Off The Record: ఉమ్మడి చిత్తూరు జిల్లా సత్యవేడు అసెంబ్లీ నియోజకవర్గంలో పైకి కనిపించనిది ఏదేదో జరిగిపోతోందా? గ్రూప్‌వార్ లిటరల్‌గా తెలుగుదేశం పార్టీ పరువును రోడ్డుకీడుస్తోందా? అంటే.. ఎస్….పరిణామ క్రమం అలాగే కనిపిస్తోందని అంటున్నారు పొలిటికల్ పరిశీలకులు. సీనియర్ దళిత నేతగా పేరున్న కోనేటి ఆదిమూలంను ఏరికోరి పార్టీలోకి రప్పించుకుని అసెంబ్లీ ఎన్నికల్లో సత్యవేడు టిక్కెట్ ఇచ్చింది అధిష్టానం. ఆయన కూడా పార్టీ ఆశించినట్టుగానే…నాడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో గట్టిగానే ఫైట్ చేశారన్నది లోకల్ టాక్. కానీ… సొంత పార్టీలోనే… కొందరికి ఆదిమూలంకు టిక్కెట్ ఇవ్వడం నచ్చలేదని, వాళ్ళు వైసీపీతో కలిసి ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా కుట్రలు చేస్తున్నారన్న ప్రచారం కలకలం రేపుతోంది. 2019 ఎన్నికల్లో వైసీపీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు ఆదిమూలం. అప్పట్లో పేరుకే ఆయన ఎమ్మెల్యే అని, పెత్తనమంతా పెద్దిరెడ్డి వర్గానిదేనన్న ఆరోపణలు వచ్చాయి. అప్పట్లో నియోజకవర్గంలో మట్టి, ఇసుక, మద్యం దందాలన్నీ పెద్దిరెడ్డి మనుషుల కనుసన్ననల్లోనే జరిగేవన్న టాక్ ఉంది. కానీ… 2024 అసెంబ్లీ ఎన్నికలకు మూడు నెలల ముందు ఆదిమూలం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దగ్గరకు వెళ్ళి ఎన్నికలయ్యేదాకా నియోజకవర్గంలో దందాలను ఆపాలని అడిగారట. అందుకు పెద్దిరెడ్డి ఫైరైపోవడంతో పాటు…
ఆదిమూలంతో గ్యాప్ వచ్చిందని చెప్పుకుంటారు.
ఆదిమూలంకు అప్పట్లో ఎమ్మెల్యే కాకుండా ఎంపీ టిక్కెట్ ఇవ్వడానికి అదే ప్రధాన కారణం అన్న ప్రచారం ఉంది స్థానికంగా. ఆక్రమంలోనే ఆయన వైసీపీ నుంచి బయటికి వచ్చి పెద్దిరెడ్డి మీద తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు. తర్వాత టీడీపీలో చేరడం ఎమ్మెల్యే టిక్కెట్ ఇవ్వడం చకచకా జరిగిపోయాయి. అయితే.. ఆయన్ని ఓడించడానికి వైసీపీ గట్టిగానే ప్రయత్నించిందట. ప్రధానంగా సత్యవేడు టీడీపీ ఓట్లు చీల్చడానికి కొత్త కొత్త అభ్యర్థుల్ని బరిలో దింపి నానా ప్రయోగాలు చేశారు. అందుకు టిక్కెట్ రాలేదన్న అసంతృప్తితో ఉన్న కొందరు తెలుగుదేశం నాయకులు కూడా సహకరించారన్న ఆరోపణలున్నాయి. అలా ఎవరెన్ని ప్రయత్నాలు చేసినా… కూటమి వేవ్‌లో అవేమీ పనిచేయలేదు. టీడీపీ ఎమ్మెల్యేగా గెలిచారు కోనేటి ఆదిమూలం. ఇక ఎన్నికల తర్వాత అసలాట మొదలుపెట్టారట ఆయన వ్యతిరేకులు. నాడు ఇండిపెండెంట్‌గా పోటీ చేసి క్యాస్ట్ బేస్‌లో టీడీపీ ఓట్లు చీల్చడానికి ప్రయత్నించిన ఓ నాయకుడు స్థానిక వైసీపీ నేతలతో కుమ్మక్కై ఎమ్మెల్యే టార్గెట్‌గా పావులు కదిపారని ఆరోపిస్తున్నారు ఆదిమూలం అనుచరులు. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనమైన లైంగిక వేధింపుల ఎపిసోడ్ కూడా ఆ టీమ్ కుట్రలో భాగమేనన్నది ఎమ్మెల్యే అనుచరుల వాదన. మేటర్ కోర్ట్‌దాకా వెళ్ళి ఎమ్మెల్యేకు ఊరట దక్కింది.
