Nick Vujicic: ప్రపంచ ప్రఖ్యాత మోటివేషనల్ స్పీకర్ నిక్ వుజిసిక్ ఇవాళ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డిని కలిశారు.. తాడేపల్లిలోని సీఎం క్యాంప్ కార్యాలయంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితో భేటీ అయిన ఆయన.. సీఎం జగన్‌ను కలవడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు.. ప్రపంచంలో ఎక్కడా జరగని విధంగా స్ఫూర్తిదాయకమైన విద్యా కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్నాయని, విద్యారంగంలో నమ్మశక్యం కాని పురోగతిని తీసుకొచ్చిన సీఎం వైఎస్ జగన్ అంటూ ప్రశంసలు కురిపించారు.. గుంటూరుచౌత్రా సెంటర్‌లో ఉన్న ప్రభుత్వ బాలికోన్నత పాఠశాలను నిక్ మంగళవారం సందర్శించిన సంగతి విదితమే.. ఏపీలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థినులు ఆంగ్లంలో మాట్లాడుతున్న తీరు.. అందులో స్పష్టత, వారు అడుగుతున్న ప్రశ్నలకు అంతర్జాతీయ మోటివేషనల్ స్పీకర్ నిక్ వుజిసిక్ మంత్రముగ్థులయ్యారు. ‘ప్రపంచం మొత్తానికి నేను ప్రేరణగా నిలిచి ఉండవచ్చు.. కానీ, ఈ ప్రాంతం నాకు ఎంతో ప్రేరణనిచ్చింది’ అంటూ ఆయన వ్యాఖ్యానించారు..
Read Also: Union Budget 2023: బడ్జెట్‌లో యువతకు పెద్దపీట.. నైపుణ్యంపైనే దృష్టి
దాదాపు 78 దేశాల్లో నేను పర్యటించాను.. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల్లో అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తున్న ఏపీ ముఖ్యమంత్రి జగన్‌మోహన్ రెడ్డి లాంటి వ్యక్తిని నేను ఇంతవరకూ చూడలేదని.. సీఎం జగన్‌తో సమావేశం అయిన తర్వాత వ్యాఖ్యానించారు నిక్ వుజిసిక్.. ఆయన అత్యున్నతమైన లక్ష్యం కోసం ఉన్నతమైన ఆశయంతో పని చేస్తున్నారు. ఏపీలో సుమారు 45వేల ప్రభుత్వ స్కూళ్లను ఏ ప్రయివేటు స్కూళ్లకు తీసిపోనిరీతిలో అందరికీ సమాన ఆవకాశాలు కల్పించాలన్న గొప్ప లక్ష్యంతో పని చేస్తున్నారని తెలిపారు.. ఇది చాలా ఆసక్తికరమైన అంశం. ఈ రంగాల్లో ఇప్పటికే గణనీయమైన ప్రగతి కనిపిస్తోంది… ఇది అందరికీ తెలియాల్సి ఉందన్నారు.. ఇవాళ ఆయన్ను కలవడం గొప్ప గౌరవంగా భావిస్తున్నాను. స్పూర్తిదాయక వ్యక్తుల కింద నా జీవిత కథను ఆటిట్యూడ్ ఈజ్ ఆల్టిట్యూడ్ పేరుతో పదో తరగతి ఇంగ్లీష్‌లో పాఠ్యాంశంగా ప్రవేశ పెట్టారు. ఇది నాకు చాలా ఆనందం కలిగించే విషయంగా చెప్పుకొచ్చారు. విద్యారంగంలో అందరికీ సమాన అవకాశాలు కల్పించే దిశగా, మరింత మెరుగైన ఫలితాల కోసం దీర్ఘకాలిక లక్ష్యంతో పని చేస్తున్నాను. ఏపీలో విద్యారంగంలో పిల్లల ఎదుగుదలకు మంచి అవకాశాలున్నాయన్నారు.. ప్రభుత్వ స్కూళ్లలో ముఖ్యమంత్రి నాయకత్వంలో ప్రపంచ స్ధాయి ప్రమాణాలతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి.. ఈ విషయంలో ముఖ్యమంత్రి జగన్ గురించి చెప్పాలంటే ఆయన ఓ హీరో అంటూ ఆకాశానికి ఎత్తేశారు. ఇంతవరకూ ఇలా ఎక్కడా జరగలేదు. సీఎం చాలా నిబద్ధత, క్రమశిక్షణ కలిగిన వ్యక్తి. ఆయనను కలవడం చాలా గౌరవంగా భావిస్తున్నాను అన్నారు ప్రపంచ ప్రఖ్యాత మోటివేషనల్ స్పీకర్ నిక్ వుజిసిక్.