Off The Record: గాలిలో కాకుండా గ్రౌండ్‌లో ఉండి పనిచేయాలని తెలంగాణ బీజేపీ నేతలకు దిశానిర్దేశం చేస్తున్నారు ఢిల్లీ పార్టీ పెద్దలు. కేవలం చెప్పి వదిలేయడమే కాకుండా ఏం చేయాలో.. ఏమేమి చేయాలో పూసగుచ్చినట్టు వెల్లడిస్తున్నారట. క్షేత్రస్థాయిలో పార్టీ నాయకులు ఏం చేస్తున్నారో తెలుసుకోవడానికి కొన్ని షరతులు పెట్టడంతో వాటిపైనే పార్టీ వర్గాల్లో చర్చ సాగుతోంది. గ్రౌండ్ లెవల్ రియాలిటీని వెంటనే తెలుసుకోవడం కోసం.. ఎప్పటికప్పుడు విశ్లేషించడానికి ఒక యాప్‌ను సిద్ధం చేసింది బీజేపీ. పార్టీ నేతలంతా ఆ యాప్‌ను విధిగా సెల్‌ఫోన్లలో డౌన్‌లోడ్ చేసుకోవాలట. ఈ యాప్ ఆపరేషన్ యాక్సెస్ ఉన్నవారు తమ పరిధిలో జరిగిన కార్యక్రమాల వివరాలు అందులో వెల్లడించడంతోపాటు.. వాటికి సంబంధించిన ఫొటోలు అప్‌లోడ్ చేయాలని ఆదేశించారట.
Read Also: Off The Record: కోటంరెడ్డి ఎపిసోడ్‌లో తెలుగు తమ్ముళ్లు ఎందుకు సైలెంట్..?
తమ నియోజకవర్గాల పరిధిలో పార్టీ ఆదేశించిన కార్యక్రమాలు భారీగా చేశామని.. జనం కూడా పెద్ద సంఖ్యలో హాజరయ్యేవారని లోకల్ లీడర్స్ సమావేశాల్లో చెప్పేవారు. ఇకపై చెబితే వినబోరట. అంతా యాప్‌లోనే చూస్తారట పార్టీ పెద్దలు. జరిగిన కార్యక్రమం ఫొటోనే నేతల పనితీరుకు గీటురాయిగా చెబుతున్నారు. ఇటీవల ప్రధాని మోడీ మన్‌కీ బాత్ కార్యక్రమం రాష్ట్రంలో ఎక్కడెక్కడ జరిగింది? ఎవరెవరు పాల్గొన్నారో ఇదే విధంగా ఫొటోలు తీసి యాప్‌లో అప్‌లోడ్ చేశారట. త్వరలో జరగబోయే కార్నర్ మీటింగ్స్‌ను కూడా ఇదే విధంగా పంపాలని చెప్పారట. ఇందుకోసమే నియోజకవర్గాల స్థాయిలో సోషల్ మీడియా ఇంఛార్జులను బీజేపీ నియమించింది. వీరికి త్వరలో వర్క్‌షాప్ పెడతారట.
Read Also: Off The Record: కాంగ్రెస్ పార్టీలో వాళ్ళిద్దరి మధ్య ఆధిపత్యపోరు పీక్స్‌కు..?
యాప్ తీసుకురావడం.. ఫొటోలు అప్‌లోడ్ చేయడం వరకు బాగానే ఉన్నా.. నాయకుల పనితీరును ఫొటోల ఆధారంగా విశ్లేషిస్తామని చెప్పడమే కాషాయ శిబిరంలో అలజడి రేపుతోంది. కేవలం ఫొటోల కోసమే పనిచేసేవారు తయారవుతాయని.. ప్రజలకు దగ్గరయ్యే నేతలు ఎంత మంది ఈ విధంగా చేయగలరని ప్రశ్నిస్తున్నారట. ఫొటోలు తీసి అప్‌లోడ్ చేయకపోతే నాయకులు కాదా.. వారు పనిచేసినట్టు కాదా అని మరికొందరు నిలదీస్తున్నారట. బీజేపీ బలపడాలని అందరికీ ఉన్నా.. ఈ పితలాటకం ఏంటని ప్రశ్నిస్తున్నారట కొందరు. ఇతర పార్టీల నుంచి అనేక మందిని ఆహ్వానించాలని చూస్తున్న తరుణంలో ఫొటోలు అప్‌లోడ్ చేయాలని షరతులు పెడితే.. అసలు ఉద్దేశం పక్కదారి పట్టే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారట కమలనాథులు. ఒకప్పుడు మీడియాలో పేరు, ఫొటోలు వచ్చేందుకే ప్రెస్‌మీట్లు పెట్టేవారని కొందరు నాయకులపై ఆరోపణలు ఉండేవి. ఆ ప్రెస్‌మీట్ ముగిసిన తర్వాత సదరు నాయకులు చాన్నాళ్లు మళ్లీ కనిపించేవారు కాదు. ఇప్పుడు కూడా అలాగే చేస్తే.. యాప్‌లో అడ్మిన్ పవర్ ఉన్నవారితో మిలాఖత్ అయితే పైవాళ్లకు వాస్తవాలు కాకుండా తప్పుడు సమాచారం వెళ్లే ప్రమాదం ఉందని ఆందోళన చెందుతున్నారట. టెక్నాలజీ మంచిదే అయినా.. అందులో వచ్చిందే గీటురాయి అంటే ఎలా అని కలవర పడుతున్నారట నేతలు.