత్వం ప్రశ్నించినందుకే ఎమ్మెల్యే ఇలా వ్యవహరిస్తున్నారనే చర్చ ఉంది. వైసీపీ అధిష్ఠానానికి వీర విధేయులమని ఫోజు కొడుతూ.. తాము నిఖార్సుగా ఉన్నా.. హైకమాండ్ తమను ఇబ్బంది పెడుతోందని.. తమకు వ్యతిరేకంగా అసమ్మతిని రాజేస్తుందని చెప్పుకొనే విధానాన్ని ఇటీవల చాలామంది ఎంచుకుంటున్నారు. వసంత కూడా ఆ కోటాలోకే వస్తారని అనుకుంటున్నారట.