Off The Record: సిద్దిపేట జిల్లా గజ్వేల్ అసెంబ్లీ నియోజకవర్గం. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న అసెంబ్లీ సెగ్మెంట్. బలమైన ప్రతిపక్ష నేత ఉన్నచోట ధీటైన అభ్యర్థి లేదా అధికార పార్టీ పార్టీ పటిష్టంగా ఉండాలని అనుకుంటారు. కానీ… గజ్వేల్ కాంగ్రెస్‌లో మాత్రం అలాంటి పరిస్థితి కనిపించడం లేదు. ప్రస్తుతం ఇక్కడ కాంగ్రెస్ ఇన్ఛార్జ్‌గా ఉన్నారు మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి. సిద్దిపేట జిల్లా కాంగ్రెస్ పార్టీని నడిపే సారథి కూడా ఆయనే. 2009లో ఎమ్మెల్యేగా గెలిచిన నర్సారెడ్డి ఆ తర్వాత గెలుపును చూడలేదు. 2014 నుంచి ఇక్కడ వరుసగా గెలుస్తూ వస్తున్నారు కేసీఆర్. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్‌ది మూడో స్థానం. 2024 లోక్ సభ ఎన్నికల్లో కాస్త పుంజుకున్నట్టు కనిపించినా… అవి అభ్యర్థిని చూసి పడ్డ ఓట్లే తప్ప పార్టీ బలం పెరిగలేదన్నది ఓ అంచనా. గజ్వేల్ కాంగ్రెస్‌లో మొదట్లో గ్రూపుల గోల ఉండేది కాదు. నర్సారెడ్డి 2014లో బీఆర్‌ఎస్‌లోకి వెళ్లి 2018లో తిరిగి కాంగ్రెస్‌లో చేరాకే సమస్య మొదలైందని అంటున్నారు.
Read Also: Hyderabad: లవర్‌తో కలిసి తల్లిని చంపిన ప్రియురాలు.. తప్పేం లేదన్న ప్రియుడి తల్లి..
స్థానిక కాంగ్రెస్ నాయకులు నర్సారెడ్డి, బండారు శ్రీకాంత్ రావు వర్గాలుగా విడిపోయి ఎవరికి వారు వేర్వేరుగా పార్టీ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీలోనే ఉన్న శ్రీకాంత్ రావు నర్సారెడ్డి గెలుపు కోసం పని చేయలేదన్నది నర్సారెడ్డి వర్గం వాదన. పార్టీ అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర అవుతున్నా ఎవరికి వారే యమునా తీరే అన్నట్టుగా గ్రూపులు కడుతున్నారు ఇద్దరు నేతలు. ఈ ఎపిసోడ్ ఇలా ఉంటే … మల్కాజిగిరి మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత ఉమ్మడి మెదక్ జిల్లా మీద ప్రత్యేక దృష్టి సారించారు. ఇక్కడ కాంగ్రెస్‌కు బలమైన నేతలు లేకపోవడం, మెదక్ లో తన కుమారుడు రోహిత్ ఎమ్మెల్యే గా ఉండటంతో ఆయన ఇక్కడ యాక్టివ్ అయినట్టు చెబుతున్నారు. ఇక సిద్దిపేట, దుబ్బాక, గజ్వేల్, నర్సాపూర్ నియోజకవర్గాల్లో BRS ఎమ్మెల్యేలే ఉండటంతో… ఆయా సెగ్మెంట్స్‌లో కాంగ్రెస్ పార్టీ బాధ్యతలు ఆయనే చూస్తున్నాడు. ఈ క్రమంలో గజ్వేల్ నేతల్ని ఏకతాటిపైకి తెచ్చే ప్రయత్నం చేశారు మైనంపల్లి. విబేధాలు పక్కన పెట్టి అందరూ కూడా పార్టీ కోసం పని చేయాలని పిలుపునిచ్చారు. సీన్ కట్ చేస్తే కొన్ని రోజులుగా గజ్వేల్ కాంగ్రెస్‌లో మరో వర్గం తయారయ్యిందట. అదే మైనంపల్లి హనుమంతరావు వర్గం. గ్రూపులు వద్దన్న నాయకుడే ఇప్పుడు ఓ గ్రూపు తయారు చేయడంతో కాంగ్రెస్ కార్యకర్తలు ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఉన్నట్టు తెలుస్తోంది.
Read Also: Top Headlines @ 9 PM: టాప్ న్యూస్
ఈ పరిణామంలో మొత్తం మూడు ముక్కలాట నడుస్తోందని అంటున్నారు పరిశీలకులు. మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి నియోజకవర్గంలో నామినేటెడ్ పోస్టులు అమ్ముకుంటున్నారని, నాయకులు డబ్బు ఇస్తేనే పోస్టులు ఇస్తున్నారంటూ మైనంపల్లికి కొందరు కాంగ్రెస్ నాయకులు ఫిర్యాదు చేసినట్టు సమాచారం. ఇదే అంశంపై మైనంపల్లి, నర్సారెడ్డి మధ్య గ్యాప్ వచ్చినట్టు ప్రచారం జరుగుతోంది. ఈ ప్రచారాన్ని నర్సారెడ్డి వర్గం కొట్టి పారేసింది. నర్సారెడ్డికి తాము డబ్బులు ఇవ్వలేదంటూ… నామినేటెడ్ పోస్టులు వచ్చిన వారు దేవుళ్ళ పటాల మీద ప్రమాణం చేశారు. మల్కాజిగిరిలో చెల్లని మైనంపల్లి గజ్వేల్‌లో పెత్తనం చెలాయించడం ఏంటని బహిరంగంగా ప్రశ్నిస్తున్నారు లోకల్ కాంగ్రెస్ లీడర్స్. గ్రూపులు వద్దన్న మైనంపల్లే ఇప్పుడు గ్రూపులను ప్రోత్సహించడం ఏంటని అంటున్నారు. బలమైన ప్రత్యర్థి, మాజీ సీఎం ఎమ్మెల్యేగా ఉన్న నియోజకవర్గంలో ఇలా కొట్టుకుంటే… గెలుపు సంగతి తర్వాత… కనీసం పోటీ ఇవ్వగలుగుతామా అని తమలో తాము ప్రశ్నించుకుంటున్నారట కాంగ్రెస్ కార్యకర్తలు.