OFF The Record: ఇద్దరూ అధికారపార్టీ ప్రజాప్రతినిధులే. ఒకరు ఎమ్మెల్యే .. ఇంకొకరు ఎమ్మెల్సీ. మొన్నటి వరకు కలిసిమెలిసి సాగిన నాయకులే. ఉన్నట్టుండి ఇద్దరి మధ్య అగ్గి రేగింది. పరస్పరం ఫిర్యాదులు చేసుకునేంతగా విభేదాలు వచ్చాయి. పార్టీ కోసం కలసి సాగాల్సిన నేతలు.. ఎందుకు కొట్టుకుంటున్నారు? ఎవరా నాయకులు?
శృంగవరపుకోటలో ఎమ్మెల్యే వర్సెస్ ఎమ్మెల్సీ
విజయనగరం జిల్లా శృంగవరపుకోట నియోజకవర్గం. సిట్టింగ్ ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు. ఇదే నియోజకవర్గానికి చెందిన రఘురాజు ఎమ్మెల్సీ. ఇద్దరూ వైసీపీ నేతలే. నువ్వానేనా అన్నట్టుగా ఆధిపత్యపోరుకు తెరతీస్తున్నారు. తన మాట నెగ్గాలంటే.. తన మాట నెగ్గాలని కొట్టుకునే పరిస్థితి ఉందట. వైసీపీ నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశంలోనే ఎమ్మెల్యేపై ఎమ్మెల్సీ వర్గీయులు ఎదురు తిరిగారు. మంత్రి బొత్స సత్య నారాయణ సమక్షంలోనే Sకోట ఎంపీపీ సోమేశ్వరరావు, ఎమ్మెల్సీ భార్య వైస్ MPP అయిన సుభలక్ష్మి ఓ రేంజ్‌లో గొడవకు దిగారు. రెండు వర్గాలను బుజ్జగించడానికి మంత్రి చాలా శ్రమించాల్సి వచ్చింది.
వాస్తవానికి శృంగవరపుకోట టీడీపీకి కంచుకోట. అలాంటి నియోజకవర్గంలో వైసీపీ పాగా వేసింది. స్థానికేతరుడైనా శ్రీనివాసరావును ఎమ్మెల్యేగా గెలిపించారు ఓటర్లు. అందరినీ కలుపుకొని వెళ్లబోరని ఎమ్మెల్యేపై మొదటి నుంచి విమర్శలు ఉన్నాయి. కానీ మంత్రి బొత్స వర్గీయుడైన రఘురాజుతో కలిసిమెలిసి సాగారు ఎమ్మెల్యే. ఇద్దరూ పాలు నీళ్లలా కలిసిపోయారని అనుకునేవారు. రఘురాజు లేకుండా ఏపనీ మొదలుపెట్టేవారు కాదు ఎమ్మెల్యే శ్రీనివాసరావు. అలాంటిది రఘురాజుకు ఎమ్మెల్సీ పదవి వచ్చాక పరిస్థితుల్లో మార్పులు వచ్చాయట. ఇద్దరూ నువ్వానేనా అనుకునేంతంగా గొడవలు ఉన్నాయని టాక్. ప్రొటోకాల్ కోసం ఇద్దరూ వీధి పోరాటాలకు దిగుతున్నారు. వేర్వేరుగా పార్టీ సమావేశాలు నిర్వహించడం.. పార్టీ పదవుల విషయంలోనూ వేర్వేరుగా జాబితాలు తయారు చేసి అధిష్ఠానానికి పంపడం కామనైపోయింది.
54 మంది వాలంటీర్ల తొలగింపుపై రగడ
ఎమ్మెల్యే ప్రమేయం లేకుండానే కార్యక్రమాలు నిర్వహిస్తున్నారట ఎమ్మెల్సీ. ఇకపై Sకోటలో తాను చెప్పిందే జరుగుతుందని.. కాదని ఎవరైనా వెళ్తే మరోలా ఉంటుందని వార్నింగ్ ఇస్తున్నారట రఘురాజు. చనువిచ్చి చంకన పెట్టుకుంటే ఇదేం పద్దతి అని ఎమ్మెల్యే శ్రీనివాసరావు వాపోతున్నారట. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ఎమ్మెల్యేకు ఎమ్మెల్సీ సహకరించడం లేదట. ఇటీవల Sకోటలో సరిగా పనిచేయడం లేదని 54 మంది వాలంటీర్లను తప్పించారు. మొదటి తప్పుగా భావించి.. వారిని తిరిగి విధుల్లోకి తీసుకోవాలని అధికారులను కోరారట ఎమ్మెల్యే. అయితే ఎమ్మెల్యే మాటను పక్కన పెట్టి.. ఎమ్మెల్సీ చెప్పిందే చేస్తున్నారట అధికారులు. ఓ అక్రమ నిర్మాణం విషయంలో స్థానిక సర్పంచ్‌తో కలిసి ఎమ్మెల్సీ గేమ్ ఆడుతున్నారనేది ఎమ్మెల వర్గం ఆరోపణ. ఇంతలో ఎమ్మెల్యేను తిడుతూ.. ఎమ్మెల్సీని ప్రశంసిస్తూ రాసిన లేఖ ఒకటి నియోజకవర్గంలో హల్చల్ చేసింది. ఆ లేఖను ఎమ్మెల్సీ అనుచరుడే రాశాడని ఎమ్మెల్యే వర్గీయులు అనుమానిస్తున్నారు.
మండలాలను పంచుకుందామని ఎమ్మెల్సీ ప్రతిపాదన
తాజాగా నియోజకవర్గంలో ఉన్న ఐదు మండలాల్లో శృంగవరపుకోట, జామి, లక్కవరపుకోటలను తాను చూసుకుంటానని మిగిలిన రెండు మండలాలైన వేపాడ, కొత్తవలసలను మీరు చూసుకోవాలని ప్రతిపాదించారట ఎమ్మెల్సీ. రఘురాజు చేసిన ఈ ప్రతిపాదనకు ఎమ్మెల్యే రియాక్షన్ ఏంటో తెలియదు. Sకోట పరిణామాలను అధిష్ఠానం కూడా గమనిస్తోందట. మరి సమస్య శ్రుతిమించకుండా ఇద్దరినీ పిలిచి సెట్ చేస్తారో లేదో అని కేడర్ ఎదురు చూస్తోంది.