Off The Record: ఆంధ్రప్రదేశ్‌లో ఇప్పుడు వెన్నుపోటు పొలిటికల్ సీజన్ జోరుగా నడుస్తోంది. ఎవరు ఎవరిని పొడిచారు, అసలు పొడిచారా? లేదా అన్న వాదనల్ని కాసేపు పక్కనపెడితే… అందరి నోట అదే మాట మాత్రం వినిపిస్తోంది. కూటమి ప్రభుత్వానికి ఏడాది పూర్తయిన సందర్భంగా వైసీపీ వెన్నుపోటు దినం ప్రోగ్రామ్ నిర్వహిస్తే… అంతకంటే ముందే… ఆ పార్టీ నాయకుడు, రాప్తాడు మాజీ ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి చేసిన వెన్నుపోటు కామెంట్స్ కలకలం రేపుతున్నాయి. వైసీపీలోనే వెన్నుపోటుదారులు ఉన్నారని ప్రకటించి సంచలనానికి తెరలేపారాయన. తమ పార్టీలో ఉంటూ…. తెర వెనక తెలుగుదేశంతో చేతులు కలిపి పనులు చేసుకుంటున్నారని, సొంత పార్టీని డ్యామేజ్ చేస్తున్న అలాంటి వారిని వదలబోమంటూ వార్నింగ్ ఇచ్చారాయన. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడేవారి విషయంలో కఠినంగా ఉంటామని తేల్చి చెప్పేశారు తోపుదుర్తి. పార్టీ క్రమశిక్షణ కమిటీ సభ్యుడి హోదాలో ఈ వ్యాఖ్యలు చేశారట మాజీ ఎమ్మెల్యే. ఇటీవల జరిగిన కమిటీ తొలి సమావేశంలో కొన్ని తీర్మానాలు చేసుకుని విధివిధానాలు రూపొందించుకున్నారట.
Read Also: Stampede: 6 చోట్ల తొక్కిసలాట.. 175 మంది మృతి..
ఇతర పార్టీలతో లోపాయికారి ఒప్పందాలు చేసుకుని వైసీపీని దెబ్బతీయాలనుకుంటున్న వారిలో మార్పు రావాలని, టైం ఇచ్చినా… చెప్పి చూసినా పద్ధతి మార్చుకోని వారి విషయంలో మాత్రం కఠిన చర్యలు ఉంటాయని అన్నారు తోపుదుర్తి. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్న 125 మందిపై చర్యలు తీసుకోగా…. ఇందులో తన సొంత నియోజకవర్గానికి చెందిన ఐదుగురు ఉన్నారని చెప్పారు మాజీ ఎమ్మెల్యే. వాళ్ళు మారకుండా…అదే పంథాను కొనసాగిస్తుంటే మాత్రం చర్యలు కఠినంగా ఉంటాయన్నారు. వారిని సమర్థించే నాయకుల మీద కూడా చర్యలుంటాయన్నారు తోపుదుర్తి. రాప్తాడు నియోజకవర్గంలో భూమిరెడ్డి మహానంద రెడ్డి, పూలకుంట శివారెడ్డి, కుంటిమద్ది రమేష్, నసనకోట ముత్యాలు, బోయ రాజారాం లాంటి కీలక నేతలపై వేటేసింది పార్టీ. గత ఎన్నికల్లో టీడీపీ నేతలతో చేతులు కలిపి తన ఓటమికి కారణమయ్యారని తోపుదుర్తి ఆధారాలతో సహా పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు చేయడంతో…. వాళ్ళ మీద వేటు పడింది.
Read Also: Vivo T4 Ultra 5G: ప్రీమియం ఫీచర్లతో మళ్లీ రంగంలోకి వివో.. లాంచ్ కు ముహూర్తం ఖరారు..!
అంతే కాకుండా తన ఓటమికోసం గతంలో ఇద్దరు నేతలు బలంగా పని చేశారని.. సస్పెండ్ అయిన వారంతా వారితో సన్నిహితంగా మెలిగిన వారేనని చెబుతున్నారాయన. ప్రస్తుతం ప్రకాష్ రెడ్డి ఇచ్చిన వార్నింగ్ ఆ కీలక నేతలకేనన్న టాక్ నడుస్తోంది. ప్రస్తుతం సస్పెండ్ అయిన ఇద్దరిలో మార్పు వచ్చిందని.. అందుకే వారిని తిరిగి పార్టీలోకి తీసుకునేందుకు అధిష్టానానికి లేఖ సమర్పించినట్టు చెప్పారు. కానీ మిగిలిన వారు మాత్రం తమ పద్దతి మార్చుకోకుండా ఇంకా పార్టీలో ఉంటూ టీడీపీతో చేతులు కలిపి ద్రోహం చేస్తున్నారని మండిపడుతున్నారు . అలాంటి వారు శాశ్వతంగా పార్టీ నుంచి దూరం అవుతారని..వాళ్ళని ఎంకరేజ్ చేస్తున్న కీలక నేతలపై కూడా చర్యలు తప్పవంటున్నారు తోపుదుర్తి. మొత్తంగా వెన్నుపోటు పాలిటిక్స్ వైసీపీని కూడా షేక్ చేస్తున్నాయంటున్నారు ఆ పార్టీ ముఖ్యనేతలు.