NTV Telugu Site icon

Off The Record: నెల్లూరు వైసీపీలో లుకలుకల రచ్చ.. డబుల్‌ గేమ్‌ నేతలపై హైకమాండ్‌ సీరియస్‌

Ysrcp

Ysrcp

Off The Record: వైసీపీలో అసమ్మతి గళాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ముఖ్యంగా నెల్లూరు జిల్లాలో లుకలుకలు ఓ రేంజ్‌లో రచ్చకెక్కుతున్నాయి. ఇప్పటికే నెల్లూరు జిల్లా వెంకటగిరి ఎమ్మెల్యే ఆనం రామనారాయణరెడ్డి… ప్రభుత్వానికి, పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడటం, ఈ వ్యవహారాన్ని హైకమాండ్ సీరియస్‌గా తీసుకోవడం వంటి పరిణామాలు జరిగిపోయాయి. వెంకటగిరి నియోజకవర్గానికి ఇన్‌ఛార్జ్‌గా ఆనంను తప్పించి… నేదురుమల్లి రామ్‌కుమార్ రెడ్డిని నియమించింది. ఇప్పుడు నెల్లూరు రూరల్ నియోజవర్గం వంతు వచ్చింది. నెల్లూరు రూరల్‌ నియోజకవర్గ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచే అసంతృప్తిలో ఉన్నారనే ప్రచారం ఉంది. అధికారంలోకి వచ్చిన వెంటనే తనకు మంత్రి పదవి వస్తుందని ఆయన ఆశించారు.

Read Also: RTC Bus: బెజవాడలో హోటల్‌లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు..

అయితే మంత్రి పదవి రాకపోవటమే కాకుండా తన కంటే జూనియర్ అయిన అనిల్‌కుమార్ యాదవ్‌కు క్యాబినెట్‌లో బెర్త్ దక్కటంతో ఆయన మరింత రగిలిపోయారట. ‘మొగుడు కొట్టినందుకు కాదు… తోడి కోడలు నవ్వినందుకు’ అన్నట్లుగా అయ్యింది కోటంరెడ్డి వ్యవహారం. అప్పటినుంచే అవసరం వచ్చినప్పుడు పార్టీ కంటే… సొంత ఇమేజ్ కోసం ఆయన ప్రయత్నించటం మొదలుపెట్టినట్లు చర్చ జరుగుతోంది. సెకెండ్ ఫేస్ క్యాబినెట్‌లో అయినా బుగ్గ కారు ఎక్కవచ్చునని ఆశించినా… సామాజిక సమీకరణాల కారణంగా కోటంరెడ్డికి అవకాశం దక్కలేదు. అమరావతి రైతుల యాత్ర నెల్లూరు వచ్చినప్పుడు ప్రత్యేకించి వారు ఉన్న శిబిరానికి వెళ్లి పరామర్శించి రావటం అప్పట్లో చర్చనీయాంశంగా మారిన విషయాన్ని గుర్తు చేస్తున్నాయి పార్టీ వర్గాలు. మరోవైపు, కోటంరెడ్డి బెట్టింగ్ కేసుల్లో పూర్తిగా కూరుకుపోయి ఉన్నారని…ఆ విషయంలోనూ తీవ్ర అసంతృప్తిలో ఉన్నారన్న ప్రచారం పార్టీ వర్గాల్లో జరుగుతోంది. సమస్య ప్రారంభంలోనే పార్టీ రీజనల్ కోఆర్డినేటర్లు, సీనియర్లు కూడా కోటంరెడ్డిని బుజ్జగించే ప్రయత్నం చేయలేదని సమాచారం. ఈలోపు కోటంరెడ్డి కూడా పార్టీ నిర్ణయానికి విలువ ఇవ్వాల్సి ఉన్నా… పార్టీ లైన్‌ను దాటి టీడీపీ నేతలతో టచ్‌లోకి వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. ప్రభుత్వ అధికారులపై ఓపెన్‌గా కామెంట్లు చేయటంతో… కోటంరెడ్డిని పిలిపించారు ముఖ్యమంత్రి జగన్. జనవరి రెండో తేదీన ముఖ్యమంత్రితో కోటంరెడ్డి దాదాపు గంట సేపు వన్ టు వన్ సమావేశం అయ్యారు. నియోజకవర్గ అభివృద్ధి నుంచి రాజకీయ అంశాల వరకు మాట్లాడి బుజ్జగించే ప్రయత్నం చేశారు. ఆ సమావేశం తర్వాత కోటంరెడ్డి కూడా ముఖ్యమంత్రితో సమావేశంపై సంతృప్తి వ్యక్తం చేశారు.

Read Also: Nick Vujicic: ఏపీ సీఎంను కలిసిన ప్రపంచ ప్రఖ్యాత మోటివేషనల్‌ స్పీకర్‌ నిక్‌ వుజిసిక్‌.. జగన్‌ ఓ హీరో..!

అయితే అప్పటికే కోటంరెడ్డి ఒక ఎజెండా ఫిక్స్ చేసుకుని ఉన్నారనీ, హైదరాబాద్ వెళ్లి చంద్రబాబుతో కలిశారనీ పార్టీ పెద్దలకు సమాచారం చేరిందట. 2024 ఎన్నికల్లో టీడీపీ టికెట్‌పై పోటీ చేయనున్నట్లు కోటంరెడ్డి మాట్లాడిన ఆడియో టేపు లీక్ కావటంతో మరింత స్పష్టత వచ్చినట్లు అయ్యింది. దీంతో పార్టీ పెద్దలు కూడా కోటంరెడ్డి ఎపిసోడ్‌కు ఫుల్‌స్టాప్ పెట్టాలనే నిర్ణయానికి వచ్చారట. అందరికీ అవకాశాలు ఒకేసారి ఇవ్వటం సాధ్యం కాదనీ, పార్టీకి లాయల్‌గా ఉండటం అన్నింటికంటే ముఖ్యం అన్న మెసేజ్ పార్టీ ఇతర నేతలకు ఇవ్వాలనుకుంటుందట. ఇతర పార్టీలతో టచ్‌లో ఉండి… ఇక్కడ డబుల్ గేమ్ ఆడాలనుకునే నేతల విషయంలో పార్టీ హైకమాండ్ ఉపేక్షించదని పార్టీ వర్గాలు అంటున్నాయి. అందుకే కోటంరెడ్డి వ్యవహారానికి తెరదించేయాలన్న నిర్ణయానికి అధికార వైసీపీ వచ్చేసిందనీ, అధికారిక ప్రకటన రావడమే తరువాయనీ పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ సాగుతోంది.