Off The Record: విజయనగరం జిల్లా శృంగవరపు కోట రాజకీయం సలసలకాగుతోందట. ఇక్కడ.. ఎవరు సొంతోళ్ళో… ఎవరు ప్రత్యర్థులో కూడా అర్ధంకానంత గందరగోళం పెరిగిందని అంటున్నారు. ప్రస్తుతం పైకి మాత్రం ఎమ్మెల్యే కోళ్ళ లలిత కుమారి వర్సెస్ ఎమ్మెల్సీ రఘురాజుగా నడుస్తోంది వ్యవహారం. ఎమ్మెల్యేది టీడీపీ, ఎమ్మెల్సీది వైసీపీ కావడంతో… ఆ రాజకీయ వైరం సహజమేననుకున్నారు. కానీ… టీడీపీలోని ఓ వర్గం ఎమ్మెల్సీలో చేతులు కలిపిందన్న సమాచారం కలకలం రేపుతోంది నియోజకవర్గంలో. వైసీపీ ఎమ్మెల్సీ రఘురాజు భార్య ఇందుకూరి సుబ్బలక్ష్మి టీడీపీలో చేరడం ఇక్కడ ఇంకా ఆసక్తికరమైన పరిణామం. అయితే… కొన్ని ప్రత్యేక కారణాలతో… ఎమ్మెల్సీ ప్రస్తుతం వైసీపీకి దూరంగా ఉంటున్నారని, అందుకే ఆయన భార్య టీడీపీలో చేరికకు అభ్యంతరాలు పెట్టి ఉండకపోవచ్చన్న మరో చర్చ నడుస్తోంది ఎస్ కోటలో. అసలు ఎమ్మెల్యేగా గెలిచాక లలితకుమారికి ఇందుకూరి ఫ్యామిలీతో వైరం మొదలైందట. నియోజకవర్గం మొత్తం ఒక ఎత్తయితే… శృంగవరపుకోట మండలం మీద పట్టు కోసం… ప్రయత్నించే క్రమంలో ఇద్దరికి విభేదాలు పెరిగినట్టు చెప్పుకుంటున్నారు. ఆ గొడవ అలా నడుస్తున్న క్రమంలోనే… టీడీపీలోని ఎమ్మెల్యే వ్యతిరేక వర్గం ఎమ్మెల్సీతో చేతులు కలిపిందన్న వార్తలు మొదలయ్యాయి.
Read Also: Off The Record: రగిలిపోతున్న ఆ సీనియర్స్ ఎవరు.. వాళ్లకు జరిగిన అవమానం ఏంటి.?
నియోజకవర్గ టీడీపీ నాయకుడు గొంప కృష్ణతో ఎమ్మెల్సీ ఇందుకూరి ఫ్యామిలీ చేతులు కలిపిందన్నది పొలిటికల్ హాట్ అయింది. ఇద్దరూ కలిసి ఇప్పుడు ఎమ్మెల్యే వ్యవహారాలపై నిఘా పెడుతున్నారట. ఎమ్మెల్యే మనుషులు ఓ చెరువును పూడ్చిసిమెంట్ ఫ్యాక్టరీ దారి ఇచ్చినట్టు వీళ్ల దృష్టికి వచ్చిందట. దీంతో గొంప, ఇందుకూరి కలిసే గ్రామస్తులను అడ్డంపెట్టి ఆందోళనలు చేయించినట్టు చెప్పుకుంటున్నారు. మేటర్ ముదరడంతో చివరికి పార్టీ టీడీపీ పెద్ద ఒకరు జోక్యం చేసుకుని ఎమ్మెల్యేకి చీవాట్లు పెట్టినట్టు తెలిసింది. ఇదే విషయాన్ని సన్నిహితులతో చెప్పి…వాళ్ళిద్దరూ కలిసి నా పరువు తీశారంటూ బాధపడ్డారట శాసనసభ్యురాలు. మరోవైపు ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే మధ్య విభేదాలు జిందాల్ భూ వ్యవహారంలో మరో మారు బయటపడ్డట్టు తెలిసింది. లలిత కుమారి ఎంఎస్ఎంఈలకు ఓకే అంటూనే స్థానిక అభ్యంతరాలకు మద్దతుగా నిలిచారని, రఘురాజు మాత్రం రైతులకు అనుకూలంగా మాట్లాడుతు ఎమ్మెల్యే పై ఒత్తిడి పెంచుతున్నారని నియోజకవర్గంలో చర్చ నడుస్తోంది. ఇలా… వివిధ కోణాల్లో శృంగవరపుకోట రాజకీయాలు వైకుంఠపాళిని తలపిస్తున్నాయన్నది లోకల్ టాక్. స్థానిక సంస్థల ఎన్నికల సమయం దగ్గరపడుతున్న టైంలో వీళ్ల వర్గపోరు పార్టీని ఎక్కడ ముంచుతుందోనని టీడీపీ కేడర్ ఆందోళనపడుతోంది.