Off The Record: విజయనగరం జిల్లా రాజకీయ వాతావరణం ఊహించని రీతిలో మారుతోంది. పైడితల్లి అమ్మవారి పండగ సాక్షిగా జరిగిన వ్యవహారాలు కొత్త అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. విజయనగరం ఉత్సవాలు, మరికొన్ని కార్యక్రమాల్లో మంత్రి వంగలపూడి అనిత హడావిడి, పబ్లిసిటీతో అటెన్షన్ తనవైపు డైవర్ట్ చేసుకోగా… ఆ ప్రభావం లోకల్ గా ఉన్న మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌పై పడ్డట్టు చెప్పుకుంటున్నారు. జిల్లాలో ఇన్ఛార్జ్ మంత్రి బాగా….. ఎక్కువ చేస్తున్నారని టీడీపీ కార్యకర్తలే గుసగుసలాడుకుంటున్నారట. పైడితల్లి అమ్మవారి పండగ సమయంలో జరిగే విజయనగరం ఉత్సవాలను స్థానిక ప్రజాప్రతినిధులే నిర్వహిస్తుంటారు. కానీ… ఈసారి మాత్రం ఇన్ఛార్జ్ మంత్రి వంగలపూడి అనిత హడివిడి… ఇంకా నిర్మొహమాటంగా మాట్లాడుకోవాలంటే ఓవర్ యాక్షన్ చేసి ఓవరాల్‌గా ఉత్సవాల్లో మరో మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ని జీరోని చేశారన్న అభిప్రాయం కేడర్‌లో వ్యక్తం అవుతోందట.
ఒక్క ఈ ఉత్సవాలేకాదు… డీఆర్సీ మీటింగ్స్, ఇతర సందర్భాల్లో కూడా… అనిత చేస్తున్న హడావిడి, పబ్లిసిటీ స్టంట్స్ దెబ్బకు కొండపల్లి కంగారు పడుతున్నట్టు చెప్పుకుంటున్నారు. అనిత పొలంలో దిగి నాట్లు వెయ్యడం, ఆటోలో ప్రయాణం చేయడం, నలుగురుతో కలిసి నృత్యాలు చెయ్యడం, పబ్లిక్ ప్రోగ్రామ్‌ల్లో ముందుండి హంగామా లాంటివి చూస్తున్న జిల్లా జనం కూడా ఆమె ఈజీ గోయింగ్ అనుకుంటూ… అటువైపు మొగ్గుతున్నారట. అయితే… హోం మంత్రి ఏదో సరదా కోసమో, ఇన్‌స్టంట్ పబ్లిసిటీ కోసమో అలా చేయడం లేదని, ఈ హడావుడి వెనక దీర్ఘకాలిక వ్యూహం ఉన్నట్టు చెప్పుకుంటున్నారు. జిల్లా మీద పూర్తి పట్టు సాధించే దిశగా ఆమె అడుగులేస్తున్నట్టు అంచనా వేస్తున్నారు రాజకీయ పరిశీలకులు. ప్రతి కార్యక్రమాన్ని పబ్లిసిటీ యాంగిల్‌లో ప్రొజెక్ట్ చేసుకోవడం అనితకు ఉన్న బలమని, దాన్నే ఇక్కడ కూడా ప్రయోగిస్తున్నారన్నది స్థానికంగా ఉన్న అంచనా. ప్రస్తుతం విజయనగరం జిల్లా టీడీపీ నాయకత్వంలో విభజన సంకేతాలు కనిపిస్తున్నాయని, ఈ విషయాన్ని పసిగట్టే… పైచేయి సాధించేందుకు అనిత పావులు కదుపుతున్నట్టు అంచనా వేస్తున్నారు పొలిటికల్ పరిశీలకులు.
అందుకు తగ్గట్టే మెల్లిగా…పార్టీలోని ఓ వర్గం ఆమెవైపు పోలరైజ్ అవుతున్నట్టు చెప్పుకుంటున్నారు. అనితకు విజయనగరం జిల్లాలో సొంత కోటరీ ఏర్పడుతోందన్న వాయిస్ బలంగా వినిపిస్తోంది.ఈ వ్యవహారంలో కొండపల్లి మౌనం మరింత ప్రశ్నార్థకంగా మారిందని పార్టీ వర్గాలే చెప్పుకుంటున్నాయి. దీంతో అనిత యాక్టివ్, కొండపల్లి పాసివ్ అనే వ్యాఖ్యలు పెరుగుతున్నాయట జిల్లా టీడీపీలో. ఈ మార్పులు తాత్కాలికమేనా లేక దీర్ఘకాల వ్యూహమా అనేది తేలాల్సి ఉందంటున్నారు కార్యకర్తలు. అనిత ప్రభావం ఇలాగే కొనసాగితే జిల్లాలో పార్టీ కార్యకలాపాలు, అభివృద్ధి నిర్ణయాలు, నాయకత్వ వ్యవస్థ.. అన్నీ ఆమె చుట్టూనే తిరిగే అవకాశం ఉందన్న టాక్ నడుస్తోంది. ఈ పరిస్థితుల్లో…కొండపల్లి తిరిగి జిల్లా మీద పట్టు పెంచుకుని తన స్థానాన్ని సాధించాలంటే స్పష్టమైన రాజకీయ కార్యాచరణ అవసరమని.. లేదంటే జిల్లాలో జస్ట్ మినిస్టర్‌గా కొండపల్లి, అసలు పవర్ సెంటర్‌గా ఇన్ ఛార్జ్ మంత్రి అనిత ఉంటారని సొంత నాయకులే చెప్పుకుంటున్నారు..