మధుయాష్కీ. టీపీసీసీ ప్రచార కమిటీ ఛైర్మన్. గతంలో నిజామాబాద్ నుంచి కాంగ్రెస్ ఎంపీగా గెలిచారు. గత రెండు ఎన్నికల్లో ఓడిపోయారు. కాంగ్రెస్ పార్టీలో కీలక నేతలు ఉన్న జిల్లా నిజామాబాద్. యాష్కీతోపాటు మరో ఇద్దరు కీలక నేతలుకు పీసీసీలో పదవులు ఉన్నాయి. కానీ.. నాయకులంతా ఎవరికివారే. ఇటీవల టీపీసీసీ కమిటీ కూర్పు రాష్ట్రస్థాయిలో నేతలను రెండుగా చీల్చేసింది. మీడియా ముందు ఓపెన్‌గానే విమర్శలు.. సవాళ్లు చేసుకున్నారు నేతలు. ఆ సమస్యపై కాంగ్రెస్ హైకమాండ్ చికిత్స చేస్తున్నా.. పీసీసీ స్థాయిలో వచ్చిన విభజన జిల్లా వరకు పాకింది. ఆ విధంగా మాజీ ఎంపీ మధుయాష్కీపై నిజామాబాద్ జిల్లాలోని కొందరు కాంగ్రెస్ నేతలు ఒంటికాలిపై లేస్తున్నారు.
మధుయాష్కీ జిల్లాకు వస్తే సహాయ నిరాకరణ చేయాలని నిర్ణయించారట. జిల్లాకు దూరంగా ఉంటున్న మాజీ ఎంపీకి.. పూర్తిగా దూరంగా ఉండాలని కేడర్‌కు చెప్పారట నాయకులు. మాజీ మంత్రి సుదర్శన్‌రెడ్డితో ఉన్న విభేదాలు..పీసీసీ చీఫ్ రేవంత్ వ్యతిరేక శిబిరంలో ఉండటంతో ఆ చీలిక క్షేత్రస్థాయిలోనూ స్పష్టంగా కనిపిస్తోంది. రేవంత్‌కు వ్యతిరేకంగా నిలిచిన వారిలో జిల్లా నుంచి యాష్కీ ఉన్నారు. మిగతా నేతలంతా పీసీసీ చీఫ్‌వేపే ఉన్నారని.. వాళ్లంతా ఇప్పుడు యాష్కీ అంటే ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని టాక్. పైగా డీసీసీ అధ్యక్షుడిని మార్చాలని యాష్కీ పట్టుబట్టడం అగ్గికి ఆజ్యం పోసిందట. జిల్లాలోని పలువురు నాయకులంతా యాష్కీని ఒంటరిని చేయాలని డిసైడ్ అయినట్టు చెబుతున్నారు. మధుయాష్కీని ఎవరూ కలవొద్దని కేడర్‌కు మౌఖిక ఆదేశాలు జారీ చేస్తున్నారట.
నిజామబాద్ నుంచి రెండుసార్లు ఎంపీగా చేసినా సొంతగా కేడర్‌ను ఏర్పాటు చేసుకోలేకపోయారు యాష్కీ. రాబోయే ఎన్నికల్లో మరోసారి ఇదే స్థానం నుంచి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతున్నా.. ఆయన మాత్రం లోకల్‌గా అంత యాక్టివ్‌గా కనిపించడం లేదు. గతంలో మాజీ ఎమ్మెల్యే ఈరవత్రి అనిల్ ఓపెన్‌గానే మధుయాష్కీపై విమర్శలు చేశారు. జిల్లా కాంగ్రెస్‌లోనూ మాజీ ఎంపీపై చర్యలు తీసుకోవాలని తీర్మానించారు. అప్పటి నుంచి జిల్లా నాయకులతో మాజీ ఎంపీకి గ్యాప్ వచ్చేసింది. ఆ దూరం పెరిగిందే తప్ప తగ్గలేదు. వీటికి పీసీసీ స్థాయిలో జరిగిన తాజా పరిణామాలు సైతం నాయకుల మధ్య మరింత నిప్పు రాజేసినట్టు అయ్యింది. వచ్చే ఎన్నికలను కాంగ్రెస్ పార్టీకి ప్రతిష్ఠాత్మకం. వరుసగా రెండు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయింది. గెలిచిన ఎమ్మెల్యేలు జంప్ కొట్టారు. ఈ సమయంలో కలిసి సాగాల్సిన నేతలు ఈ విధంగా ఉప్పు నిప్పులా ఉండటం.. తీర్మానాలు.. మౌఖిక ఆదేశాలు జారీ చేయడం రచ్చ రచ్చ అవుతోంది.