Off The Record: సినీ సెలబ్రెటీలతో పొలిటికల్ లీడర్స్‌కు స్నేహమో.. బంధుత్వమో ఉండటం సహజం. ఆ విషయం ముందుగానే జనానికి తెలిస్తే అందులో ప్రత్యేకంగా చెప్పుకోవడానికి ఏమీ ఉండదు. ఏదేనీ ఫంక్షన్‌కు లీడర్స్ వస్తే వచ్చారని అనుకుంటారు.. రాకపోతే ఎందుకు రాలేదు అని ఎవరికి తోచిన విధంగా వాళ్లు ఆరా తీస్తారు. అదే.. హీరోలకు.. పొలిటికల్ లీడర్స్‌కు ఉన్న సాన్నిహిత్యంపై ఎలాంటి లీకులు లేకుండా.. ఒకే ఫ్రేమ్‌లో పదే పదే తళుక్కుమంటే చర్చగా మారడం ఖాయం. హీరో మంచు మనోజ్, భూమా మౌనికారెడ్డిల వివాహంలోనూ అదే జరిగింది. కొత్త జంటతోపాటు ప్రధాన ఆకర్షణగా నిలిచిన పొలిటికల్ లీడర్ తెలంగాణలో అధికార పార్టీకి చెందిన తాండూరు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్‌రెడ్డి.
Read Also: Off The Record: ప్రకాష్‌రాజ్ ఏమైపోయారు..? ఎన్నికల్లో పోటీ చేస్తారా?
ఏదో పెళ్లికి వచ్చారు వెళ్లారు అని కాకుండా.. మనోజ్-మౌనిక జంట ఎక్కడి వెళ్లినా.. వాళ్లను అనుసరించారు ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి. పెళ్లి తర్వాత వధూవరులు కర్నూలు వెళ్లితే.. అక్కడ కనిపించారు ఈ తాండూరు ఎమ్మెల్యే. అక్కడ ఫొటో సెషన్‌లోనూ ఎమ్మెల్యేకు చోటు దక్కింది. ఆపై భూమ నాగిరెడ్డి, శోభానాగిరెడ్డి ఘాట్‌ల దగ్గర కూడా కొత్త దంపతులు.. భూమా కుటుంబ సభ్యులతో కలిసి కనిపించారు రోహిత్‌రెడ్డి. ఆపై మనోజ్-మౌనికలు తిరుమల శ్రీవారి దర్శనానికి వెళ్లితే అక్కడికీ అనుసరించారు ఈ ఎమ్మెల్యే. ఆపై మంచు ఫ్యామిలీకి చెందిన విద్యా సంస్థల దగ్గరకు వెళ్లారు. పెళ్లికి వచ్చామా.. వెళ్లామా అని కాకుండా.. మూడు ముళ్లు పడిన దగ్గర నుంచీ.. కొత్త జంట ప్రయాణం చేసిన ప్రతీ చోటుకు పైలెట్ రోహిత్‌రెడ్డి వెళ్లడం చర్చగా మారింది. ఆయన్ను గుర్తు పట్టిన వాళ్లు.. మంచు మనోజ్‌కు.. రోహిత్‌రెడ్డికి ఉన్న సంబంధం ఏంటా అని ఆరా తీస్తున్నారు.
Read Also: Off The Record: ప్రత్తిపాడు టీడీపీలో టికెట్ పంచాయితీ..?
ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి విషయంలో ఈ స్థాయిలో చర్చ జరగడానికి కారణాలు లేకపోలేదు. గత ఏడాది తెలంగాణలో వెలుగులోకి వచ్చిన ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలక వ్యక్తి రోహిత్‌రెడ్డే. ఆ తర్వాత ఈడీ కూడా ఈ తాండూరు ఎమ్మెల్యేను కార్నర్ చేసింది. ప్రస్తుతం ఈ కేసు వివిధ దశల్లో ట్రయిల్ కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకూ విచారణలో ఉంది. అందుకే హీరో మనోజ్-మౌనిక జంటతో కనిపించిన రోహిత్‌రెడ్డి కూడా ప్రధాన ఆకర్షణ అయ్యారు. ఇక్కడ ఇంకో గమ్మత్తు ఉంది. రోహిత్‌రెడ్డి తెలంగాణలో అధికారపార్టీ BRS ఎమ్మెల్యే. మనోజ్ భార్య మౌనిక కుటుంబం టీడీపీలో యాక్టివ్. ఇటు చూస్తే మనోజ్ పేరెంట్స్‌కు ఏపీలో అధికారపార్టీ అధినేతతో బంధుత్వం ఉంది. మనోజ్ తండ్రి కలెక్షన్ కింగ్ మోహన్‌బాబు కూడా గతంలో రాజ్యసభ సభ్యుడు. మోహన్‌బాబుకు ప్రధాని మోడీ దగ్గరా చనువు ఉంది. ఎవరి పొలిటికల్ ఇంట్రెస్ట్‌లు ఎలా ఉన్నా.. మనోజ్-మౌనికల పెళ్లిలోను.. ఆ తర్వాత కొత్త జంట జరిపిన పర్యటనల్లోనూ ఎమ్మెల్యే రోహిత్‌రెడ్డి కనిపించడానికి మరో బలమైన కారణం ఉందట. అదే హీరో మనోజ్.. పైలెట్ రోహిత్‌రెడ్డి స్నేహం. ఇద్దరి మధ్య గట్టి ఫ్రెండ్‌షిప్పే ఉందట. అందుకే స్నేహానికి విలువిచ్చి వధూవరులు ఎక్కడికి వెళ్లినా తోడుగా వెళ్లారట రోహిత్‌రెడ్డి.