Off The Record: పరిస్థితుల్ని బట్టి ఓడలు బళ్ళు….బళ్ళు ఓడలు కామన్. రాజకీయాల్లో అయితే…. దాని గురించి ప్రత్యేకంగా మాట్లాడుకునే పనేలేదు. సరిగ్గా ఇప్పుడు అదే స్ధితిని అనుభవిస్తున్నారట ఉమ్మడి విశాఖ జిల్లాలోని ఇద్దరు సీనియర్ ఎమ్మెల్యేలు. శాసనసభ్యులుగా గెలిచి ఏడాది పూర్తయిందన్న మాటేగానీ… సెల్ఫ్ శాటిశ్ఫాక్షన్ ఏ మాత్రం లేదట. 15 అసెంబ్లీ నియోజకవర్గాలున్న ఉమ్మడి జిల్లాలో అరకు, పాడేరు మినహా మిగిలిన సీట్లన్నిటినీ కూటమి పార్టీలు ఏకపక్షంగా గెలుచుకున్నాయి. గాజువాక, భీమిలి సెగ్మెంట్స్‌లో మెజార్టీలు రికార్డులు బద్దలు కొట్టేశాయి. ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ అత్తెసరు మార్కులతో గెలిచిన సీట్లలోనూ ఈసారి ఓటు పోటెత్తింది. పార్టీ పరంగా అంత కంఫర్ట్‌గా ఉన్నప్పటికీ… సీనియర్స్‌కు మాత్రం చింతనిప్పుల మీద కూర్చున్నట్టుగా ఉందని చెప్పుకుంటున్నారు. దీనికి ప్రధాన కారణం పార్టీ, ప్రభుత్వంలో జూనియర్స్‌కు ప్రాధాన్యత పెరిగిపోవడం, కొన్ని చోట్ల షాడోలు పెత్తనాలు చేయడమేనని మాట్లాడుకుంటున్నాయి రాజకీయ వర్గాలు.
Read Also: PM Modi: జూలై 2 నుంచి 9 వరకు ప్రధాని మోడీ 5 దేశాల పర్యటన..
జనసేన గెలుచుకున్న విశాఖ దక్షిణం, యలమంచిలి ఎమ్మెల్యేలు తప్ప మిగతా వాళ్ళంతా సీనియర్సే. రెండు నుంచి ఐదు సార్లు గెలిచిన అనుభవం ఉన్నవాళ్ళే. దీంతో… వాళ్ళంతా గుర్తింపు కోరుకుంటున్నా…అంతర్గత రాజకీయాల కారణంగా అది సాధ్యం కావడం లేదంటున్నారు. మరీ ముఖ్యంగా ఇద్దరు సీనియర్స్‌లో ఇటీవల ఆ ఆక్రోశం ఎక్కువైనట్టు ప్రచారం జరుగుతోంది. మాడుగుల, అనకాపల్లి ఎమ్మెల్యేలు బండారు సత్యనారాయణ మూర్తి, కొణతాల రామకృష్ణకు మంత్రులుగా పని చేసిన అనుభవం వుంది. ఒకప్పుడు ఉమ్మడి జిల్లా రాజకీయాలను నడిపించిన సత్తా వీళ్ళ సొంతం. అప్పట్లో ప్రోటోకాల్ ఠీవీని ప్రదర్శించిన సీనియర్ నేతలకు ప్రస్తుత పరిణామాలు ఏమాత్రం మింగుడుపడటం లేదట. ఇప్పటికే అంతర్గత రాజకీయాలతో ఇబ్బందిపడుతుంటే… ఇప్పుడు అధికారిక గౌరవం కూడా ఇవ్వకపోతే ఎలాగంటూ సీనియర్స్ చురచురలాడుతున్నట్టు తెలిసింది. ఇటీవల విశాఖలో ప్రతిష్టాత్మకంగా జరిగిన ఇంటర్నేషనల్ యోగాడే వీళ్ళ ఫైర్‌కు మరింత పెట్రోల్ పోసినట్టు చెప్పుకుంటున్నారు. ప్రధాని నరేంద్ర మోదీ సమక్షంలో సుమారు మూడు లక్షల మంది ఏకకాలంలో యోగా చేసి గిన్నిస్ రికార్డ్ సాధించారు. ఆ విషయంలో విమర్శల మాట ఎలాఉన్నా… ఇలాంటి ఈవెంట్ చేయడం గొప్ప మైలేజ్‌గా భావించింది టీడీపీ. దాదాపు నెల రోజుల ముందు నుంచే… దీనికి సంబంధించిన ఏర్పాట్లు జరిగాయి. ఒక రకంగా కూటమి క్యాబినెట్ మొత్తం ఇక్కడే మోహరించింది. ఆ ప్రాంతం.. ఈ ప్రాంతం అనేది లేకుండా రాష్ట్రంలో ఉన్న కూటమి ఎమ్మెల్యేలంతా వచ్చి
యోగాంధ్ర కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడం కోసం… అటు ప్రభుత్వం, ఇటు పార్టీ పరంగా కీలక కమిటీలు వేసి బాధ్యతలు అప్పగించారు. పీఎం సహా… ప్రముఖులను స్వాగతించడం దగ్గర నుంచి వివిధ రకాల ఏర్పాట్ల పర్యవేక్షణ కోసం శాసనసభ్యులకు బాధ్యతలు ఇవ్వగా… దాన్ని గౌరవంగా భావించారు అంతా.