కానీ… ఆయనకు ఇంకో 50 మందితో సంబంధాలు ఉన్నాయంటూ తాజాగా బయటికి వచ్చిన లేఖ కలకలం రేపుతోంది. ఇది కూడా ఆ గ్యాంగ్ పనే అన్నది ఆదిమూలం వర్గం ఆరోపణ. ఈ పరిస్థితుల్లో ఎమ్మెల్యేనే స్వయంగా కార్యకర్తల సమావేశం పెట్టి ఇలాంటి ప్రచారాల వెనుక ఉన్నదెవరో చెప్పే ప్రయత్నం చేశారట. 50 ఏళ్ల రాజకీయ జీవితంలో నిజాయితీగా బతికానని, ఒక ఇన్చార్జి పదవి కోసం నా మీద ఎన్ని అభాండాలు వేస్తున్నారోనంటూ…ఆవేదన వ్యక్తం చేసినట్టు సమాచారం. ఈ ప్రచారం, ప్రయత్నాల వెనక నాడు ఇండిపెండెంట్‌గా పోటీ చేసి దెబ్బకొట్టే ప్రయత్నం చేసిన నాయకుడే ఉన్నట్టు మాట్లాడుకుంటున్నాయి టీడీపీ వర్గాలు. దీనికితోడు మా దగ్గరా కొన్ని వీడియోలున్నాయంటూ ఎవడు పడితే వాడు ఎమ్మెల్యేకి ఫోన్ చేసి మానసిక యుద్ధం చేయడం వెనక ఎవరున్నారన్న ఆరాలు తీస్తున్నారట. మేటర్‌ని ఎమ్మెల్యే టీడీపీ పెద్దల దృష్టికి తీసుకువెళ్ళినట్టు సమాచారం. సదరు ఇండిపెండెంట్ లీడర్‌కి కొందరు స్థానిక టీడీపీ నాయకులు కూడా సహకరిస్తున్నారన్న సమాచారంతో నియోజకవర్గ సమన్వయకర్త గంగా ప్రసాద్ సైతం సీరియస్ అయినట్టు తెలిసింది.
మొత్తం మీద… ఇదంతా… ఎమ్మెల్యే టార్గెట్‌గా వైసీపీ పెద్దలు చేస్తున్న కుట్రగానే నమ్ముతున్నారట సత్యవేడు తమ్ముళ్ళు. అధిష్టానం వెంటనే జోక్యం చేసుకుని, సదరు ఇండిపెండెంట్ నేతను, ఆయనకు సహకరిస్తున్న కొందరు టీడీపీ లీడర్స్‌ని కట్టడి చేయకుంటే…పార్టీకే నష్టం అని హెచ్చరిస్తున్నారు. ఎన్నికలకు ముందు నుంచి పెద్దిరెడ్డి మీద దూకుడుగా ఉన్న ఎమ్మెల్యే ఆదిమూలం…. తాజా పరిణామాలతో వెనక్కి తగ్గాల్సివచ్చిందని, అందుకు కారణం ఇండిపెండెంట్‌గా చలామణి అవుతున్న మాజీ టీడీపీ లీడర్‌తో పాటు పార్టీలో ఉన్న మరికొందరన్నది కార్యకర్తల అభిప్రాయంగా తెలుస్తోంది. పార్టీ అధిష్టానం వెంటనే జోక్యం చేసుకోకుంటే… సత్యవేడులో టీడీపీకి గట్టి డ్యామేజ్ అవుతుందన్నది వాళ్ళ అభిప్రాయం.