Off The Record: తెలంగాణలో బలపడాలనేది బీజేపీ ఆలోచన. తద్వారా ఎన్నికల్లో గెలిచి అధికారం చేపట్టాలని ఆశిస్తున్నారు. చేరికలను ప్రోత్సహించేందుకు ప్రత్యేక కమిటీని వేశారు. కానీ.. చేరికల విషయంలో కమలనాథులు ఆశించినట్టుగా అడుగులు పడటం లేదు. గతంలో చేరిన వాళ్లే కొందరు బీజేపీని వీడి వెళ్లిపోయారు. కొత్తగా ఎవరైనా వస్తానంటే వాళ్లను అడ్డుకునే పరిస్థితి ఉండటంతో కేడర్ విస్మయం చెందుతోంది. ఇటీవల కాంగ్రెస్ సీనియర్ నేత సోదరుడు బీజేపీలో చేరాలని అనుకుంటే.. ఆఖరి నిమిషంలో ఆయన చేరికను ఓ మాజీ మంత్రి అడ్డుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. బీజేపీలో చేరాలని అనుకున్న ఆ నాయకుడు ఎవరో కాదు. కాంగ్రెస్ నేత, మాజీ డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ తమ్ముడు రామచంద్ర. కాంగ్రెస్‌ను వీడి కాషాయ కండువా కప్పుకోవాలని అనుకున్నారు. అందుకోసం ఏర్పాట్లు కూడా చేసుకున్నారు. జనవరి 26నే ముహూర్తం ఫిక్స్ అయ్యింది కూడా. తన సన్నిహితులు.. అనుచరులతో కలిసి బీజేపీ ఆఫీసుకు చేరుకున్నారు రామచంద్ర. ఆ రోజు బండి సంజయ్ అందుబాటులో లేకపోవడంతో మరుసటి రోజు కాషాయ కండువా కప్పుకోవాలని ఆయన అనుకున్నారట. కానీ సంజయ్ రాలేదు. దీంతో బీజేపీ ఆఫీసులో కొందరు నేతలను కలిసి రామచందర్ వెళ్లిపోయినట్టు చెబుతున్నారు.
Read Also: Off The Record: వైసీపీలో హాట్ హాట్‌గా కడప అసెంబ్లీ టికెట్.. టికెట్‌కు ఫుల్ డిమాండ్ ?
రామచందర్‌ను బీజేపీలో చేరకుండా ఓ మాజీ మంత్రి అడ్డుకున్నట్టు పార్టీలో చెవులు కొరుక్కుంటున్నారు. ఆ మాజీ మంత్రి అభ్యంతరం తెలియజేయడం వల్లే చేర్చుకోలేదని టాక్ నడుస్తోంది. వచ్చే ఎన్నికల్లో నియోజకవర్గంలో తనకు టికెట్ విషయంలో రామచందర్ పోటీకి వస్తారనే సందేహంతోనే మాజీ మంత్రి అడ్డుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే నియోజకవర్గంలో మాజీ జడ్పీ ఛైర్మన్‌కు ఆ మాజీ మంత్రితో పడటం లేదు. ఇప్పుడు రామచందర్ కూడా మరో పవర్ సెంటర్‌గా మారితే రాజకీయ భవిష్యత్‌కు ఇబ్బందులు వస్తాయని ఆయన అనుకున్నట్టు సమాచారం. ఈ ఎపిసోడ్‌లో మరో ట్విస్ట్ ఉందట. ఆ మాజీ మంత్రి ఆందోళన చెందుతున్నట్టు రామచందర్ ఆయన నియోజకవర్గంపై కన్నేయలేదట. మరో నియోజకవర్గాన్ని రామచందర్ ఎంచుకున్నట్టు బీజేపీ వర్గాలు చెబుతున్నాయి. తాను మాజీ మంత్రి నియోజకవర్గంలో పోటీ చేయబోనని.. అదే విషయాన్ని ఓ అగ్రిమెంట్ కూడా రాసి ఇచ్చేందుకు రామచందర్ సిద్ధమైనట్టు తెలుస్తోంది. ఈ అంశంపై ఢిల్లీ పెద్దలతోనూ.. అభ్యంతరాలు వ్యక్తం చేసిన మాజీ మంత్రితోనూ చెప్పి.. బీజేపీలో చేరికకు మరో ముహూర్తాన్ని ఫిక్స్ చేసుకుందామని.. గ్రాండ్ వెల్కమ్ ఉంటుందని రామచందర్‌ను ఊరడించారట కమలనాథులు.