Read Also: Rashmika : అనుష్క, కీర్తి సురేష్ బాటలో రష్మిక..!
అలా ఎక్కడెక్కడి వాళ్ళకో.. బాధ్యతలు ఇచ్చారుగానీ… సొంత జిల్లాలో సీనియర్స్ అయిన మమ్మల్ని ఎందుకు పట్టించుకోలేదంటూ తీవ్రంగా మధనపడుతున్నారట బండారు సత్యనారాయణ మూర్తి, కొణతాల రామకృష్ణ, కేఎస్ఎన్ఎస్ రాజు వంటి సీనియర్స్. మేమంతా చుట్టపుచూపు వ్యవహారాలతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చిందని వాళ్ళు బాధపడుతున్నట్టు సమాచారం. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన కార్యక్రమంలో తమకు బాధ్యతలు అప్పగించకపోవడాన్ని అవమానంగా ఫీలవుతున్నారట ఈ సీనియర్ శాసనసభ్యులు. అదే సమయంలో జూనియర్ నేతలు, ఎమ్మెల్యేల్ని అందలం ఎక్కించడం పుండు మీద కారం చల్లినట్టుగా ఉందట. అలాగని, ఇదేమీ పంచాయితీ పెట్టుకునే వ్యవహారం కాకపోయినా… మంచి సాంప్రదాయం కాదని మాజీ మంత్రులు ఇద్దరూ అభిప్రాయపడుతున్నట్టు తెలుస్తోంది. ఇప్పటికే వీళ్ళు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో అంతర్గత విభేదాలు భగ్గుమంటున్నాయి. అనకాపల్లిలో కొణతాల రామకృష్ణకు, టీడీపీ సీనియర్ నేత, మాజీమంత్రి దాడి వీరభద్రరావుకు అస్సలు పడటం లేదంటున్నారు. ఏ కార్యక్రమం అయినా ఇద్దరూ… ఎడముఖం పెడముఖంగా వుంటున్నారట. ఈ క్రమంలో అనకాపల్లి రాజకీయాలు బాయిలింగ్ స్టేజ్‌కు చేరుకున్నట్టు చెప్పుకుంటున్నారు. ఇటు నియోజకవర్గంలో స్థిరత్వం లేకపోవడం, అటు ప్రభుత్వ ప్రతిష్టాత్మక కార్యక్రమంలో భాగస్వామ్యం దక్కకపోవడాన్ని కొణతాల రామకృష్ణ తీవ్ర అవమానంగా ఫీలవుతున్నట్టు తెలిసింది.
Read Also: Thamannah : దంగల్ బ్యూటీతో విజయ్ వర్మ డేటింగ్.. తమన్నా షాకింగ్ పోస్ట్..
అటు మాడుగుల ఎమ్మెల్యే బండారుకు …..మాజీ ఎమ్మెల్యే గండిబాబ్జీకి మొదటి నుంచి పక్కలో బల్లెంలాంటి వ్యవహారమే. ప్రస్తుతం ఇద్దరూ వేరువేరు నియో జకవర్గాల్లో రాజకీయాలు చేసుకుంటున్నా… ఒకరి నీడను ఒకరు భరించలేని పరిస్ధితి. అర్బన్ పార్టీ అధ్యక్షుడుగా గండిబాబ్జీ సహజంగానే రూరల్ ప్రాంతానికి చెందిన బండారు ఆధిపత్యాన్ని అంగీకరించడం లేదు. ఇద్దరి వ్యవహారాన్ని టీడీపీ అధిష్టానం కూడా చూసీ చూడనట్టు వదిలేసిందట. ఇక నియోజకవర్గం బౌండరీ దాటడానికి కూడా ఇష్ట పడని చోడవరం ఎమ్మెల్యే కేఎస్ఎన్ఎస్ రాజుకు ఇటీవల ఇంటిపోరు ఎక్కువైందంటున్నారు. ఇక్కడ జనసేన, టీడీపీ నాయకత్వంపై కత్తి దూస్తోందట. ఇసుక, గ్రానైట్ అక్రమ తవ్వకాలు, అవకతవకలు ఎక్కువయ్యాయని ఆరోపిస్తూ ఆందోళనలు సైతం జరుగుతున్నాయి. ఈ పరిస్ధితుల్లో సీనియర్స్‌కు బాధ్యతలు ఇద్దామని పార్టీ పెద్దల మనసులో ఉన్నా…. అనవసరంగా తుట్టెను కదిలించినట్టు అవుతుందన్న భయం వాళ్ళని పక్కన పెట్టారా అన్న అనుమానాలు సైతం ఉన్నాయి. మొత్తం మీద కారణం ఏదైనా…ఒకప్పుడు సింగిల్ హ్యాండ్‌తో ఉమ్మడి జిల్లాను శాసించిన నాయకులు ప్రస్తుతం… మెగా ఈవెంట్‌లో పెత్తనం చేయలేకపోయామన్న అసంతృప్తితో తీవ్రంగా రగిలిపోతున్నారన్నది కేడర్ వాయిస్.