Off The Record: సింగరేణిలో ఒకప్పుడు బలంగా ఉన్న తెలంగాణ బొగ్గుగని కార్మిక సంఘం పరిస్థితి కొంత కాలంగా దయనీయంగా మారింది. బీఆర్‌ఎస్ పెద్దల కుటుంబంలో వచ్చిన విభేదాలు సంఘం మనుగడను ప్రశ్నార్ధకం చేస్తున్నాయని.. సొంత యూనియన్ నేతలే చెబుతున్న పరిస్థితి. ఇప్పుడు తాము ఎవరివైపు ఉండాలో అర్ధంగాక సతమతం అవుతున్నారట టీబీజీకేఎస్ నాయకులు. కవిత, కేటీఆర్‌లో ఎవరికి జై కొడితే… ఎవరు కన్నెర్ర చేస్తారోనని ఆందోళనగా ఉన్నట్టు సమాచారం. ఈ గందరగోళంతో… ఇప్పటికే అంతంతమాత్రంగా ఉన్న టీబీజీకేఎస్ పరిస్థితి మరింత దిగజారుతుందని యూనియన్ నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. జాగృతి అధ్యక్షురాలిగా ఉన్న కవిత మంచిర్యాల జిల్లాతో పాటు సింగరేణి ప్రాంతాల్లో ఇటీవల పర్యటించారు. ఆ సమయంలో ఆమెను కలవాలా..? వద్దా…? అన్న మీమాంసలో ఉండిపోయారట యూనియన్ నాయకులు. అక్క మీద మరీ అభిమానం ఉన్న కొందరైతే… భయ భయంగానే వెళ్ళి రహస్యంగా కలిసివచ్చినట్టు సమాచారం. ఇక ఎందుకొచ్చిన గొడవ అనుకుని చాలామంది కవితకు దూరంగానే ఉన్నారట.
Read Also: Off The Record: గజ్వేల్ కాంగ్రెస్‌లో మూడు ముక్కలాట..!
అయితే… సింగరేణి ప్రాంతాల్లో కవిత చేసిన హడావిడితో అలర్ట్ అయిన కేటీఆర్…. వెంటనే బీఆర్‌ఎస్‌కు అనుబంధంగా ఉన్న తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం నేతలతో మాట్లాడారని, వాళ్ళతో త్వరలోనే మీటింగ్ పెట్టబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. అతి త్వరలోనే….. యూనియన్ నేతల భేటీ ఉంటుందని చెప్పడం రాజకీయ ప్రాధాన్యత సంతరించుకుంది. తెలంగాణలోని ఆరు జిల్లాల్లో విస్తరించిన సింగరేణిపై పట్టు బిగిస్తే రాష్ట్ర రాజకీయాల్లో కీలకం అవుతామన్న భావనలో ఉంటాయి రాజకీయ పార్టీలు. అందుకే ఉద్యమ సమయంలోనే ఇక్కడ తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం ఏర్పాటు చేశారు. అయితే, ఆ యూనియన్ మొదలైనప్పటి నుంచి వర్గపోరు సాగుతూనే ఉంది. ఇప్పుడు కూడా…. పార్టీ పెద్దల మధ్య సయోధ్యలేని కారణంగా…. ఎటూ పాలుపోని స్థితిలో ఉన్నామంటున్నారు నాయకులు. ఇదే సమయంలో మరికొన్ని విశ్లేషణలు కూడా తెర మీదికి వస్తున్నాయి. ఒకవేళ బీఆర్ఎస్‌తో తెగతెంపులు చేసుకుంటే.. టీబీజీకేఎస్ తన చేజారిపోకుండా… కవిత ముందు జాగ్రత్తలు తీసుకుంటుండవచ్చని, అందుకే సింగరేణి టూర్ చేసి ఉండవచ్చన్నది కొందరి అంచనా. అయితే… అట్నుంచి పెద్దగా స్పందన లేకపోవడంతో ఆమె కూడా పునరాలోచనలో పడ్డట్టు ప్రచారం జరుగుతోంది. అదే సందర్భంలో కేటీఆర్ సైతం యూనియన్ నేతలతో మాట్లాడతానని చెప్పి వ్యవహారాన్ని రసకందాయంలో పడేశారని చెప్పుకుంటున్నారు. అటు అక్క, ఇటు అన్న… ఇద్దరి మధ్య మా యూనియన్ నలిగిపోతోందని అంటున్నారట కార్మికులు. వాస్తవానికి గుర్తింపు సంఘం ఎన్నికల దగ్గర నుంచి ఫ్యామిలీ కేంద్రంగా పనిచేస్తోందన్న అపవాదు ఉంది.
Read Also: Off The Record: పవన్ కల్యాణ్ 2.0 ఎలా ఉండబోతుంది..?
పోయిన సింగరేణి ఎన్నికల్లో… ముందు పోటీ చేయవద్దని, ఆ తర్వాత చేయాలని రెండు రకాలుగా నిర్ణయాలు తీసుకోవడంతో విస్తుపోవడం కార్మిక సంఘం నేతల వంతైందట.. అప్పటి నుంచి అసంబద్దమైన నిర్ణయాలు, అస్పష్టమైన నేతల అభిప్రాయాలతో కార్మిక పోరాటాల్లో సైతం దూకుడు ప్రదర్శించలేకపోతున్నామన్న నైరాశ్యం యూనియన్ లీడర్స్‌లో పెరుగుతున్నట్టు చెబుతున్నారు. నల్లబంగారు నేలలో బాణం విరిగిపోయిందంటూ ప్రత్యర్థులు చేస్తున్న వెటకారాలు నిజమవుతున్నట్టే కనిపిస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారట టీబీజీకేఎస్ సభ్యులు. ఆ ఇద్దరు నేతల ఆధిపత్య పోరుతో ఆగమాగం అవుతున్న యూనియన్…. కార్మికులకు పూర్తిగా దూరం అవుతోందన్న వాదన సైతం వినిపిస్తోంది. వారి కుటుంబ సమస్యలు పరిష్కారం అయితేనో…… లేదా కేసీఆర్ నుంచి ఏదైనా పిలుపు వచ్చి క్లారిటి ఇస్తే తప్ప… తాము ఎటువైపు ఉండాలో అర్ధంకాని పరిస్థితిలో ఉన్నామంటున్నారు యూనియన్ నేతలు. అప్పటి వరకు తాము కవితక్క వైపా…? కేటీఆర్ వైపా..? అనే సందిగ్దత మాత్రం కొనసాగుతూనే ఉంటుందని అంటున్నారు.