Off The Record: బెజవాడలో కేశినేని బ్రదర్స్ మధ్య మరోసారి రాజుకున్న వివాదం పొలిటికల్ ప్రకంపనలు రేపుతోంది? రెండు సార్లు ఎంపీగా గెలిచిన అన్న నానిని గత ఎన్నికల్లో మొదటి ప్రయత్నంలోనే ఓడించి రికార్డు మెజార్టీతో పాగా వేశారు తమ్ముడు కేశినేని చిన్ని. ప్రస్తుతం ఎన్టీఆర్ జిల్లా రాజకీయాల్లో కీలకంగా ఉన్న ఈ అన్నదమ్ముల మధ్య వివాదం 2024 ఎన్నికలకు ముందు బయట పడింది. నాని ఎంపీగా ఉన్నప్పుడే… టీడీపీలో యాక్టివ్ అయిపోయి ఆయనకు పక్కలో బల్లెంగా మారారట చిన్ని. చివరికి ఇద్దరి మధ్య కేసులు, సవాళ్ళ వరకు వెళ్ళింది వ్యవహారం. ఇక ఎన్నికల్లో అన్న వైసీపీ నుంచి, తమ్ముడు టీడీపీ తరపున తలపడి పరస్పర ఆరోపణలతో హీట్ పెంచారు. చివరికి ఎంపీగా చిన్ని ఎన్నికవటంతో నాని ఏకంగా రాజకీయాలకు గుడ్ బై చెప్పేశారు. మేటర్ అక్కడితో అగి ఉంటే… అది వేరే సంగతి. కానీ… ఉన్నట్టుండి ఇప్పుడు ఉర్సా క్లస్టర్స్ కంపెనీకి రాష్ట్ర ప్రబుత్వం భూ కేటాయింపుల వ్యవహారంలోకి ఎంట్రీ ఇచ్చి దాన్ని తమ్ముడు కమ్… ఎంపీ చిన్నికి ముడిపెడుతూ నాని చేసిన ఎక్స్ మెసేజ్‌లు ఇప్పుడు బెజవాడ పాలిటిక్స్‌లో సమ్మర్ సెగల్ని మరిపిస్తున్నాయి.
ఉర్సా కంపెనీపై ఆరోపణలతో మొదలైన ట్వీట్ వార్ వ్యక్తిగత స్థాయికి వెళ్ళిపోయింది. ఉర్సా కంపెనీ డైరెక్టర్‌గా ఉన్న అబ్బూరి సతీష్ ఎంపీ కేశినేని చిన్నికి సహచరుడని విశాఖలో భూములను కొట్టేయడానికి ఈ సంస్థను ఏర్పాటు చేశారని నాని మొదట ట్వీట్ చేయటంతో రచ్చ మొదలైంది. దీంతోపాటు గతంలో ట్వంటీఫస్ట్ సెంచరీ ఇన్వెస్ట్‌మెంట్స్ ప్రాపర్టీస్ లిమిటెడ్ సంస్థలో సతీష్ భాగస్వామిగా ఉన్నాడని, ఈ సంస్థ అమాయక ప్రజల నుంచి డబ్బులు వసూలు చేసి మోసం చేసిందని ఆరోపించారు. ఉర్సా వెనుక కేశినేని చిన్ని హస్తం ఉందని ఆయనపై నేరుగా ట్వీటారోపణలు చేశారు నాని. దీనికి గట్టిగానే కౌంటర్ ఇచ్చారు ఎంపీ. 1991 నుంచి 2010 వరకు కేశినేని టూర్స్ అండ్ ట్రావెల్స్ లో భాగస్వామిగా అబ్బూరి సతీష్ సోదరుడు అబ్బూరి రామకృష్ణ ఉన్నారని, వ్యాపార భాగస్వామ్యంలో తలెత్తిన విబేధాలతో ఆయనకు లెక్కలు కూడా చూపించలేదని నానికి కౌంటర్ ఇచ్చారు తమ్ముడు. తన వ్యాపార భాగస్వాములతో వివాదాలను ఉర్సాతో ముడిపెట్టి రాష్ట్ర అభివృద్ధి అడ్డుకుంటున్న సైకో నానికి చిప్ దొబ్బిందని అంటూ ఘాటు కౌంటర్ ఇచ్చారు చిన్ని. ఎవరికి ఎవరు 20 ఏళ్ళ భాగస్వామ్యంలో ఉన్నారో సైకోకే తెలియాలంటూ అబ్బూరి రామకృష్ణ కేశినేని టూర్స్ అండ్ ట్రావెల్స్ లో డైరెక్టర్‌గా ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. నాని అసలు ఉద్దేశ్యాలు వేరే ఉన్నాయని, తనను అడ్డంపెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలను తప్పుపడుతున్నారంటూ మండిపడ్డారు చిన్ని.
వ్యవహారం ఇలా సోషల్ మీడియాలో ముదిరి చేతల వరకు వెళ్ళింది. కేశినేని నాని తనపై చేసిన ఆరోపణలకు ఒకవైపు సోషల్ మీడియాలో కౌంటర్స్ వేస్తున్న చిన్ని… లీగల్ గా కూడా ముందుకెళ్ళడం చర్చనీయాంశం అయింది. 100 కోట్ల పరువు నష్టం దావా నోటీసు పంపారు ఎంపీ చిన్ని. అయితే… అలాంటి వాటికి తాను భయపడనని, ఇలానే స్పందిస్తానని లక్ష కోట్లకు నోటీసు పంపినా కామ్‌గా ఉండే ప్రసక్తే లేదంటూ తిరిగి పోస్ట్ పెట్టారు నాని. ప్రశ్నిస్తే సమాధానం ఇవ్వకుండా లీగల్ నోటీసు ఇవ్వడం కూడా ఓ రకం బెదిరింపేనన్నది మాజీ ఎంపీ వాదన. ప్రైవేటు సంస్థలకు స్థలాలు ఇస్తూ సీఎం చంద్రబాబు తీసుకున్న నిర్ణయాలను ఒకవైపు అభినందిస్తూనే మరోవైపు ఉర్సా కంపెనీ భూముల వ్యవహారంపై ఆరోపణలు చేశారు నాని. సంస్థ వెనుక చిన్ని ప్రమేయం ఉందని, అందుకే ఇదంతా చేస్తున్నానన్నది నాని మాట. అయితే… గత ఐదేళ్ళలో జరిగిన అక్రమాలపై ఒక్కసారి కూడా స్పందించని నాని ఇప్పుడు మాత్రం ప్రభుత్వ నిర్ణయాలపై ఆరోపణలు చేస్తూ అప్రతిష్ట పాలు చేస్తున్నారనేది చిన్ని మాట. క్యాబినెట్ ఆమోదంతో సంస్థలకు ప్రభుత్వం భూములు ఇస్తే కేవలం వ్యక్తిగత కక్షతో…. వైసీపీ అధ్యక్షుడు జగన్ డైరెక్షన్‌లో తనను అడ్డం పెట్టుకుని కేశినేని నాని ప్రభుత్వాన్ని బదనాం చేస్తున్నారనేది చిన్ని మాట. కేశినేని నాని చేస్తున్న ఆరోపణలపై ప్రభుత్వం కూడా సరైన సమయంలో స్పందిస్తుందని చెబుతోంది ఆయన వర్గం. అన్నదమ్ములిద్దరూ పోటా పోటీగా తగ్గేదేలే అనటంతో రాబోయే రోజుల్లో ఈ వార్ ఎంత రసవత్తరంగా మారుతుందోనని గమనిస్తున్నాయి రాజకీయ వర్గాలు.